–కొత్తపల్లి ఉదయబాబు

అరుణకిరణం కనురెప్పను స్పృశించినంతనే
రెండోవైపునీడలు అదృశ్యమైన స్పర్శ.
నిద్రలోకి జారుకుంటున్నంతలోనే
నిజాలను దాచుకున్న నీడలన్నీ
మస్థిష్కపు సీసాలో మెలికలపాముల్లా తిరుగుతూ.
మనిషిని ముందువైపునుంచి చూడటంకంటే
రెండోవైపు అన్వేషణలో చీకటికోణాలు
నిస్సిగ్గుగా నిర్భయంగా నగ్నంగా సంచరిస్తాయి.
సూటిగచూసే పగటి పదునుచూపుల్లోనే ఏదో కసి..
దౌర్జన్యంగా అయినా ఆక్రమించి దోచేయాలని…
ఆ వికృతవాంఛ తీరిపోతే ఒక వికృత సంతృప్తి.
ముందువైపునుంచి విసిరే వలల ఎరలలో
ఆదమరపు నీడలు ఉలిక్కిపడతాయి.
వేటగాడిచూపులెపుడూ రెండోవైపు నీడ పైనే.
నిర్మల మానససరోవరంలో ఆశలనావలో
భావిజీవితపు కలలసంపదలతో తేలే
రసరమ్య ఛాయాచిత్రాల సోయగాల వన్నెలు
వాడి దృష్టికోణంలో ప్రతిఫలిస్తే చాలు
వాడి రెండోవైపు చిరునవ్వు పంజా విప్పేస్తుంది.
లింగబేధం, సమాజస్థాయి వాడి కోణం కాదు
వాడి అరికాషుడి గడిపరిధిలోకి వస్తే చాలు.
కాలంతీరిననీడలు ఆవైపే నడవడం విచిత్రమే..
తమఆశ ఒక్కటైనా నెరవేరుతుందనే భ్రమ..
ఇష్టపడిననీడలో చేరిపోతున్నామన్న అలౌకిక
ఆనందపు సంభ్రమం… అలవోకగా ఆత్మీయ
ప్రేమబంధాలను కర్కశంగా నరికేసుకుని..
రెండోవైపు తీరాన్ని స్పర్శించాలన్న ఆరాటం.
నావ సుడిగుండాన చిక్కాక నిదురలేని పోరాటం.
మనిషి వృత్తపుకోణంలో పారదర్శకంగా బ్రతకడమేరెండోవైపు తెలియని జీవుతానికి పరమార్ధం!
–కొత్తపల్లి ఉదయబాబు


