ఒంటరిగా ఉన్నప్పుడు… ఎవరో మనల్ని గమనిస్తున్నారా?
రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు భయం వేస్తుంది?
“ఎవరో చూస్తున్నారు” అనిపించడం వెనక సైన్స్ ఏమిటి?
మన మెదడు ఒక “సర్వైవల్ మెషిన్” ఎలా అయింది?
చిన్న శబ్దాలను కూడా ప్రమాదంగా ఎందుకు భావిస్తాం?
రాత్రి దాదాపు 12 గంటలు…
బయట చిరుజల్లులు పడుతున్నాయి.
ఇంట్లో మీరొక్కరే.
హాల్లో లైట్ మాత్రమే వెలుగుతోంది.
చేతిలో మొబైల్… చెవిలో ఇయర్ ఫోన్స్…
ఫోన్‌లో ఎవరోతో మాట్లాడుతూ నవ్వుతున్నారు.
అంతలో…
వంట గది వైపు నుంచి చిన్న శబ్దం.
చాలా చిన్నది.
“పిల్లి అయి ఉంటుంది…” అనుకుని మళ్లీ ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెడతారు.
కానీ కొన్ని క్షణాలకే…
ఎవరో వెనకాల నిలబడి మిమ్మల్నే చూస్తున్నట్టు ఒక విచిత్రమైన ఫీలింగ్!
ఆ ఫీలింగ్ అంత నిజంగా ఉంటుంది…
ఒక్కసారిగా వెన్నులో చలి పరిగెడుతుంది.
మెల్లగా వెనక్కి తిరిగి చూస్తారు…
ఎవరూ ఉండరు.
అయినా గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది.
అచ్చం ఇలాంటి అనుభవం మీకూ ఎప్పుడో ఒకసారి కలిగి ఉండొచ్చు.
ఈ ఫీలింగ్ కేవలం ఇంట్లోనే కాదు…
బస్సులో కిటికీ పక్కన కూర్చుని బయటికి చూస్తుంటే…లేదా ట్రెయిన్‌లో ప్రయాణిస్తుంటే…జనాల్లో నడుస్తుంటే…
హఠాత్తుగా “ఎవరో నన్ను గమనిస్తున్నారు” అనిపించడం చాలా మందికి జరుగుతుంది.
ఇందులోఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…
అటూ ఇటూ చూసినా నిజంగా ఎవరూ చూడకపోవచ్చు!
మరి ఈ ఫీలింగ్ ఎందుకు వస్తుంది?
ఇది మనలోని భయమా? లేక ఏదైనా, ఎవరిమీద అయినా అనుమానమా?
లేక నిజంగానే మనిషికి కనిపించని ఏదైనా శక్తి ఉందా?
ఈ ప్రశ్నపై మానసిక శాస్త్రవేత్తలు, న్యూరో సైంటిస్టులు ఎన్నో సంవత్సరాలుగా అధ్యయనాలు చేస్తున్నారు.
వాళ్లు చెప్పే సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.
మన మెదడు… ఒక “సర్వైవల్ మెషిన్”! ఈ ఫీలింగ్ వెనక అసలు కారణం… మనిషి మెదడు.
వేల సంవత్సరాల క్రితం మనిషి అడవుల్లో జీవించేవాడు. అప్పుడు ప్రతి క్షణం ప్రమాదమే.
పొదల్లో పులి దాక్కుని ఉండొచ్చు…చీకట్లో శత్రువు ఉండొచ్చు…అందుకే మన మెదడు ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. చుట్టూ ఏ చిన్న మార్పు జరిగినా వెంటనే అప్రమత్తం కావడం!
అందుకే ఇప్పుడు కూడా…చిన్న శబ్దం వినిపించినా…ఎవరో వెనకాల నడిచినా…లేదా కేవలం నిశ్శబ్దం ఎక్కువైనా…
మన మెదడు వెంటనే ఒక అలర్ట్ పంపుతుంది.. “జాగ్రత్త… ఎవరో ఉండొచ్చు!”అని అప్రమత్తం చేస్తుంది. ఇది నిజానికి మనల్ని కాపాడటానికి ప్రకృతి ఇచ్చిన అలవాటు.
మీకు తెలుసా? అసలు ఆట ఆడేది… నిశ్శబ్దం!
పగటిపూట అదే ఇల్లు సాధారణంగా అనిపిస్తుంది.
కానీ రాత్రి? అదే ఫ్యాన్ శబ్దం కూడా వింతగా అనిపిస్తుంది. ఫ్రిజ్ మోటార్ ఆన్ అయినా…కిటికీ గాలి వల్ల కదిలినా…పై అంతస్తులో ఏదైనా పడినా…మన మెదడు వాటిని “ప్రమాద సంకేతాల”గా అర్థం చేసుకోవచ్చు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…మనిషి మెదడు ఖాళీని ఇష్టపడదు. స్పష్టంగా సమాచారం లేకపోతే…
అది తానే ఊహలు అల్లుకుంటూనే ఉంటుంది.అందుకే చీకట్లో వేలాడుతున్న టవల్ కూడా కొన్నిసార్లు మనిషిలా కనిపిస్తుంది.
ఒంటరిగానో నిశ్శబ్దంలో ఉన్నప్పుడు సరే మరి జనాల్లో కూడా ఎందుకు ఇలా అనిపిస్తుంది?
అనేది ఇంకా విచిత్రం. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు… ఎవరో ఒకరు క్షణం మన వైపు చూసి ఉండొచ్చు.
మనకు అది స్పష్టంగా గుర్తుండకపోయినా…మన మెదడు మాత్రం ఆ సమాచారాన్ని పట్టేస్తుంది.
కొన్ని సెకన్ల తర్వాత… “ఎవరో నిన్ను గమనిస్తున్నారు…”అనే ఫీలింగ్ వస్తుంది.
దీనిని నిపుణులు “హైపర్ అవేర్‌నెస్” అంటారు.అంటే —చుట్టూ ఉన్న చిన్న సంకేతాలను కూడా మెదడు ఎక్కువగా గమనించడం. ఫోన్లు, సోషల్ మీడియా కూడా కారణం కావచ్చు.
రోజంతా…ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారు? మనం పెట్టిన స్టేటస్ ఎవరు చూశారు? ఎవరు లైక్ చేశారు? ఎవరు రిప్లై ఇవ్వలేదు? ఇలా నిరంతరం ఇతరుల దృష్టిలో జీవించడం వల్ల…మన మెదడు ఎప్పుడూ “ఎవరో నన్ను గమనిస్తున్నారు” అనే మోడ్‌లోనే ఉండిపోతోంది. అందుకే కొందరికి… ఫోన్ వైబ్రేట్ కాకపోయినా వైబ్రేట్ అయినట్టు అనిపిస్తుంది! మరి ఇది ప్రమాదకరమా అంటే సాధారణంగా కాదు. ఇది మన మెదడు చేసే సహజ రక్షణ చర్య మాత్రమే. కానీ…ప్రతి క్షణం భయపడటం…ఎవరో వెంబడిస్తున్నారనే అనుమానం…
ఎవరూ లేకపోయినా స్పష్టంగా కనిపిస్తున్నట్టు అనిపించడం…ఇలా ఉంటే మాత్రం మానసిక ఒత్తిడి లేదా ఆందోళన సంకేతాలు కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మనిషిని ఎక్కువగా భయపెట్టేది చాలాసార్లు చీకటి కాదు…సొంత మెదడే! ఎందుకంటే… మన మెదడు ఒకేసారి రెండు పనులు చేస్తుంది మనల్ని కాపాడుతుంది…
అదే సమయంలో… లేని ప్రమాదాన్ని ఉన్నట్టు కూడా అనిపిస్తుంది.
అందుకే…
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసే ఆ క్షణం…
అది మాయ కాదు…భూతం కాదు…మనిషి మెదడు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చెప్పే సైన్స్ మాత్రమే!




