రాత్రి 3 గంటలకు మెలుకువ వస్తుందా? అసలు కారణాలు ఇవే!
రాత్రి 3 గంటలకు మెలుకువ రావడం మిస్టరీనా?
సర్కేడియన్ రిథమ్ అంటే ఏమిటి?
స్ట్రెస్, ఆందోళన వల్ల నిద్ర ఎందుకు భంగమవుతుంది?
కార్టిసోల్ హార్మోన్ పాత్ర ఏమిటి?
మొబైల్, కాఫీ, ఆలస్య నిద్ర ప్రభావం
రాత్రి గడియారం మూడుసార్లు మోగింది…
ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నాయి. చుట్టూ నిశ్శబ్దం. ఫోన్ తీసుకుని టైమ్ చూస్తే… 3:03 ఏ.ఎం. మళ్లీ నిద్రపోవాలని ప్రయత్నించినా మెదడు మాత్రం ఆగడం లేదు. ఏవేవో ఆలోచనలు. గతం… భవిష్యత్… టెన్షన్… తెలియని ఆందోళన.
ఇలా రాత్రిళ్లు సరిగ్గా 3 గంటల ప్రాంతంలో మెలుకువ రావడం చాలా మందికి జరుగుతోంది. కొందరు దీన్ని “దెయ్యాల సమయం”, “ఆధ్యాత్మిక సంకేతం” అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్న వాస్తవం మాత్రం వేరే ఉంది.
మన శరీరంలో “సర్కేడియన్ రిథమ్” అనే సహజ జీవ గడియారం ఉంటుంది. ఇది నిద్ర, మేల్కొలుపు, హార్మోన్ల విడుదల, శరీర ఉష్ణోగ్రత వంటి ప్రక్రియలను నియంత్రిస్తుంది. సాధారణంగా అర్ధరాత్రి తర్వాత శరీరం గాఢ నిద్రలోకి వెళ్తుంది. కానీ రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య కొన్ని హార్మోన్ మార్పులు జరుగుతాయి. ఈ సమయంలోనే చాలా మందికి అకస్మాత్తుగా మెలుకువ రావచ్చు.
ప్రత్యేకంగా ఒత్తిడి (స్ట్రెస్), ఆందోళన (యాంగ్జైటీ), మానసిక టెన్షన్ ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా మనసులో దాచుకున్న ఆలోచనలు రాత్రివేళ మెదడును అప్రమత్తంగా ఉంచుతాయి. ఫలితంగా చిన్న శబ్దం వచ్చినా నిద్ర భంగమవుతుంది.
ఇంకో ముఖ్యమైన కారణం… కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్. ఉదయం లేవడానికి శరీరాన్ని సిద్ధం చేసే ఈ హార్మోన్ కొందరిలో ముందుగానే పెరగడం మొదలవుతుంది. దీంతో తెల్లవారక ముందే మెలుకువ వస్తుంది.
అలాగే కాఫీ అధికంగా తాగడం, రాత్రి ఆలస్యంగా మొబైల్ వాడడం, నిద్ర సమయం మారడం, షుగర్ లేదా థైరాయిడ్ సమస్యలు కూడా దీనికి కారణమయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. స్లీప్ అప్నియా, డిప్రెషన్ వంటి సమస్యలలో కూడా రాత్రి మధ్యలో మెలకువ రావడం సాధారణ లక్షణమని నిపుణులు పేర్కొంటున్నారు.

మరి దీన్ని ఎలా తగ్గించాలి?
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి.
పడుకునే గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ దూరంగా పెట్టాలి.
రాత్రివేళ టీ, కాఫీ తగ్గించాలి.
ధ్యానం, దీర్ఘ శ్వాస వ్యాయామాలు చేయడం ఉపయోగకరం.
నిద్రపోయే గది ప్రశాంతంగా ఉండాలి.
వైద్యుల సలహా, సూచనల ప్రకారం… అప్పుడప్పుడు ఇలా మెలకువ రావడం సాధారణమే. కానీ తరచూ ఇలాగే జరుగుతూ, నిద్రలేమి, అలసట, ఆందోళన పెరుగుతుంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.
కాబట్టి… రాత్రి 3 గంటలకు మెలకువ రావడం వెనుక “మిస్టరీ” కంటే, మన శరీరం-మెదడు పంపుతున్న చిన్న హెచ్చరికే ఎక్కువగా ఉంటుందని వైదారోగ్య నిపుణులు చెబుతున్నారు.



