whatsapp image 2026 06 01 at 02.26.28

ఇంట్లో లాబ్రడార్ ఉంటే… కుటుంబానికి ప్రేమ, ఆనందం, రక్షణ!

Spread the love

ఇంట్లో లాబ్రడార్ ఉంటే… కుటుంబానికి ప్రేమ, ఆనందం, రక్షణ!

ప్రేమ, ఓర్పు, విశ్వాసం… లాబ్రడార్ ప్రత్యేకతలు

ఇంట్లోకి ఎవరైనా కొత్త వ్యక్తి అడుగుపెడితే… మొదటగా తలుపు దగ్గరకు పరుగెత్తుకుంటూ.. తోక ఊపుతూ, ప్రేమగా దగ్గరకు వచ్చి వాసన చూస్తూ, క్షణాల్లోనే “మన వాళ్లే” అన్నట్టుగా కలిసిపోతుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రేమను పొందిన పెంపుడు కుక్కల జాతుల్లో లాబ్రడార్ ముందు వరుసలో నిలుస్తోంది.

ప్రస్తుతం నగరాల నుంచి గ్రామాల వరకు పెంపుడు జంతువులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా కుటుంబాలతో కలిసి సులభంగా కలిసిపోయే స్వభావం, పిల్లలతో ఆడుకునే అలవాటు, యజమానిపై చూపే విశ్వాసం కారణంగా చాలామంది లాబ్రడార్ జాతిని ఎంచుకుంటున్నారు. పశు వైద్య నిపుణుల సూచనల ప్రకారం… లాబ్రడార్లు సహజంగానే చాలా ప్రేమ పూర్వక స్వభావం కలిగిన జాతి. ఇంట్లో ఎవరు బాధగా ఉన్నా పక్కనే కూర్చోవడం, పిల్లలతో గంటల తరబడి ఆడుకోవడం, యజమాని ఇంటికి వస్తే ఉత్సాహంగా స్వాగతించడం వీటి ప్రత్యేక లక్షణాలు.

ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల్లో లాబ్రడార్‌ను “ఫ్యామిలీ డాగ్”గా పరిగణిస్తారు. ఇతర కొన్ని జాతులతో పోలిస్తే ఇవి కోపం తక్కువగా చూపిస్తాయని, పిల్లలతో త్వరగా కలిసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు వాటి చెవులు పట్టినా, వాటిపై ఎక్కి ఆడుకున్నా కూడా చాలా ఓర్పుగా వ్యవహరించడం వల్ల ఈ జాతికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

అయితే ప్రేమ మాత్రమే కాదు… తెలివితేటల్లో కూడా లాబ్రడార్ ముందుంటుంది. ట్రైనర్ ఇచ్చే సూచనలను త్వరగా అర్థం చేసుకుంటూ..చాలా వేగంగా నేర్చుకునే సామర్థ్యం వీటికి ఉంటుంది. అందుకే పోలీస్ విభాగాలు, రెస్క్యూ టీంలు, బాంబ్ స్క్వాడ్లు, గైడ్ డాగ్ సేవల్లో కూడా లాబ్రడార్‌ లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. యజమాని ఇచ్చే ఆదేశాలను త్వరగా అర్థం చేసుకోవడం, వాసన పసిగట్టే శక్తి ఎక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత.

ఇక ఇంటి రక్షణ విషయంలో కూడా లాబ్రడార్ అప్రమత్తంగా ఉంటుందని పెట్ ట్రైనర్లు చెబుతున్నారు. సాధారణంగా ఇవి అతి దూకుడు ప్రదర్శించకపోయినా… ఇంటి చుట్టూ అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే స్పందిస్తాయి. కుటుంబ సభ్యులపై గట్టి అనుబంధం ఉండటం వల్ల రక్షణ భావన కూడా ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

అయితే లాబ్రడార్ పెంచుకోవాలంటే ప్రేమతో పాటు బాధ్యత కూడా అవసరమని పశువైద్యులు సూచిస్తున్నారు. వీటికి సమయానికి సరైన ఆహారం, వ్యాయామం, టీకాలు, పరిశుభ్రత, రోజూ కొంత సమయం కేటాయించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ముఖ్యంగా లాబ్రడార్‌లు యజమానితో భావోద్వేగంగా ఎక్కువగా మమేకమవుతాయని, ఒంటరిగా ఎక్కువ సేపు వదిలేస్తే మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఒత్తిడితో నిండిపోయిన జీవనశైలిలో… ఒక లాబ్రడార్ ఇంట్లో ఉంటే అది కేవలం పెంపుడు జంతువుగానే కాకుండా కుటుంబానికి ఆనందం, అనుబంధం, భావోద్వేగ బలం ఇచ్చే సభ్యుడిగా మారిపోతుందని పెట్ ప్రేమికులు చెబుతున్నారు.

whatsapp image 2026 05 22 at 17.26.16

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

google-site-verification: googlee1f767d3d556c059.html