సాధారణంగా మనం ప్రతి సందర్భంలోనూ ఎదుటివారి నుండి మనకు అనుకూలమైన ప్రతిస్పందననే ఆశిస్తాం, ఊహిస్తాం! అలా కాదని అనూహ్యమైన ప్రతిస్పందన ఎదురైతే అవాక్కవుతాం. కానీ, ఈ విషయాన్ని చాలామంది ఒప్పుకోరు. ఉదాహరణకు వంటింట్లో బుద్దిగా వంట చేసుకుంటున్న శ్రీమతిని వెనక నుంచి వచ్చి సుతారంగా కౌగిలించుకున్న మొగుడుగారు, ఆమె నుంచి సిగ్గునే ఆశిస్తాడు. అలాకాదని కరణం మల్లీశ్వరి అవతారమెత్తి తనను ఎత్తి పడేస్తే మానవుడు బిక్కచచ్చిపోతాడు. అలాగే, ముందురోజే విడుదలై అట్టర్ ఫ్లాపైన చిత్రం గురించి సదరు యూనిట్ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు ‘మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?’ అనే ప్రశ్నని మీడియా సోదరుల నుండి ఆశిస్తారు. అందుకు భిన్నంగా ‘అట్టర్ ఫ్లాపైన సినిమాకి సక్సెస్ మీటేంట్రా జఫ్ఫా?” అనే నిలదీత ఎదురైతే మొహాలు మాడిపోయిన మసాలా దోశలవుతాయి. కొత్తచీర కట్టుకున్న భార్యామణి పేపర్ చదువుకుంటున్న భర్తాసురుడి ముందు నుండి పనిలేకపోయినా పదేపదే తిరుగుతుంది. ‘వావ్… ఈ చీరలో నువ్వెంత అందంగా వున్నావోయ్!’ అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడనుకుంటుంది. కానీ, ఆ నిమిత్తమాత్రుడు పిలిచి ‘వేవేడి కాఫీ ఇస్తావుటోయ్?’ అంటే కువలమ్మ కొరకొరా చూస్తుంది. అంతెందుకూ, ఉయ్యాలలో పడుకుని ఆడుకునే పాపాయి సైతం తన ముద్దు చేష్టలకు అందరూ ప్రతిస్పందించాలని కోరుకుంటుంది. అలాకాదని తనను పట్టించుకోకుండా ఎవరి పని వాళ్లు చేసుకుంటే క్యారుక్యారుమని పైకప్పు లేచిపోయేలా ఏడుస్తుంది. ఇక ఈమధ్య ఫేస్ బుక్ లో, వాట్స్ అప్ లో కొందరు ఔత్సాహిక కళాకారులు ఏదో ఒక దైవ సంబంధమైన బొమ్మ పెట్టి ‘దీన్ని పది మందికి షేర్ చేయండి. పది సెకన్లలో మంచి జరుగుతుంది’ అనే ప్రబోధాలు పెడుతూంటారు. వాటిని బుద్దిగా పదిమందికీ షేర్ చేసి, పది సెకన్లపాటు వాచీ చూసుకుంటూ మరీ భగవంతుడి ప్రతిస్పందన కోసం ఎదురు చూసే ఆశావహులూ వుంటారు. కొత్త బట్టలుగానీ, షూస్ గానీ కొనుక్కున్నవారు వాటిని ధరించి పదేపదే తిరుగుతూంటారు ఆఫీసులో. అందరూ చూసి… ‘అబ్బో… ఏంటోయ్… ఈరోజు పుట్టినరోజా, పెళ్లిరోజా…? కొత్తబట్టలూ, కొత్త షూసూ… అదిరిందయ్యా…’ అని ఎవడేనా అనకపోతాడా అని చిన్ని చిన్ని ఆశ… కానీ, అఫీస్ బాయ్ వచ్చి చెవిలో ‘సర్… ఈరోజు మీరు పదినిమిషాలు లేటుగా వచ్చారని బాసుబాబు మండిపడుతున్నారు’ అని చెప్తే కడపలోని బాంబు కడుపులో పడి పేలుతుంది. అలాగే ఎవరి లెక్కలు వారికుంటాయి. సంవత్సరం గడిచాక ‘నేను ఈ ఏడంతా కష్టపడి బాగా పనిచేశాను. నాకు ఇంక్రిమెంటు బాగా వస్తుంది.’ అని ఉద్యోగి / ఉద్యోగిని అనుకుంటారు. దానికి భిన్నంగా ఖచ్చితంగా మేనేజ్ మెంట్ మైనస్ పాయింట్లను భూతంద్దంతో చూసి మరీ లాగి… తన క్యాబిన్ లోకి ఉద్యోగిని పిలిచిన బాసుడు ‘నీకు పనిమీద శ్రద్ధ లేదు. ఇది ఆఫీసనుకున్నావా, వాకింగ్ చేయడానికి కె.బి.ఆర్. పార్కనుకున్నావా? గెట్ లాస్ట్’ అని వంద బూతులు తిట్టి ఇంక్రిమెంట్ కవర్ చేతిలో పెట్టినప్పుడే అర్థమైపోతుంది. తన సీట్లో వచ్చి కూర్చుని కవరు తీసి చూసిన సామాన్యుడిని ఇంక్రిమెంటు వెక్కిరిస్తుంది. ప్రపంచానికి అనువుగా వుండాలని ఎవరూ అనుకోరు. ప్రపంచమే మనకు అనువుగా వుండాలని కోరుకుంటారు. ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గుతారు తప్ప. ప్రతి మనిషి చుట్టూ ఒక వైఫై తిరుగుతూంటుంది. దానికి యూజర్ నేం, పాస్ వర్డ్ ఏవి ఇస్తారో మీఇష్టం. కాకపోతే, చిన్న వార్నింగ్ లాంటి రిక్వెస్ట్… మీ వైఫైకి మాత్రమే యూజర్ నేం, పాస్ వర్డ్ నిర్ణయించుకోండి. కాదని పక్కవాడి వైఫై గురించి అలోచించారో… టెంపర్ లేచుద్ది!!

