ప్రకృతి కవిత

Spread the love

ఎ.నాగాంజనేయులు

ఆకుపచ్చ దుప్పటి కప్పుకున్న
ఆ చెట్టు చెంతకు వెళ్ళగానే
ఓ తుమ్మెదొచ్చి..
మాటల తీపి పంచింది

ఓ పువ్వు రాలిపడుతూ
పరిమళ గీతం
వినిపించింది

ఓ చిన్నారి 
బడిబాట పడుతూ
నవ్వుల కానుకిచ్చింది

ఆటోలో…
కాటుక కళ్ళ చిన్నది
చూపుల బాణం విసిరి
మాయమైంది

చల్లగాలి చెంతకొచ్చి
ఒళ్ళంతా….
అత్తరు చల్లి వెళ్లింది

చిట పట చినుకులు రాలి…
చిట్టి మొక్కలకు
స్నానం చేయించాయి

పగటిని తరిమేందుకు
పడమటికి పరిగెత్తాడు
సూర్యుడు…
చీకటి పడగానే
చుక్కల్ని వెంటేసుకుని
నింగిలోకొచ్చాడు
నిండు చంద్రుడు

రోజంతా పొందిన
అనుభూతిని నెమరేసుకుంటూ
మనసులో రాసుకున్న
ప్రకృతి కవిత.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *