Children Moral Story Telugu | స్కూల్‌కి వెళ్లకూడదని కోరుకున్న ప్రసాద్.. చివరికి ఏం జరిగింది?
Children Moral Story Telugu | మోరల్ స్టోరీ
ప్రసాద్‌కు ఉదయాన్నే లేచి స్కూల్‌కి వెళ్లడం అంటే పెద్ద యుద్ధమే. కానీ ఆ రోజు మాత్రం తెల్లవారుజామునే నాలుగు గంటలకు తానే మేల్కొన్నాడు. బయట వర్షం పడుతున్న శబ్దం విని, “ఇలానే వర్షం పడితే రేపు స్కూల్‌కి వెళ్లనక్కర్లేదు!” అని మనసులో ఆనందపడ్డాడు.
అందుకు మరో కారణం కూడా ఉంది. మరుసటి రోజు మ్యాథ్స్ క్లాస్ టెస్ట్. కానీ చదవడానికి సమయం దొరకలేదు. ఊరిలో మారేడమ్మ తల్లి పండగ ఉండటంతో అమ్మ లక్ష్మి మిల్లుకి వెళ్లి పిండి పట్టించమంది. సాయంత్రం వెళ్లిన ప్రసాద్ రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరాడు. అలసటతో చదవలేకపోయాడు.
ఉదయం వర్షం ఆగిపోయి సూర్యుడు వెలిగేసరికి, “అయ్యో… స్కూల్‌కి వెళ్లాల్సిందే!” అని బాధపడ్డాడు. అదే సమయంలో తమ్ముడు రమేష్ అకస్మాత్తుగా కక్కుకోవడం మొదలుపెట్టాడు. కంగారుపడ్డ ప్రసాద్ “అమ్మా!” అని గట్టిగా పిలిచాడు.
లక్ష్మి వచ్చి చూసేసరికి, రాత్రి పిండి వంటలు ఎక్కువగా తినడం వల్ల అరగక కక్కుతున్నాడని అర్థమైంది. ఇంటిని శుభ్రం చేసి, సమయం చూసేసరికి స్కూల్ టైం దాటిపోయింది.
“ఈ రోజు ఇద్దరూ ఇంట్లోనే ఉండిపోండి. పండగ రోజు కూడా కదా!” అని లక్ష్మి నవ్వింది.
ప్రసాద్ ఆనందంతో గంతేశాడు. కానీ రమేష్ మాత్రం, “అమ్మ… అన్నయ్యకి ఎగ్జామ్స్ అన్నాడు.
అది విని లక్ష్మి, “ఏదైనా సరే, స్కూల్ మానేయడం మంచిది కాదు” అని మందలించింది. ప్రసాద్ బిక్కమొహం వేసుకున్నాడు. వెంటనే ఆమె ప్రేమగా, “మళ్లీ ఇలా జరగకూడదు” అని చెప్పింది.
“పండగ పని కోసం నీకు సహాయం చేద్దామని చదవలేదు అమ్మ,” అని ప్రసాద్ తలదించుకున్నాడు.
అప్పుడు లక్ష్మి అతన్ని దగ్గరకు తీసుకుని, “నిన్ను నమ్మి రమేష్ బాధ్యత నీకే ఇస్తున్నా. నాన్న పనుల్లో ఉంటాడు. నేను బంధువుల కోసం ఏర్పాట్లు చూసుకోవాలి. నువ్వు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలి” అంది.
తమ్ముడంటే ప్రసాద్‌కు ప్రాణం. “సరే అమ్మా! తమ్ముడికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తాను” అని మాట ఇచ్చాడు.
ఆ రోజు మొత్తం తమ్ముడికి అన్నం తినిపించాడు, ఆడించాడు, హోంవర్క్ కూడా చేయించాడు. రాత్రికి బంధువులంతా ఇంటికి వచ్చేశారు. ఇల్లు నవ్వులతో కళకళలాడిపోయింది.
మరుసటి రోజు అమ్మవారి జాతర. అందరూ కొత్త బట్టలతో గుడికి బయలుదేరారు. వెళ్లే ముందు లక్ష్మి పిల్లలకు, “జనం ఎక్కువగా ఉంటారు… దగ్గరగా ఉండాలి” అని హెచ్చరించింది.
జాతర సంతోషంగా ముగిసింది. మూడో రోజు బంధువులు తిరిగి వెళ్లే సమయం వచ్చింది. వారిని బస్టాప్‌కి దించడానికి నాన్న జగన్నాథం వెళ్లాడు. ప్రసాద్, రమేష్ ఇద్దరూ వెంటపడ్డారు.
బస్టాప్ రద్దీగా ఉంది. చివరకు బస్సు వచ్చింది. జగన్నాథం బంధువులందరినీ ఎక్కించడంలో బిజీ అయ్యాడు. బస్సు కదిలిపోయాక తిరిగి చూసేసరికి ప్రసాద్ మాత్రమే కనిపించాడు.
“రమేష్ ఎక్కడ?” అని అడిగాడు.
“నాకు తెలియదు నాన్న… నీతోనే ఉన్నాడనుకున్నాను!” అన్నాడు ప్రసాద్.
ఆ మాట విన్న జగన్నాథం గుండె ఆగినంత పని అయ్యింది. చుట్టూ వెతికాడు. బస్సులు, షాపులు, రోడ్లు… ఎక్కడా రమేష్ కనిపించలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇంటికి వెళ్లి విషయం చెప్పగానే లక్ష్మి కుప్పకూలిపోయింది.
“అందుకే తీసుకెళ్లొద్దనన్నా వినలేదు!” అంటూ బోరున విలపించింది.
ఇక ప్రసాద్ కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
“అమ్మ… నువ్వు తమ్ముడి బాధ్యత నాకిచ్చావు. నేను చూసుకోలేదు. తప్పు అంతా నాదే…” అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఆ రాత్రంతా ఇంట్లో ఎవరికీ నిద్రపట్టలేదు. దేవుడిని ప్రార్థిస్తూ గడిపారు.
మరుసటి ఉదయం ఫోన్ మోగింది. వణుకుతున్న చేతులతో లక్ష్మి ఫోన్ ఎత్తింది.
అటు నుంచి ఆమె అక్క స్వరం—
“లక్ష్మి… రమేష్ మాతోనే వచ్చాడు!”
బస్సు రద్దీలో పిల్లాడు తమతో ఎక్కిపోయాడట. కండక్టర్ అడిగాకే గమనించారు. అప్పటికే బస్సు చాలా దూరం వెళ్లిపోయింది. అందుకే తమతో తీసుకెళ్లారని చెప్పింది.
ఆ మాట విన్న వెంటనే లక్ష్మి ఊపిరి పీల్చుకుంది.
పక్కనే ఉన్న ప్రసాద్ ఆనందంతో, “నాన్నా! తమ్ముడు క్షేమంగా ఉన్నాడు!” అని అరిచాడు.
జగన్నాథం కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఆ ఇంటి మీద కమ్ముకున్న భయం ఒక్క క్షణంలో కరిగిపోయింది.
ఆ రోజు ప్రసాద్ ఒక విషయం బాగా నేర్చుకున్నాడు—
తమ్ముడు అంటే ప్రేమ మాత్రమే కాదు… బాధ్యత కూడా.


