-సంగనభట్ల చిన్న రామకిష్టయ్య

నరసింహపురం లో దానయ్య అనే ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు . అతడు పేదవారికి సాయం చేసేవాడు. అతని సాయం పొందిన వారిలో శరభయ్య కూడా ఒకడు .
ఆ శరభయ్య దానయ్య చేసిన సాయాన్ని మరిచి నలుగురు ఎదుట అతనిని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. ఈ సంగతి ఎవరో విని దానయ్య ఇంటికి వెళ్లి అతనికి చెప్పారు . ఆ దానయ్య నవ్వి ఊరుకున్నాడే తప్ప శరభయ్య కనిపించినప్పటికినీ పల్లెత్తు మాట కూడా అనలేదు.
శరభయ్య కు ఆ గ్రామంలో రోజులు గడవడమే కష్టం అయింది. అతనికి ఒక్క తల్లి తప్ప నా అన్న వారు ఎవరూ లేరు. పట్టణంలో అయితే ఏ పనైనా చేయవచ్చని కొలువులు దొరకడం సులభం అని శరభయ్య విని ఉన్నాడు. అందువల్ల అతడు తన తల్లిని తీసుకొని పట్టణానికి బయలుదేరాడు. అక్కడ ఒకచోట ఈ కొలువులు ఇస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లి వారిని తనకు పని ఇమ్మని అడిగాడు. ఆ తర్వాత అక్కడ ఒక వ్యక్తి ని చూసి ఆ కొలువు తనకు రాదని ఇంటికి మరలి వచ్చాడు.
అతడు నిరాశతో తల్లి వద్దకు వచ్చి “అమ్మా! ఈ కొలువు నాకు రాదు “అని అన్నాడు. సహజంగా ఒక్క నోరు వదులు తప్ప శరభయ్య మంచి పనివంతుడు కూడా! . తన కొడుకు ఇలా నిరాశగా చెప్పేసరికి ఆ తల్లి “ఎందుకు రాదురా! వారు నీకు పనిరాదని ఇవ్వనన్నారా! నీవు వారికి ఎందుకు నచ్చలేదు!” అని అడిగింది. అప్పుడు శరభయ్య తల్లితో “లేదమ్మా ! నేను ఎంత కఠినమైన పని అయినా చేస్తాననే చెప్పాను. కానీ ఆ కొలువు ఇచ్చేది ఎవరో కాదు . నేను ఎగతాళి చేసిన మన దానయ్యనేనట. చివరగా వచ్చిన ఆయన నన్ను గమనించాడు . ఆయన గురించి చెడుగా మాట్లాడిన ఆయన నాకు కొలువు ఎలా ఇస్తాడు ?”అని అన్నాడు .
కానీ మరునాడు చిత్రంగా ఆ పట్టణం నుండి ఒక మనిషి వచ్చి శరభయ్య ఆ కొలువుకు ఎంపిక అయినాడనీ, మరునాడు అతనిని వచ్చి పనిలో చేరమన్నారని చెప్పాడు. ఆ వార్త విని శరభయ్య ఆశ్చర్య పోయాడు.
అతడు సంతోషంతో ఆ తెల్లవారే పట్టణం వెళ్లి దానయ్యను కలిశాడు . అతడు దానయ్యతో “అయ్యా! నాకు ఒక చిన్న సందేహం. నేను మిమ్మల్ని అందరి యెదుట ఎగతాళి చేస్తూ మాట్లాడాను. నాకు సాయం చేసిన మిమ్మల్ని ఎంతో కించపరిచాను. మిమ్మల్ని అలా అనడం నా తప్పే! ఇలాంటి వాడికి మీరు కొలువు ఎలా ఇచ్చారు ? ఆ సందేహం నాలో ఉంది. దయచేసి తీర్చండి !”అని అన్నాడు.
అప్పుడు దానయ్య “ఒరేయ్! నా పని నాదే ! నీ పని నీదే ! పేదవారికి సాయం చేయడం అంటే నాకు ఇష్టం. ఇతరులను ఎగతాళి చేయడం నీకు ఇష్టం. నీ నోరు అదుపులో లేనంత మాత్రాన నీవు మంచి పనివంతుడవు కావా ఏమిటి ? అందుకే నీకు కొలువు ఇచ్చాను. ఇకనుండైనా నీవు నీ నోరును కాస్త అదుపులో పెట్టుకుంటే బాగుపడతావు “అని ఒక చురక అంటించాడు. అది విన్న శరభయ్య సిగ్గుపడి ఆయనను మన్నించమని ప్రాధేయపడి ఆనాటి నుండి ఇతరులను ఎగతాళి చేయడం మానుకున్నాడు.
-సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


