సీఎం కుర్చీ దక్కింది.. కానీ సవాళ్లు మొదలయ్యాయా?
మంత్రుల అలకలు డీకేకు తొలి రాజకీయ పరీక్ష
సిద్ధరామయ్య సీ ఎం కుర్చీ నుంచి వైదొలగి డీకే శివకుమార్ కు మార్గం సుగమం చేయడం, డీకే సీఎం సీటును అధిష్టించడం ఎపిసోడ్ ముగిసింది…పాతబడింది కూడా…అయితే కథ అక్కడితో సుఖాంతమైపోయిందా? అంటే అదెలా? అక్కడే అసలు కథ మొదలైంది. అధికారం అనేది అసిధారా చక్రం లాంటిది. మోసేవారికి ముళ్ళకిరీటం లాగా, చూసేవాళ్ళకు పద్మంలాగా కనిపిస్తుంది. అదంత తేలికైన విషయం కాదు. ఏ కొందరికో మాత్రమే అది నల్లేరు మీద నడక. కానీ దానికి చాలా సమర్థత, చాలా సమీకరణలు కావాలి. అవన్నీ మరి డీకే కి ఉన్నాయా? తెలిసేది ఇప్పుడే…సమర్థతను నిరూపించుకునే సరైన సమయం ఇదే. అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ..అందర్నీ ఒక్కతాటిపైకి తెస్తూ…ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం ఆయనకు ఎలా మారబోతుంది? డీకే శివకుమార్ తక్కువోడేం కాదు.
ట్రబుల్ షూటర్ గా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీలో ఆయనకు మంచి పేరుంది. ఎన్నెన్నో ట్రబుల్స్ ను తన బుద్ధి కుశలతతో పరిష్కరించిన డీకే శివకుమార్ మొదట్లోనే ఎదురవుతోన్న మంత్రుల అలకలు, అప్పగించిన శాఖల తిరస్కరణలు, నిరసన సెగలను పరిష్కరించలేరా? బుజ్జగించలేరా? అసలు కథ మొదలైందా? అసలు మంత్రులు తమంతట తామే శాఖలను తిరస్కరిస్తూ నిరసనలను చూపిస్తున్నారా? వేరెవరైనా వారిని ప్రేరేపిస్తున్నారా? ఇక్కడే రాజకీయ కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఇది కేవలం శాఖల కేటాయింపు వివాదం కాదు. ఇది అధికార మార్పిడి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన కొత్త శక్తి సమీకరణాల ప్రతిబింబం. నిన్నటి వరకు డీకే సీఎం కావాలని నినదించిన నేతలే…ఈరోజు తమకు దక్కిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం వెనుక అసలు కారణం ఏమిటి? కుర్చీ మారిందా? లేక అధికార కేంద్రాలు మారిపోయాయా? సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక శైలి ఉండేది. నిర్ణయాలు తీసుకునే విధానం వేరుగా ఉండేది.
ఇప్పుడు డీకే శివకుమార్ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. కానీ ప్రతి కొత్త నాయకత్వానికి ఎదురయ్యే మొదటి పరీక్ష ఇదే. తనను ముఖ్యమంత్రిగా అంగీకరించిన వారిని పాలనలో కూడా సంతృప్తిపరచగలడా? లేక అసంతృప్తి వర్గాలు క్రమంగా పెద్ద సవాలుగా మారతాయా? మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్‌కు దక్షిణ భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి రాష్ట్రంలో అంతర్గత విభేదాలు బయటపడితే దాని ప్రభావం జాతీయ రాజకీయాలపైనా పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడిప్పుడే వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు భవిష్యత్తులో పెద్ద తుఫానుగా మారకుండా అడ్డుకోవడం డీకే ముందున్న అతిపెద్ద సవాలు. అయితే డీకే శివకుమార్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. సంకట సమయంలో పార్టీని కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ప్రత్యర్థులు అసాధ్యమని భావించిన పరిస్థితులను కూడా తన రాజకీయ చాతుర్యంతో అనుకూలంగా మలిచిన చరిత్ర ఆయన సొంతం. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నం. ఇప్పటి వరకు డీకే పోరాడింది ప్రత్యర్థి పార్టీలతో… ఇప్పుడు పోరాడాల్సింది సొంత పార్టీ ఆశలు, ఆకాంక్షలు, అసంతృప్తులతో. ఇప్పటి వరకు ఆయన పని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం… ఇప్పుడు పని ప్రభుత్వాన్ని నిలబెట్టడం. ఇప్పటి వరకు లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీని చేరుకోవడం… ఇప్పుడు లక్ష్యం ఆ కుర్చీని కాపాడుకోవడం. అందుకే కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే… ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న డీకే శివకుమార్… తన చుట్టూ కమ్ముకుంటున్న ఈ రాజకీయ ట్రబుల్స్ ను కూడా అదే నేర్పుతో పరిష్కరిస్తారా? లేక ఆయన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన పరీక్షకు ఇది నాంది కాబోతుందా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది మంత్రుల అలకలు కాదు… రాబోయే నెలల్లో డీకే చూపించే నాయకత్వమే.



