ఎన్నికలు లేకున్నా తెలంగాణలో ఎన్నికల వేడి..
సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటెక్కుతున్న రాజకీయాలు
ఎన్నికలు లేకున్నా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల బహిరంగ సవాళ్లు, ప్రతి సవాళ్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయ వేదికపై నాయకులు ఒకరినొకరు ప్రశ్నించుకోవడం మాత్రమే కాదు, “నిరూపించగలవా?”, “ధైర్యం ఉంటే రా!” అంటూ ప్రత్యక్ష సవాళ్లకు దిగుతున్నారు. వేసవి ఎండలు భగ్గుమంటున్నా, ప్రజల దృష్టి మాత్రం రాజకీయ వేడిపైనే నిలుస్తోంది. అధికార పక్షం ఒక మాట అంటే ప్రతిపక్షం రెండు మాటలు అంటోంది. ప్రతిపక్షం ఆరోపణలు చేస్తే, అధికార పక్షం వాటికి అంతే ఘాటుగా బదులిస్తోంది. దీంతోనాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రతిరోజూ ఏదో ఒక ఏదో ఒక సవాల్, దానికి వెంటనే మరో ప్రతిసవాల్… ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల దినచర్య. ఇటీవలి కాలంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ హామీలు, అవినీతి ఆరోపణలు, ప్రజా 12సమస్యలు వంటి అంశాలపై అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాగ్వాదాలు మరింత తీవ్రంగా మారాయి. విమర్శలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన సవాళ్ల వరకూ వెళ్తున్నాయి. దీంతో రాజకీయ చర్చల కేంద్ర బిందువుగా ప్రజా సమస్యలతో పాటు నేతల సవాళ్లు కూడా మారిపోయాయి.




