అప్పుడేమో అలా…ఇప్పుడేమో ఇలా……   

Spread the love

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి

      చాలా కాలం క్రితం  ఒక నియోజకవర్గంలో   మంచి నాయకుడు ఉండేవాడు. అతడు తన ప్రజలను  కన్న బిడ్డల వలె చూసేవాడు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా  తన సమస్య లాగా భావించి అప్పటికప్పుడే పరిష్కరించేవాడు. ఎన్నికలలో ఎన్నిసార్లు పోటీ చేసినా అతడికి తిరుగు ఉండేది కాదు.  డెబ్బదేండ్ల వయసులో  నలబది సంవత్సరాల పాటు   ప్రజలకు సేవ చేయడంలో గడిపాడు. కడు పేదరికంలోనున్న వ్యక్తులు  వచ్చి పిల్లల చదువు కోసమో, కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాలేనప్పుడు ఈ నాయకుడిని కలిసేవారు. లేదనకుండా తగిన ఆర్థిక సహాయం చేసి దాతృత్వంలో తనకు మించిన వాడు లేడనిపించుకునేవాడు . ఇట్లా ప్రజాసేవలో  మంచి పేరు సంపాదించుకున్నాడు. కొద్దికాలం తర్వాత వయసు మీద పడి ఏ పదవిని ఆశించకుండా విశ్రాంతి పొంది వృద్ధాప్యంలో చనిపోవడం జరిగింది.

        సాధారణంగా చనిపోయిన వ్యక్తిని యమధర్మరాజు తీసుకెళ్లిండు అంటుంటారు. చనిపోయినంక  స్వర్గమో, నరకమో వెళ్లడం జరుగుతుందని ప్రజల నమ్మిక. చనిపోయిన ఈ నాయకుడు యమధర్మరాజును చేరాడు. అప్పుడు యమధర్మరాజు  కుర్చీ నుండి దిగివచ్చి “” మీరు బతికి ఉన్నప్పుడు ప్రజల కోసం నిస్వార్ధంగా  ఎంతో సేవ చేశారు. మీరు ఉండవలసింది  ఇక్కడ కాదు. మంచి పనులు చేసి పుణ్యం సంపాదించారు కాబట్టి మీరు నాతో రండి స్వర్గ లోకములోనున్న ఇంద్రుని వద్దకు తీసుకెళ్తాను  ” అని చెప్పి ఇద్దరూ కలిసి స్వర్గలోకం బయలుదేరారు. స్వర్గలోకంలో నాయకుడిని అప్పజెప్పి యమధర్మరాజు తిరిగి తన నరక లోకానికి వచ్చేస్తాడు.

          కొంతకాలం  తర్వాత భూలోకంలో  మరో నాయకుడు  చనిపోయిన తదుపరి యమధర్మరాజు   వద్దకు చేరాడు. కుర్చీలో కూర్చున్న యమధర్మరాజు అతడిని చూసి ”  వెళ్ళు… వెళ్ళవయ్యా… నీవు ఈ నరక లోకంలోనే   ఫలాన చోటుకు వెళ్ళు  “అని కోపంగా అన్నాడు. ఇది గమనించిన చిత్రగుప్తుడు     ”  ఏంటి?  యమధర్మ రాజా…  అప్పుడు ఒక నాయకుడు వస్తే తమరు కుర్చీలో నుండి దిగి మర్యాదపూర్వకంగా  స్వర్గలోకం వెళ్లి పంపించారు. ఇప్పుడు మరొక నాయకుడు చనిపోయి వస్తే  చాలా కోపంగా ప్రవర్తించారు. ఎందుకు మహారాజా? అని  అన్నాడు. 

     ” నేనే కనుక నా సింహాసనం దిగి అతని వద్దకు చేరితే, నన్ను కాదని  నా కుర్చీలో కూర్చునే రకం. ఇతడు తక్కువోడు కాదు. ఎన్నో పార్టీలు మారి ఎంతోమంది కుర్చీలను లాగుకున్నాడు. పైగా ఏనాడు కూడా నిస్వార్థంగా సేవ చేయలేదు. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? మీ ఇంటికి వస్తే ఏమి పెడతారు అన్న చందంగా ఇతను చేష్టలు ఉండేవి. ఇతడిని గెలిపించిన ప్రజలకు ఒక్కరికైనా రూపాయి దానం చేసేవాడు కాదు. పైగా ప్రజలను  నిరంతరం పీక్కు తినేవాడు.  పసిపిల్లల ప్రాణాలను బలిగొన్నాడు. ఎంతోమంది  స్త్రీలను చెరిచాడు .  లక్షల కోట్లు సంపాదించాడు. ఈ స్వార్థపరుడు నడుమంత్రాన్నే యాక్సిడెంట్లో  సచ్చి ఇక్కడికి వచ్చేటట్లు  చేశాను . అతడికి ఇక్కడ శిక్షలు పడాల్సిందే” అని కఠినంగా పలికాడు.

        ఒకప్పుడు స్వార్థం లేని మంచి నాయకులు ఉండేవారు. ఇప్పుడేమో అందినకాడికి దోచుకుని వీలైనంతవరకు ప్రజల సొమ్మును దాచుకుని   ఎంతో సంపాదించాలి అనే ధ్యాసతోటే ఎక్కువ మంది నాయకులు వస్తున్నారు. ఈ విషయం నేటి లోకం గమనించాలి .

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి

Click here to Read more:https://trendyduniyaa.com/children-story-by-sanganabhatla-chinna-ramakishtaiah/

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *