Coaching Centre Safety కోటి ఆశలతో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల పాలిట దేవాలయాల్లా దర్శనమిస్తాయి… ఆ తర్వాత అర్థంతరంగా వారి ప్రాణాలను తీస్తాయి… అవే కోచింగ్ సెంటర్లు. గతంలో సెల్లార్‌లో నీటమునిగిన కోచింగ్ సెంటర్‌లో ఎంతోమంది… ఈ మధ్య అగ్నిప్రమాదంలో ఆహుతైన కోచింగ్ సెంటర్‌లోనూ అంతే.
Coaching Centre Safety ప్రమాదాలకు ఏ నిర్మాణాలూ అతీతం కాకపోవచ్చు. కానీ కోచింగ్ సెంటర్లనే ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సి వస్తోంది? ఈ ప్రశ్న వెనుక అనేక కారణాలు… అనేక సందేహాలు. అందులో చేరేవారు కానీ, చేర్పించే వారి తల్లిదండ్రులు కానీ, వాటిలో నేర్పించే విద్యల గురించే ఆరా తీస్తున్నారు. అవి నేర్చేసుకుని తమ పిల్లలు సాధించబోయే విజయాల గురించి కలలు కంటున్నారు గానీ, ప్రస్తుతం అందులో కూర్చుని కంఫర్ట్‌గా తమ పిల్లలు విద్యను అభ్యసించగలరా? అసలు ఆ భవనానికి అన్ని భద్రతా వ్యవస్థలున్నాయా? కనీసం గాలి, వెలుతురు, ప్రమాదాల నుంచి బయటపడే వ్యవస్థలాంటి కనీస వసతులున్నాయా? అనేది చూడలేకపోతున్నారు. ఈ కోచింగ్ సెంటర్ల నిర్వహణే ఒక పెద్ద ప్రహసనమైపోయిందని చాలామంది విమర్శిస్తున్నారు.
Coaching Centre Safety ఈ విమర్శలకు కారణాలు కూడా లేకపోలేదు.
2024లో ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ముగ్గురు యువ విద్యార్థులు ఒక కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్‌లో నీరు నిండిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ సెల్లార్‌ను లైబ్రరీగా వినియోగిస్తున్నారనే విషయం బయటపడటంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఒక భారీ వర్షం వస్తే బయటపడలేని స్థితిలో విద్యార్థులను భూగర్భ గదుల్లో కూర్చోబెట్టడం ఎంత ప్రమాదకరమో ఆ ఘటన నిరూపించింది.
అంతకుముందు 2019లో గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన తక్షశిల కోచింగ్ సెంటర్ అగ్నిప్రమాదం మరింత భయానకంగా నిలిచింది. మూడో అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగడంతో బయటపడలేక పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు పిల్లలు ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం మీద నుంచి దూకిన దృశ్యాలు ఇప్పటికీ చాలామందిని వెంటాడుతుంటాయి. ఆ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్ల భద్రతపై చర్చ జరిగినా, పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించలేదు.
Coaching Centre Safety ఇటీవల మరోసారి వివిధ రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లలో అగ్నిప్రమాదాలు, భవన భద్రతా లోపాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాల కొరత వంటి అంశాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సమస్య ఏమిటంటే… కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా ఐఐటీ, నీట్, యూపీఎస్సీ, గ్రూప్స్, బ్యాంకింగ్ పరీక్షల కోచింగ్ పేరిట చిన్న గదుల్లో వందలాది మందిని కూర్చోబెడుతున్న సందర్భాలు ఉన్నాయి.
ఒక్కసారి ఆలోచిస్తే పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందో అర్థమవుతుంది. ఒక సినిమా థియేటర్‌కు ఫైర్ సేఫ్టీ తప్పనిసరి. ఒక మాల్‌కు అత్యవసర నిష్క్రమణ ద్వారాలు తప్పనిసరి. ఒక పరిశ్రమకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. కానీ రోజూ వందల మంది విద్యార్థులు గంటల తరబడి గడిపే కోచింగ్ సెంటర్ల విషయంలో మాత్రం చాలాచోట్ల కనీస ప్రమాణాలే కనిపించడం లేదు.
Coaching Centre Safety అసలు తల్లిదండ్రులు అడగాల్సిన ప్రశ్నలు కూడా మారాలి. “ఎంత ఫీజు?”, “ఎంత ర్యాంక్?” అన్నదానితో పాటు “ఫైర్ సేఫ్టీ ఉందా?”, “అత్యవసర ద్వారాలు ఎన్ని ఉన్నాయి?”, “భవనానికి అనుమతులు ఉన్నాయా?”, “సెల్లార్‌లో తరగతులు నిర్వహిస్తున్నారా?” వంటి ప్రశ్నలు కూడా అడగాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం జీవితంలో ఒక లక్ష్యం మాత్రమే. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో ప్రాణాలే ప్రమాదంలో పడితే ఆ విజయం అర్థం ఏముంటుంది?
నిజానికి కోచింగ్ సెంటర్లు కలలను నెరవేర్చే ప్రదేశాలుగా ఉండాలి. కానీ భద్రతను నిర్లక్ష్యం చేస్తే అవే ప్రదేశాలు విషాదాలకు వేదికలవుతాయి. ప్రతి ప్రమాదం తర్వాత దర్యాప్తులు, అరెస్టులు, హామీలు, నిబంధనలు వస్తాయి. కానీ కొన్ని నెలల తర్వాత అన్నీ మామూలైపోతాయి. మళ్లీ మరో ప్రమాదం… మళ్లీ మరో చర్చ.
Coaching Centre Safety ఇకనైనా ప్రశ్న ఒక్కటే. ర్యాంకులు తెచ్చే కోచింగ్ సెంటర్లను మాత్రమే వెతుకుతామా? లేక విద్యార్థుల ప్రాణాలను కూడా కాపాడగల కోచింగ్ సెంటర్లను కోరుకుంటామా?
అయితే ఈ కథలో మరో కోణం కూడా ఉంది. ప్రతి ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు హడావుడిగా తనిఖీలు చేస్తారు. నోటీసులు ఇస్తారు. కమిటీలు వేస్తారు. మీడియా కెమెరాలు వెళ్లిపోయాక, ప్రజల ఆగ్రహం చల్లారిపోయాక మళ్లీ అంతా మామూలే. ఇదే చక్రం ఏళ్లుగా తిరుగుతోంది.
ఢిల్లీ సెల్లార్ విషాదం జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లపై తనిఖీలు జరిగాయి. సూరత్ అగ్నిప్రమాదం తర్వాత కూడా అదే జరిగింది. కానీ ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. ప్రమాదాలు జరిగిన తర్వాతే ప్రభుత్వాలకు భద్రత గుర్తుకు రావాలా? ప్రమాదం జరగకముందే వాటిని గుర్తించే వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదు?
ఇక్కడే రాజకీయ కోణం కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో లక్షలాది మంది యువత గురించి మాట్లాడే రాజకీయ నాయకులు, వారి భవిష్యత్తును మార్చేస్తామంటూ హామీలు ఇచ్చే ప్రభుత్వాలు, కోచింగ్ పరిశ్రమపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. విద్యా విధానాలపై చర్చలు జరుగుతాయి. రిజర్వేషన్లపై చర్చలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణపై రాజకీయ యుద్ధాలు జరుగుతాయి. కానీ ఆ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులు కూర్చునే భవనాల భద్రతపై పెద్దగా రాజకీయ చర్చ కనిపించదు.
విచిత్రమేమిటంటే… దేశంలో కోచింగ్ పరిశ్రమ వేల కోట్ల రూపాయల వ్యాపారంగా ఎదిగింది. వేలాది భవనాలు, లక్షలాది విద్యార్థులు, కోట్లాది రూపాయల ఫీజులు… అన్నీ ఉన్నాయి. కానీ వాటి నిర్వహణకు, భద్రతకు, అత్యవసర పరిస్థితుల నిర్వహణకు ఒకే విధమైన కఠిన జాతీయ ప్రమాణాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించదు.
అందుకే ప్రతి ప్రమాదం తర్వాత మనం బాధపడేది కేవలం చనిపోయిన విద్యార్థుల కోసం మాత్రమే కాదు. ముందే నివారించగలిగే ఒక విషాదాన్ని, మళ్లీ మళ్లీ జరగనిచ్చే వ్యవస్థ కోసం కూడా. ఒక విద్యార్థి ప్రాణం పోయిన తర్వాత నోటీసులు ఇవ్వడం కంటే, అతను తరగతి గదిలోకి అడుగుపెట్టే ముందే భద్రతను నిర్ధారించడం ప్రభుత్వాల అసలు బాధ్యత కాదా?



