డేటా రాజధానిగా హైదరాబాద్.. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ చూపు భాగ్యనగరంపైనే!
అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ దృష్టిలో హైదరాబాద్
ఒకప్పుడు ఐటీ కంపెనీల కేంద్రంగా పేరొందిన హైదరాబాద్.. ఇప్పుడు మరో కీలక రంగంలో తన సత్తా చాటుతోంది. దేశంలో డేటా సెంటర్ల హబ్‌గా ఎదుగుతున్న నగరంగా భాగ్యనగరం అంతర్జాతీయ టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెజాన్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో డేటా సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టింది. తాజాగా ఒరాకిల్ కూడా హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఈ రంగంలో నగర ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సేవల వినియోగం పెరుగుతుండటంతో డేటా నిల్వ, నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
భారత్‌లో 100 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండటం ఈ పెట్టుబడులకు ప్రధాన కారణంగా మారింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ గతేడాది ప్రకటించిన రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పుణె, చెన్నై, ముంబయిలలో ఇప్పటికే డేటా సెంటర్లు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో నిర్మిస్తున్న సముదాయమే సంస్థకు అతిపెద్ద కేంద్రంగా మారనుంది. షాద్‌నగర్, మేకగూడ, చందన్‌వెల్లి ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొత్తూర్, నందిగామ ప్రాంతాల్లో కూడా భూముల కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. మరోవైపు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే మూడు జోన్ల ద్వారా సేవలు అందిస్తోంది. ఇప్పుడు ఒరాకిల్ ప్రవేశం కూడా ఖరారవడంతో హైదరాబాద్ డేటా సెంటర్ రంగంలో మరింత కీలక స్థానాన్ని సంపాదించనుంది.
ఈ వృద్ధి గణాంకాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. 2022లో 60.9 మెగావాట్లుగా ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 2025 నాటికి 151.4 మెగావాట్లకు పెరిగింది. అదనంగా 1.9 గిగావాట్ల సామర్థ్యంతో పలు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. స్థిరాస్తి సేవల సంస్థ Knight Frank India విడుదల చేసిన “ఇండియా డేటా సెంటర్ మార్కెట్ అప్‌డేట్-2025” నివేదిక ప్రకారం, డేటా సెంటర్ సామర్థ్యం పరంగా ముంబై తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. భౌగోళిక అనుకూలత, జీపీయూ ఆధారిత కంప్యూటింగ్‌కు అవసరమైన మౌలిక వసతులు, లిక్విడ్ కూలింగ్ వంటి ఆధునిక సాంకేతికతలకు ప్రభుత్వ మద్దతు ఈ రంగం విస్తరణకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. అదానీ కానెక్స్, ఎన్టీటీ వంటి సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో, రాబోయే కాలంలో హైదరాబాద్ కేవలం ఐటీ నగరంగానే కాకుండా దేశ డేటా రాజధానిగా కూడా గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది.



