కెరీర్ ప్రారంభంలో చేదు అనుభవం..
భర్త సపోర్ట్‌తో ధైర్యంగా నిలిచిన నటి
చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడానికి నటీనటులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళా నటులు వృత్తిపరమైన హద్దులు, వ్యక్తిగత గౌరవం విషయంలో ఎదుర్కొనే ఇబ్బందులు అప్పుడప్పుడు చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా నటి ప్రియా బాపట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ అసౌకర్యకర అనుభవాన్ని వెల్లడించారు.
ఒక సినిమా సమయంలో కథకు పెద్దగా అవసరం లేకపోయినా, దర్శకుడి ఒత్తిడితో ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని ప్రియా తెలిపారు. స్క్రిప్ట్ రీడింగ్ దశ నుంచే ఆ సీన్‌పై తనకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ, నటిగా తనను నిరూపించుకోవాలనే ఆలోచనతో అంగీకరించానని చెప్పారు. అయితే షూటింగ్ సమయంలో కొన్ని పరిణామాలు తనను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాట చిత్రీకరణ సమయంలో సహనటుడు రిహార్సల్స్‌లో లేని విధంగా ప్రవర్తించాడని, ప్రొఫెషనల్ హద్దులు దాటేలా వ్యవహరించాడని ప్రియా వెల్లడించారు. ఆ సమయంలో ఎలా స్పందించాలో తెలియక మౌనంగా ఉండిపోయానని చెప్పారు. అంతేకాకుండా హోటల్ గదిలో ఉన్నప్పుడు కూడా సదరు నటుడు మెసేజ్‌లు చేస్తూ, డిన్నర్‌కు రావాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ క్లిష్ట సమయంలో తన భర్త, నటుడు ఉమేష్ కామత్ ఇచ్చిన మద్దతు తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని ప్రియా తెలిపారు. భోపాల్ షెడ్యూల్ సమయంలో జరుగుతున్న విషయాలను ప్రతిరోజూ ఫోన్‌లో భర్తకు చెప్పేదాన్నని, పరిస్థితి అర్థం చేసుకున్న ఉమేష్ తాను అడగకుండానే ముంబై నుంచి షూటింగ్ సెట్‌కు వచ్చి మూడు రోజులు తనతోనే ఉన్నారని చెప్పారు.
ప్రస్తుతం ప్రియా బాపట్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె చెప్పిన ఈ అనుభవం సినిమా సెట్స్‌లో సమ్మతి, ప్రొఫెషనలిజం, మహిళా నటుల భద్రత వంటి అంశాలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తోంది.




