Ghost Story Fear2Real ఓ కస్టమర్ కి ఎదురైన వింత అనుభవం…భయం గొల్పింది..
Ghost Story Fear2Real హోటల్ యజమాని ఏం చేసి మళ్ళీ కస్టమర్లను రప్పించుకున్నాడు…
విజయవాడ నగర శివార్లలోని ఆ చిన్న హోటల్ ఎప్పుడూ రద్దీగానే ఉండేది. ఉదయం ఇడ్లీ, వడల కోసం క్యూలు… మధ్యాహ్నం భోజనానికి టేబుళ్లు ఖాళీ ఉండేవి కావు. సాయంత్రం టీ, బజ్జీల కోసం యువకులు, ఉద్యోగులు, కుటుంబాలు వచ్చేవారు. ముఖ్యంగా ఆ హోటల్లోని కొబ్బరి చట్నీకి మాత్రం ప్రత్యేకమైన పేరు ఉండేది.
హోటల్ యజమాని రాఘవయ్యకు ఆ వ్యాపారం అంటే ప్రాణం. కానీ ఒక రోజు… ఉన్నట్టుండి పరిస్థితి మారిపోయింది. ఉదయం పది గంటలైనా ఒక్క కస్టమర్ కూడా లేడు. “ఏమైంది?” అని రాఘవయ్య ఆశ్చర్యపోయాడు.
మధ్యాహ్నం కూడా అదే పరిస్థితి. మరుసటి రోజు కూడా. మూడో రోజు కూడా. “సార్… ఏదైనా కొత్త హోటల్ వచ్చిందా?” అని వంటమనిషి అడిగాడు. “అది కాదు. మన హోటల్‌కి రావడం మానేసినట్టు ఉంది జనాలు!” అన్నాడు రాఘవయ్య. అప్పుడే అతని స్నేహితుడు శేఖర్ వచ్చాడు. రాఘవయ్యను పక్కకు తీసుకెళ్లి మెల్లగా అన్నాడు.
“నీ హోటల్ గురించి ఊర్లో ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా?”
“ఏం మాట్లాడుకుంటున్నారు?”
శేఖర్ కాసేపు ఆగి… “నీ హోటల్లో దయ్యం ఉందట!” అది వింటూనే రాఘవయ్య ఒక్కసారిగా నోరు తెరిచాడు.
“ఏంటి? దయ్యమా!”
“అవును. దయ్యమే…రాత్రిళ్లు టేబుళ్ల మీదున్న గిన్నెలు వాటంతట అవే కదులుతాయట. ఎవరో కనిపించకుండా తిరుగుతారట. చట్నీ గిన్నెలు కూడా టేబుల్ మీద వాటంతవే ఇట్నుంచటు అట్నుంచిటు కదులుతాయట….కాదు కాదు…కదిలిస్తాయట…దయ్యాలు…
“చట్నీ గిన్నెలు కదులుతాయా?!” రాఘవయ్యకంతా అయోమయంగా ఉంది.
“అదే నేను కూడా అనుకున్నా.” శేఖర్ కూడా కాస్త అయోమయంగానే అన్నాడు.
రాఘవయ్యకు ఒక్కసారిగా కోపమొచ్చింది.
“ఈ పుకారు ఎవడు పుట్టించాడు?” తీవ్రంగా అడిగాడు.
అదే తెలుసుకోవాలని ఆరా తీయడం మొదలుపెట్టారు రాఘవయ్య, శేఖర్ ఇద్దరూ.
కొంతమంది “ఎవరో చూశారట” అన్నారు.మరికొందరు “మా బంధువుకి తెలిసిన వ్యక్తి చెప్పాడట” అన్నారు. చివరికి ఒక కస్టమర్ పేరు బయట పడింది. అతని పేరు సుబ్బారావు. రాఘవయ్య అతన్ని పిలిపించాడు.
“మీరు నా హోటల్లో దయ్యాన్ని చూశారట?” అడిగాడు రాఘవయ్య. అది వింటూనే సుబ్బారావు ముఖం గంభీరంగా మారిపోయింది. “నేను స్వయంగా నా కళ్లతో చూశాను!” మాటలు కూడగట్టుకుంటూ చెప్పాడు. “ఏం చూశారు?” ఆదుర్దాగా అడిగాడు రాఘవయ్య.
“ఆ రోజు రాత్రి నేను ఓ మూల టేబుల్ దగ్గర కూర్చున్నాను. నేను ఆర్డరిచ్చిన ఇడ్లీ నా ముందుకు వచ్చింది.
నా ఎదురుగా చట్నీ గిన్నెలు ఉన్నాయి. ఒక్కసారిగా…”
అతను ఆగాడు. “ఒక్కసారిగా ఏమైంది?”
ప్లేట్ లోంచి చట్నీ గిన్నె తీసి టేబుల పై పెట్టాను…అంతే…అది నెమ్మదిగా కదిలి మరో పక్కకు పోవడం ప్రారంభించింది. మళ్ళీ తీసి ముందు ఉన్న చోట పెట్టాను…అలా ఎన్నిసార్లు పెట్టినా, అది మళ్ళీ మరోచోటుకు పోతూనే ఉంది..
“ఎలా?”
“నెమ్మదిగా… అలా… అలా… తనంతట తానే ముందుకు వచ్చింది!”
రాఘవయ్య కళ్ల పెద్దవయ్యాయి.
“తర్వాత?”
“మరొక గిన్నె కూడా కదిలింది. నేను భయపడ్డాను. వెంటనే అక్కడి నుంచి లేచిపోయాను.”
“అంతేనా?”
“అంతే.”
“మరి దయ్యం ఎలా వచ్చింది?”
సుబ్బారావు గొంతు తగ్గించాడు.
“అది దయ్యం పని కాకపోతే మరేమిటి?”
ఆ మాట విన్న వెంటనే శేఖర్‌ను పిలిచాడు. “నువ్వు వచ్చి ఆ టేబుల్ చూడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.” మరుసటి రోజు ఇద్దరూ ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు. చట్నీ గిన్నెలు పెట్టారు. ఏమీ జరగలేదు.
ఐదు నిమిషాలు. పది నిమిషాలు. అప్పుడే… ఒక చిన్న గిన్నె… నెమ్మదిగా కదిలింది! శేఖర్ ఒక్కసారిగా లేచాడు.
మరో గిన్నె కూడా కదిలింది. రాఘవయ్య ముఖం తెల్లబడింది. “నిజంగానే దయ్యమా?” శేఖర్ మాత్రం టేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించాడు. చేత్తో తాకాడు. కొంచెం నూనె అంటుకుంది. అతను టేబుల్ మీదున్న గిన్నెను ఒక వైపున పెట్టాడు. అది మళ్లీ కదిలింది. శేఖర్ టేబుల్‌ను పక్కకు జరిపి చూశాడు. అప్పుడు అసలు రహస్యం బయటపడింది.
టేబుల్ కొద్దిగా వాలిపోయి ఉంది! అంతేకాదు… దాని మీద నూనె చమురు పలుచగా పరుచుకుని ఉంది.
అందుకే గిన్నెలు ఎత్తు నుంచి పల్లానికి నెమ్మదిగా జారుతున్నాయి. శేఖర్ నవ్వేశాడు. “ఇదే నీ హోటల్ దయ్యం!”
రాఘవయ్య తల పట్టుకున్నాడు. “ఇంత చిన్న విషయం ఇంత పెద్ద పుకారుగా మారిందా?” సుబ్బారావు భయపడ్డాడు. అతను చెప్పినదానికి ఇంకొకడు రెండు మాటలు కలిపాడు. మూడో వ్యక్తి మరో మూడు కలిపాడు. చివరికి నీ హోటల్లో దయ్యం గిన్నెలతో భోజనం చేస్తున్నట్టయ్యింది!”
రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. అయితే ఒక సమస్య ఇంకా ఉంది.జనాలు దయ్యం ఉందని నమ్ముతున్నారు.
“ఇప్పుడు వాళ్లకు దయ్యం లేదని ఎలా చెప్పాలి?” అన్నాడు రాఘవయ్య. శేఖర్ నవ్వుతూ… “చెప్పినా నమ్మరు. భయపడిన మనిషికి నిజం కంటే కథే ఎక్కువ నమ్మకం కలిగిస్తుంది.” రాఘవయ్య కాసేపు ఆలోచించాడు.
అప్పుడు అతని ముఖంలో చిన్న నవ్వు. “అయితే… వాళ్లు నమ్మే భాషలోనే చెప్పాలి!” ఆ రాత్రే హోటల్ ముందు పెద్ద ఏర్పాట్లు మొదలయ్యాయి. పండితులను పిలిచారు. హోమం చేశారు. శాంతి పూజలు చేశారు. మంత్రాలు చదివారు.
ధూపం వేశారు. హోటల్ ముందు పెద్ద బ్యానర్ పెట్టారు—” ప్రత్యేక శాంతి కార్యక్రమం అనంతరం హోటల్ పునఃప్రారంభం!” ఊరంతా ఆసక్తిగా చూసింది. “దయ్యాన్ని తరిమేశారట!” “ఇక భయం లేదు!”

“హోటల్ శుద్ధి చేశారట!” మరుసటి రోజు ఉదయం హోటల్ తలుపులు తెరిచేసరికి… కస్టమర్ల క్యూ!
రాఘవయ్య ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. శేఖర్ మాత్రం పక్కన నిలబడి నవ్వుతున్నాడు.
“ఏమిటి నవ్వుతున్నావు?” అడిగాడు రాఘవయ్య.
“దయ్యం నిజంగా పోయిందా?” నవ్వుతూ అడిగాడు శేఖర్.
“పోయింది!” చెప్పాడు రాఘవయ్య.
“ఎలా?” మరింత ఆసక్తిగా అడిగాడు శేఖర్.
రాఘవయ్య చిరునవ్వు నవ్వాడు. “ఉంటే కదా పోవడానికి?.. “దయ్యం లేదని చెబితే ఎవరూ రాలేదు. దయ్యాన్ని తరిమేశామని చెబితే అందరూ వచ్చారు!
అంతలో ఒక కస్టమర్ చట్నీ గిన్నె తీసుకుని టేబుల్ మీద పెట్టాడు.
గిన్నె… కదలలేదు..పెట్టిన చోటే ఉంది…
“అది ఇక కదలదు…ఎందుకంటే ఒకపక్కౌ కొంచెం వాలిపోయిన టేబుల్ మార్చబడింది. అంతే కాదు…టేబుల్స్ పైన నూనె చమురు పీల్చుకునేందుకు సన్నటి పేపర్లు కూడా పరచబడ్డాయి. చెప్పాడు రాఘవయ్య.
శేఖర్ నవ్వు ఆపుకోలేకపోయాడు.
ఆ రోజు నుంచి హోటల్ బాగా నడిచింది.
పుకారు పుట్టడానికి నిజం అవసరం లేదు. ఒక చిన్న సంఘటన చాలు.
దానికి కొంచెం భయం, ఇంకొంచెం ఊహ, మరికొంచెం చిలవలు పలవలు కలిస్తే…
సాధారణంగా జారే చట్నీ గిన్నె కూడా హోటల్లో తిరిగే దయ్యం అయిపోతుంది!
Ghost Story Fear2Real Ghost Story Fear2Real Ghost Story Fear2Real Ghost Story Fear2Real
click here to read ఆ ఇంట్లో దయ్యం ఉందట! చివరికి అసలు నిజం తెలిస్తే షాక్!



