july2saipatham ఇది అద్భుతమా? లేక విశ్వాసం ఇచ్చిన ధైర్యమా?
july2saipatham వైద్యుల నివేదిక ఏమి చెప్పింది?
జీవితంలో కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది.. “ఇది యాదృచ్ఛికమా? లేక మనకు కనిపించని ఏదో శక్తి నిజంగానే ఉందా?”
విజ్ఞాన శాస్త్రం ప్రతి విషయానికీ కారణాలు వెతుకుతుంది. కానీ కొన్ని అనుభవాలు మాత్రం వాటిని అనుభవించిన వారి మనసులో జీవితాంతం చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి అనుభవాల్లో ఒకటి ఇది.
ఈ కథలోని మహిళ చిన్నప్పటి నుంచే సాయిబాబాను ఆరాధించే కుటుంబ నేపథ్యంలో పెరిగింది. ఇంట్లో ప్రతి గురువారం భజనలు, హారతులు, ప్రార్థనలు జరిగేవి. అయినా ఆమె మాత్రం అందరిలా గాఢ భక్తురాలు కాదు. కుటుంబంతో కలిసి కూర్చోవడం తప్ప, బాబాపై ప్రత్యేకమైన విశ్వాసం తనకు ఎప్పుడూ లేదు.
కానీ ఒకరోజు తన స్నేహితురాలు చెప్పిన అనుభవం ఆమె ఆలోచనలనే మార్చేసింది.
ఆ స్నేహితురాలు, తన భర్తతో కలిసి చాలా రోజుల ముందే బ్యాంకాక్ పర్యటన ప్లాన్ చేసుకున్నారు. టికెట్లు, హోటళ్లు అన్నీ బుక్ అయ్యాయి. ప్రయాణానికి కేవలం రెండు వారాల ముందు ఆమె గర్భవతి అని తెలిసింది.
ఇప్పుడు వెళ్లాలా? వద్దా? అనే సందిగ్ధం.
వైద్యుడిని సంప్రదించగా, గర్భం ప్రారంభ దశలోనే ఉన్నందున జాగ్రత్తగా ఉంటే ప్రయాణానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పారు. దీంతో ఇద్దరూ ధైర్యంగా బయలుదేరారు.
మొదటి కొన్ని రోజులు ఎంతో ఆనందంగా గడిచాయి. అందమైన ప్రదేశాలు తిరిగారు, చూశారు. కలిసి చక్కగా ఫొటోలు దిగారు. కానీ ఒకరోజు సముద్రంలో బోటింగ్ చేస్తుండగా.. ఊహించని ఘటన జరిగింది.
భారీ అల తాకిడికి వారు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా పైకి ఎగిసి బలంగా కింద పడింది.
ఆ కుదుపుతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైంది. కడుపు బిగుసుకున్నట్లు అనిపించింది. వెంటనే వాంతులు కూడా అయ్యాయి.
ఆ క్షణంలో ఆమె మనసులో అలజడి… అక్కడి అలల కంటే వేగంగా పైకెగసిన ఆవేదన…
“నా కడుపులోని బిడ్డకు ఏమైనా జరిగిందా?“
పరిచయం లేని విదేశం… చుట్టూ భాష రాని అపరిచితులు… ఆమెకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
అప్పుడు ఆమె తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒకే పేరును మనసులో పలికింది. తెలిసిన, గుర్తొచ్చిన పేరు ఆమె పలికిందో, ఆ సాయినాథుడో పలికించాడో అని ఆమె ఈ సంఘటనను తల్చుకున్నప్పుడల్లా భావోద్వేగంతో అంటుంది.
“సాయిబాబా… నాకు, నా బిడ్డకు ఎలాంటి అపాయం జరగకుండా ఈ గర్భం సురక్షితంగా ఉంటే, పుట్టబోయే బిడ్డకు మీ పేరే పెట్టుకుంటాను..“
ఆమె మాటల్లో అది కేవలం ప్రార్థన కాదు… నిస్సహాయ స్థితిలో చేసిన ఒక మొక్కు.
కొంతసేపటికే ఆమె ఆరోగ్యం క్రమంగా సాధారణ స్థితికి వచ్చింది. ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయింది. భారత్‌కు తిరిగి వచ్చాక వైద్య పరీక్షలు చేయించగా గర్భంలోని శిశువు ఆరోగ్యంగానే ఉందని వైద్యులు చెప్పారు.
కాలం గడిచింది.
గర్భధారణ సాఫీగా కొనసాగింది. ఐదో నెలలో ఆమె దంపతులు షిరిడికి వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. తొమ్మిది నెలలు పూర్తయ్యాక ఆరోగ్యవంతమైన మగబిడ్డ జన్మించాడు.
తాను చేసిన మొక్కును మరచిపోలేదు.
ఆ చిన్నారికి “సాయి” అని పేరు పెట్టారు.
ఈ కథను ఎవరైనా చదివితే రెండు విధాలుగా ఆలోచించవచ్చు.
ఒకరు… “ఇది యాదృచ్ఛికం మాత్రమే. వైద్యపరంగా అన్నీ సవ్యంగా ఉండటంతో బిడ్డ క్షేమంగా పుట్టాడు” అని చెప్పవచ్చు.
మరొకరు… “ఆ కష్టసమయంలో ఆమెకు ధైర్యం ఇచ్చింది సాయిబాబాపై ఉన్న విశ్వాసమే. అదే ఆమెకు బలం అయింది” అని నమ్మవచ్చు.
ఏది నిజమో ఎవరి విశ్వాసం వారిది.
కానీ ఒక విషయం మాత్రం నిజం. జీవితంలో మనం పూర్తిగా నిస్సహాయులమైపోయినప్పుడు… ఏదో ఒక శక్తిని నమ్మడం మనసుకు అసాధారణ ధైర్యాన్ని ఇస్తుంది. ఆ శక్తిని కొందరు దేవుడు అంటారు… మరికొందరు విశ్వాసం అంటారు.
అందుకే ఇలాంటి అనుభవాలు కాలంతో పాటు మరుగున పడవు. తరతరాలకు చెప్పుకుంటూ వస్తుంటాయి.




