
కమ్ముకున్న నల్లని మేఘాల దాపున,
కన్నీటి ధారలతో కరిగిపోతున్న కుందనపు బొమ్మను నేను…
సృష్టికి మూలం నేనే అని తెలిసినా,
ఉదరంలోనే ఊచకోతకు గురవుతున్న ఆడతనపు ఊపిరిని నేను…
నీలాకాశంలో స్వేచ్ఛా విహంగమై విహరించాలనే
పురివిప్పిన ఆశల రెక్కలను
రాబందులు తమ కబంధ హస్తాలతో తుంచివేస్తుంటే,
రేపటి ఆశకై ఎదురుచూస్తున్న చకోర పక్షిని నేను…
అనునిత్యం ఆంక్షల వలయంలో చిక్కుకొని,
నా ఉనికినే కోల్పోతున్న మహాప్రస్థానాన్ని నేను…
పురివిప్పిన ఆశలను తుంచే కాలంలోనూ,
మరల చిగురించే ఆశను నేను…
అమ్మగా, అక్కగా, ప్రేయసిగా, ఆలిగా,
మకరందపు సువాసనను వెదజల్లుతూ,
అడుగడుగునా ఆగమవుతున్న పడతిని నేను…
అణుకువతో అలరారుతున్నా,
కామాంధుల కబంధ హస్తాలలో నలిగిపోతున్న మగువను నేను…
పసి మొగ్గలని కూడా చూడకుండా
కాలరాస్తున్న మృగాలతో మసలుతూ,
మౌన వేదనను మదిలో పదిలపరుచుకుంటున్న
నిస్సహాయురాలిని నేను…
కళ్యాణానికై కమ్మని కలలెన్నో కని,
ఏడడుగులు తనతో నడిచి,
సర్వస్వం సమర్పించినా,
చివరకు ఉరితాడే శరణ్యమై
చీకట్లో కలిసిపోతున్న పడతిని నేను…
ఊపిరి కోల్పోతున్న ఉషస్సును చూస్తూ
మౌనంగా రోదిస్తున్న జగతిని నేను…
విశ్వజగతిని వినమ్రతతో వేడుకుంటున్నాను…
ప్రతి ఆడపిల్లలో అమ్మతనాన్ని చూడండి.
ఆమెను గౌరవించండి… రక్షించండి…
అప్పుడు మాత్రమే ఈ ఉషస్సు మళ్లీ వెలుగుతుంది.
కొత్త ప్రియాంక (భానుప్రియ)
హైదరాబాద్


