బి. వంశీమిత్ర

“ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! ఎక్కడికైనా వెళ్దామా?” అడిగాడు సందీప్.
“మార్కాపురానికి వెళ్దాం. నా చిన్ననాటి స్నేహితుడు హరీష్‌ను కలవాలి. ఒకరోజు అక్కడే ఉండి వచ్చేద్దాం. నువ్వూ వస్తావా?” అన్నాడు వంశీ.
మరుసటి రోజు ఇద్దరూ బస్సు ఎక్కారు.
“అసలు హరీష్ ఎవరు? మీ స్నేహం గురించి చెప్పవా?” అడిగాడు సందీప్.
వంశీ చిరునవ్వుతో తన జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు.
“మా నాన్నకు ట్రాన్స్ఫర్ కావడంతో మార్కాపురం నుంచి చీరాలకు వచ్చేశాం. అంతకుముందు మార్కాపురంలోని వికాస్ స్కూల్లో ఆరో తరగతి వరకు చదివాను. అక్కడ నాకు చాలామంది స్నేహితులు ఉన్నా, హరీష్ అంటే నాకు ప్రాణం.
నేను నాలుగో తరగతిలో ఆ స్కూల్లో చేరిన మొదటి రోజు చాలా భయపడ్డాను. క్లాస్‌లో ఎక్కడ కూర్చోవాలో చూస్తుంటే హరీష్ తన పక్కన చోటు చూపించాడు.
‘నా పేరు హరీష్. నీ పేరు ఏంటి?’ అని నవ్వుతూ అడిగాడు.
అలా మొదలైన మా పరిచయం రోజురోజుకీ స్నేహంగా మారింది. లంచ్ కూడా కలిసి తినేవాళ్లం. నేను స్వీట్స్ ఇస్తే, వాడు చెకోడీలు ఇచ్చేవాడు. అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి మా స్నేహానికి స్కూలే ప్రపంచం.
ఒకసారి హరీష్ జ్వరంతో నాలుగు రోజులు స్కూల్‌కు రాలేదు. వాడు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాను. వాడు తిరిగి వచ్చిన రోజు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది.
స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్‌లో మేమిద్దరం కలిసి డ్రామాలో నటించాం. బహుమతిగా రెండు పెన్సిళ్లు వచ్చాయి. చదువులో కూడా ఒకరికొకరం సహాయం చేసుకునేవాళ్లం. నాకు అర్థం కానివి హరీష్ చెప్పేవాడు. వాడికి అర్థం కానివి నేను చెప్పేవాడిని.
ఒకసారి నాకు సెకండ్ ర్యాంక్, హరీష్‌కు టెన్త్ ర్యాంక్ వచ్చింది. నాకు వచ్చిన ర్యాంక్ కంటే వాడి ర్యాంక్ చూసే ఎక్కువ బాధపడ్డాను. కానీ హరీష్ మాత్రం ‘నువ్వు బాగా చదువుతావు. నా డౌట్లన్నీ నువ్వే చెప్పాలి’ అన్నాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య చదువులో మంచి పోటీ మొదలైంది.
ఒక రోజు హరీష్ కొత్త బట్టలు, స్వీట్స్‌తో స్కూల్‌కు వచ్చాడు. తన పుట్టినరోజని తెలిసి నేను సంతోషించాను. అదే రోజు బ్రేక్‌లో నాతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఒక పాము నన్ను కాటు వేయబోయింది. హరీష్ వెంటనే నన్ను పక్కకు లాగి తన చేయి అడ్డుపెట్టాడు. పాము వాడినే కాటేసింది.
అదృష్టవశాత్తూ అది విషపాము కాదు. హరీష్ క్షేమంగా బయటపడ్డాడు.
కొద్దిరోజుల తర్వాత నా పుట్టినరోజుకు హరీష్ నాకు బ్లాక్ కలర్ షర్ట్ బహుమతిగా ఇచ్చాడు. వాళ్ల నాన్న టైలర్ కావడంతో, వేరొకరి కోసం కుట్టిన షర్ట్‌ను నాకు ఇచ్చాడు. తన తండ్రి అడిగితే ‘ఎలుకలు కొరికేశాయి’ అని అబద్ధం చెప్పాడని తెలిసి వాడి స్నేహం చూసి ఆశ్చర్యపోయాను.
అలా మా స్నేహం మరింత బలపడుతున్న సమయంలో మా నాన్నకు మార్కాపురం నుంచి చీరాలకు ట్రాన్స్ఫర్ అయింది. నేను హరీష్‌కు చెప్పాను.
‘మనం కూడా ఇంతకుముందు చీరాలలో ఉండేవాళ్లం. మీరు వెళ్లిపోతున్నారా?’ అని బాధగా అడిగాడు.
మమ్మల్ని విడిచిపెట్టడం వాడికి ఎంత బాధగా ఉందో నాకు అర్థమైంది. కానీ మేము చీరాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత హరీష్‌ను కలిసే అవకాశం రాలేదు.
సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇటీవల హరీష్ తండ్రి రాసిన ఓ కథను పేపర్‌లో చదివాను. అందులో హరీష్, హారికతో పాటు నా పేరు కూడా ఉంది. వెంటనే పేపర్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేశాను. హరీష్ తండ్రి నన్ను గుర్తుపట్టారు.
అప్పుడు తెలిసింది—హరీష్ ఇప్పటికీ నన్ను గుర్తు చేసుకుంటున్నాడని.
‘ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చి హరీష్‌ను కలుస్తాను. ఈ విషయం అతనికి చెప్పొద్దు. సర్‌ప్రైజ్ ఇస్తాను’ అని చెప్పాను. అందుకే ఇప్పుడు మనం మార్కాపురం వెళ్తున్నాం” అన్నాడు వంశీ.
“సూపర్ రా!” అన్నాడు సందీప్.
బస్సు దిగి ఇద్దరూ హరీష్ ఇంటికి వెళ్లారు.
హరీష్ తండ్రి, హారిక వంశీని గుర్తుపట్టారు.
“నా కొడుకు ఎప్పుడూ నీ గురించే చెబుతుంటాడు” అన్నారు హరీష్ తండ్రి.
“హరీష్ ఎక్కడ అంకుల్?” అని అడిగాడు వంశీ.
“లోపల ఉన్నాడు” అంటూ ఆయన లోపలికి తీసుకెళ్లారు.
మంచం మీద పడుకున్న హరీష్‌ను చూసి వంశీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
హారిక చెప్పింది—“పది రోజుల క్రితం హరీష్‌కు పెద్ద యాక్సిడెంట్ అయింది. నిన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నువ్వు వస్తున్నావని తెలిసి బస్టాండ్‌కు రావాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ శరీరం సహకరించలేదు.”
అంతలో హరీష్ కళ్లుతెరిచాడు.
“నువ్వు… వంశీ కదా!”
“అవును రా…” అంటూ వంశీ హరీష్ చేయి పట్టుకున్నాడు.
చాలా సంవత్సరాల తర్వాత కలిసిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఎంతో ఆనందంగా మాట్లాడుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత హరీష్ నిద్రపోయాడు.
అతనికి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకున్న వంశీ ఒక్కసారిగా ఏడ్చేశాడు.
హారికకు లక్ష రూపాయలు ఇచ్చి, “ఇవి హరీష్ వైద్య ఖర్చులకు ఉపయోగించండి” అని చెప్పి సందీప్‌తో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు.
బస్సులో సందీప్ అడిగాడు.
“ఎందుకు అలా ఏడ్చేశావు?”
వంశీ కళ్లలో నీళ్లు తిరిగాయి.
“మనం ఎగ్జామ్స్ కోసం కంబైండ్ స్టడీస్ చేసిన రోజులు గుర్తున్నాయా? ఒకరోజు రాత్రి నీ ఇంటి నుంచి వస్తుండగా దారిలో ఒక యాక్సిడెంట్ చూశాను. ఎవరో గాయపడ్డారు. కానీ ఎగ్జామ్ హడావుడిలో ఆగకుండా వెళ్లిపోయాను.
ఇప్పుడు తెలిసింది… ఆ యాక్సిడెంట్‌లో గాయపడింది హరీష్ అని.
అతను నా అడ్రస్ తెలుసుకోవడానికి వాళ్ల నాన్నతో ఫోన్‌లో మాట్లాడుతుండగా రోడ్డు దాటుతూ యాక్సిడెంట్‌కు గురయ్యాడట. నన్ను సర్‌ప్రైజ్ చేయడానికి చీరాల వచ్చాడు.
చిన్నప్పుడు పాము నుంచి నన్ను కాపాడిన వాడు… కానీ నేను అతన్ని కాపాడలేకపోయాను.
ఆ రోజు నేను ఆగి ఉంటే… అతనికి త్వరగా వైద్యం అందేదేమో. నేను చేసిన నిర్లక్ష్యం వల్ల అతని బాధకు నేనూ కారణమేనేమో అనిపిస్తోంది.


