below15yrslabour బాలకార్మికత్వ నిర్మూలన: చిన్నారుల జీవితాలు మారుతున్నాయా?
below15yrslabour చిన్నారుల భుజాలపై భారమైన బాధ్యతలు
బాల కార్మికత్వ నిర్మూలన కోసం...
జూన్ పన్నెండు బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏడాదీ వస్తుంది, పోతుంది. కానీ సిగ్నల్ దగ్గర కార్ల అద్దాలు తుడుస్తున్న పిల్లలు మాత్రం అక్కడే ఉంటారు. టీ షాపులో గ్లాసులు కడిగే ఆ చిన్నోడు కూడా అదే చోట పనిచేస్తూంటాడు. మారేది తేదీ మాత్రమే… దృశ్యం కాదు.
“పాపం..వాళ్ళ పరిస్థితి… మనం చేసేదేముంది” అని మనసులో అనుకుంటాం. వారిమీద ఒక్కక్షణం కాలి కురిపిస్తాం.. కానీ నిజంగా ఆలోచిస్తే… ఆ ‘పాపం పరిస్థితి’లో ఎవరి పాత్ర ఎంత? తక్కువకే పని చేస్తాడని పిల్లాడిని పనిలో పెట్టుకునే యజమాని ఒక్కరే కారణమా? లేక ఆ తక్కువకు పనిచేసే చిన్నారులను ఇంకెంతమంది ఉంపయోగించుకుంటున్నారని ఆలోచిస్తున్నామా?
బాలకార్మికత్వం అనేది కేవలం పేదరికం వల్లే వస్తుందని చెప్పడం సగం నిజం. మిగతా సగం సమాజం నిర్లక్ష్యం. చదివించలేక పిల్లలను పనిలో పెట్టిన వారి తల్లిదండ్రుల బాధ ఒక వైపు ఉంటే… చట్టాలు ఉన్నా పట్టించుకోని వ్యవస్థ మరో వైపు ఉంటుంది. మధ్యలో ఇరుక్కు పోయేది మాత్రం ఆ చిన్నారుల బాల్యం.
అనేక నిర్మాణ స్థలాల్లో ఇటుకలు మోసే పిల్లలు, హోటళ్లలో పని చేసే చిన్నారులు, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్న చిన్న వస్తువులు, బొమ్మలు అమ్మకాలు చేసే బాలికలు… చేయి చాపి దీనంగా మనముందుకొచ్చే చిన్నారులు..వీళ్లందరికీ వయసుకి మించిన బాధ్యత వాళ్ల భుజాలపై ఉంటుంది. అదే వారిచేత ఆ పనులన్నీ చేయ్స్తూ ఉంటుంది.
నేటి బాలలే రేపటి పౌరులని అందరం చెప్పేవి చాలా పెద్ద మాటలు. కానీ అదే పిల్లలు కూలీ పనుల్లో కనిపిస్తే…? చూసి కూడా చూడనట్టు నటించేవాళ్ళు మనలో ఎంతమంది? వెంటనే తాము పూనుకుని వారిని అక్కడి నుండి తప్పించి, ఏ శరణాలయానికో సురక్షితంగా చేర్చే బాధ్యతాయుతమైనవారెందరు?

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు పదునైన చట్టాలు ఉన్నాయి… నిషేధమూ ఉంది… పిల్లలను పనిలో పెట్టుకుంటే అమలుపరచడానికి శిక్షలూ ఉన్నాయి. కానీ, వాటి అమలు ఎక్కడ? ఒకవేళ నిజంగా కఠినంగా అమలు చేస్తే… ఈ సమస్య ఇంతకాలం ఇలా సాగుతుందా?
బాలకార్మికత్వం నిర్మూలన అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు అట్టహాసంగా, ఘనంగా నిర్వహించడం కాదు. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు. పిల్లలతో పని చేయించే చోట సేవలు నిరాకరించడం, అటువంటి ఘటనలు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం, ముఖ్యంగా వారిచేత పనిచేయించుకునే వాళ్ళకి “ఇది తప్పు” అని ధైర్యంగా చెప్పడం.
జూన్ 12 ఒక్క రోజు మాత్రమే. కానీ బాల్యం ప్రతిరోజూ రక్షించాల్సిన హక్కు. పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండాలి అనేది మనం చెప్పే మాటే కాకుండా, మనం పాటించే బాధ్యతగా మారితేనే ఈ దినోత్సవానికి అర్థం ఉంటుంది. లేదంటే… వచ్చే ఏడాది కూడా ఇదే కథ. మళ్ళీ ఏడాది మారుతుంది…అదే నెల, తేదీ వస్తుంది…అదే దృశ్యం కూడా కనిపిస్తుంది…మళ్ళీ తప్పుకుని వెళ్ళిపఓదామా?



