VibhishanaDharma7: బంధమా? ధర్మమా? తప్పు చేసిన మనవాళ్ల విషయంలో ఏది ముఖ్యం?
VibhishanaDharma7: విభీషణుడి ధర్మం.. ధృతరాష్ట్రుడి బలహీనత మనకు నేర్పే పాఠం
తప్పు చేస్తున్నది మనవాడని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? అతన్ని కాపాడటానికి తప్పును కూడా సమర్థిస్తామా? లేక మనకు ఎంత దగ్గరి వ్యక్తి అయినా, తప్పుని తప్పేనని చెప్పగలుగుతామా?
రామాయణంలోని విభీషణుడు, మహాభారతంలోని ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్నకు రెండు భిన్నమైన సమాధానాలకు నిదర్శనంగా కనిపిస్తారు.
రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు, విభీషణుడు అది తన అన్న చేసిన పని కాబట్టి మౌనం వహించలేదు. రావణుడికి పలుమార్లు సీతమ్మను శ్రీరాముడికి సగౌరవంగా అప్పగించి, అనవసరమైన యుద్ధాన్ని నివారించమని, నాశనానికి దగ్గర కావద్దని హితవు చెప్పాడు. ఈ హితవు కాస్తా రావణుడికే కాదు—కుంభకర్ణుడు సహా సభలోని వారికి కూడా పరిస్థితి తీవ్రతను వివరించాడు.
అతని మాట ఎవరికీ వినిపించలేదు. చివరకు విభీషణుడికి ఒక కఠినమైన వాస్తవం అర్థమైంది.. “బంధుత్వం, రక్తసంబంధం కారణంగా అధర్మాన్ని చూస్తూ ఉపేక్షించడం కూడా అధర్మమే.” అప్పుడు అన్నను, రాజ్యాన్ని, స్వదేశాన్ని వదిలి రాముడి వైపు వెళ్లాడు. అక్కడితో విభీషణుడి కథలోని అసలైన అధ్యాయం మొదలవుతుంది.
ధృతరాష్ట్రుడి విషాదం మరోలా ఉంటుంది.. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి తన కుమారులు చేస్తున్న తప్పులు తెలియవా? తెలుసు. దుర్యోధనుడి అసూయ తెలుసు.పాండవులపై అతని ద్వేషం తెలుసు.
జూదం వెనుక ఉన్న కుట్ర తెలుసు. ద్రౌపది అవమానానికి దారి తీసిన పరిస్థితి తెలుసు.

అయినా “నా కొడుకు” అనే బంధం తాలూకూ బలహీనత నుంచి పూర్తిగా బయట పడలేక పోయాడు. ద్రౌపది అవమానానికి జరిగిన పరిణామాల అనంతరం పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆమెకు వరాలు ఇచ్చాడు. కానీ సమస్యకు మూలమైన దుర్యోధనుడి స్వభావాన్ని మార్చేంత కఠినమైన నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయాడు. అతని కళ్లకు వెలుగు లేకపోవడం ఒక శారీరక పరిస్థితి.
కొన్నిసార్లు మనిషికి కళ్లున్నా, తనవాళ్ల తప్పులను చూడలేడు. మరి వీరిద్దరిలో అసలు తేడా ఏమిటి?
విభీషణుడికి బంధుత్వం కంటే ధర్మం ముఖ్యం. ధృతరాష్ట్రుడికి మాత్రం ధర్మం తెలిసినా, పుత్ర వాత్సల్యం దానిపై పైచేయి సాధించింది. ఇది తండ్రి ప్రేమ తప్పు అని కాదు. పిల్లల్ని ప్రేమించడం సహజం.
కానీ పిల్లల తప్పును ప్రేమ పేరుతో కాపాడటం మాత్రం ప్రేమ కాదు.
అది చివరికి ఆ పిల్లలకే నష్టం చేస్తుంది. విభీషణుడు రావణుడిని వదిలి పెట్టాలని మొదటి నుంచే కోరుకోలేదు. ముందుగా చెప్పాడు. హెచ్చరించాడు. నచ్చజెప్పాడు. చివరి వరకు అన్నను మార్చేందుకు ప్రయత్నించాడు. అతను బంధాన్ని తెంచుకోవడానికి తొందరపడలేదు; కానీ ధర్మాన్ని కూడా త్యాగం చేయలేదు. ధృతరాష్ట్రుడి విషాదం అక్కడే భిన్నంగా కనిపిస్తుంది. అతను తప్పును గుర్తించాడు. హెచ్చరికలు విన్నాడు. భవిష్యత్తులో జరిగే ప్రమాదాన్ని ఊహించాడు. కానీ నిర్ణయాత్మకంగా ఆపాల్సిన సమయంలో తండ్రిగా ఉండటాన్ని, రాజుగా ఉండటం పైకి తీసుకొచ్చాడు. ఈ రెండు పాత్రలు మనకు ఏం చెబుతున్నాయి?
మన స్నేహితుడు తప్పు చేస్తాడు. మన కుటుంబ సభ్యుడు తప్పు చేస్తాడు.
మనకు ఇష్టమైన వ్యక్తి అన్యాయం చేస్తాడు. అప్పుడు మనం రెండు పాత్రల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. “వాడు మనవాడే కదా…” అని మౌనం వహించే ధృతరాష్ట్రుడి మార్గమా? లేక “నువ్వు నాకు ఎంత దగ్గరివాడివైనా, తప్పు చేస్తే తప్పేనని చెబుతాను” అనే విభీషణుడి మార్గమా?
బహుశా నిజమైన ప్రేమ అంటే మనవాళ్లను ఎప్పుడూ సమర్థించడం కాదు. వాళ్లు తప్పు చేస్తున్నారని తెలిసినా, సమర్ధించడమో చూడనట్టు ఉండడమో కాకుండా, అవసరమైతే వాళ్లను ఆపడం. వాళ్లు వినకపోతే— వారి తప్పులో మనమూ భాగస్వాములం కాకుండా పక్కకు తప్పుకోవడం. విభీషణుడు మనకు ధర్మం కోసం బంధాన్ని వదిలే ధైర్యాన్ని నేర్పితే…ధృతరాష్ట్రుడు బంధం కోసం ధర్మంపై రాజీ పడితే చివరికి కుటుంబానికే ఎంతటి వినాశనం వస్తుందో తెలియజేసాడు. మనకు ఇష్టమైన వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు…
మన ప్రేమ అతన్ని కాపాడుతుందా? లేక మన మౌనం అతని పతనానికి కారణమవుతుందా?
click below image to read





Pingback: Frog Temple 12: కప్పకు కూడా గుడి.. ఈ ఆలయం వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఇదే! - Trendy Duniyaa