1child నేటి కుటుంబాల కొత్త ఆలోచన వెనుక ఉన్న నిజాలు
1child ఒక్క బిడ్డ.. కుటుంబానికి ప్రపంచమా?
ఒకప్పుడు సంతానాన్ని సంపదగా భావించేవారు. గంపెడు పిల్లలు అని పోల్చేవారు. ఇంట్లో పిల్లల కేరింతలు, అల్లరి చేష్టలు… పరిగెత్తే అడుగులు, తల్లి పిలుపులు, తండ్రి గంభీరత అన్నీ కలిసి ఇల్లే ఒక పెద్ద ప్రపంచంలా ఉండేది.
తర్వాత కాలం క్రమంగా మారింది. ఇద్దరు… లేదా ముగ్గురు పిల్లలు అనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత అది ఇద్దరికి తగ్గింది. ఇప్పుడు పరిస్థితి ఇంకా చిన్నదైపోయింది… “మనమిద్దరం… మనకొక్కరే చాలు” అనే స్థాయికి చేరుకుంది.
ఈ తరం దంపతుల నిర్ణయం వెనుక ఆధునిక జీవితం తీసుకొచ్చిన ఒత్తిడిలోంచి పుట్టిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్‌కేజీ నుంచే లక్షల రూపాయల డొనేషన్లు మొదలవుతున్నాయి. స్కూల్ దాటి కాలేజీకి వెళ్లేసరికి ఖర్చులు ఇంకా పెరుగుతున్నాయి. ప్రతి దశ ఒక ఆర్థిక పరీక్షలా మారిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఒకే ఆలోచనకు వస్తున్నారు…
“ఎక్కువ మంది పిల్లలను కనేకన్నా, ఒక్కరినే కని, బాగా పెంచితే సరిపోతుంది.”
ఇది కేవలం డబ్బు లెక్క మాత్రమే కాదు. సమయం కూడా పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగాలు, ప్రయాణాలు, పని ఒత్తిళ్లు మధ్య పిల్లలకు సమయం ఇవ్వడం కూడా ఒక సవాలుగా మారిపోయింది. అందుకే తల్లిదండ్రులు ఒక్కరితోనే సరిపెట్టుకుని, వారిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలనే దిశగా ఆలోచిస్తున్నారు.
ఇంకో పెద్ద మార్పు పెళ్లిళ్ల వయసులో కనిపిస్తోంది. ఇప్పుడు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, చాలా మంది ముప్పై ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించే సమయానికి శారీరక, మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను పెంచడం అంటే మరింత బాధ్యతగా మారుతోంది.
ఒక్కరే అయితే ఒక రిలాక్స్ ఉంటుందని ఇప్పటి తల్లిదండ్రుల భావన.
“ఒక్కరే కదా… మన ప్రేమ, మన సంపాదన, మన ఆశలన్నీ మన పాప/బాబుకే.”
ఇది ఒక వైపు గొప్ప భావనగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క బిడ్డపై తల్లిదండ్రుల దృష్టి పూర్తిగా కేంద్రీకృతమవుతుంది. అతనికి ఏ లోటూ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి చదువు, మంచి జీవితం, మంచి అవకాశాలు అన్నీ ఆ ఒక్కరికే ఇవ్వాలనే ఆలోచన బలపడుతుంది.
కానీ ఇదే సమయంలో ఒక పెద్ద సవాలు కూడా మొదలవుతుంది. ఒక్కరే బిడ్డ అయితే ఇంట్లో తోబుట్టువులు ఉండరు. ఆటలు, తగవులు, పంచుకోవడం, కలసి పెరగడం వంటి అనుభవాలు తగ్గిపోతాయి. ఇంట్లో ఎక్కువగా పెద్దల ప్రపంచమే ఉంటుంది. పాప/బాబు ప్రపంచం తల్లిదండ్రుల చుట్టూ మాత్రమే తిరుగుతుంది.
ఇంకో వైపు తల్లిదండ్రులకు కూడా బాధ్యత పెరుగుతుంది. ముఖ్యంగా తల్లి పాత్ర చాలా కీలకంగా మారుతుంది. పాప/బాబుతోనే ఎక్కువ సమయం గడపడం, ఆ అబ్బాయి లేదా అమ్మాయి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి స్నేహితురాలిగా కూడా మారడం అవసరం అవుతుంది. దీనివల్ల చాలా సందర్భాల్లో తల్లి తన కెరీర్‌ను కొంత మేర త్యాగం చేయాల్సి వస్తుంది.
తండ్రి కూడా అదే విధంగా తన సమయాన్ని సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రపంచాన్ని ఆ ఒక్క బిడ్డ చుట్టూ నిర్మిస్తారు. అతని ఆనందమే వారి జీవితంగా మారుతుంది.
అయితే ఈ మార్పులో ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది.
ఒక్క బిడ్డ అంటే భవిష్యత్తు సురక్షితమా? లేక ఒంటరితనం కొత్త సమస్యగా మారుతుందా?
ఇది సమాధానం లేని ప్రశ్నలా కనిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. కాలం మారింది. కుటుంబాల రూపం మారింది. ప్రేమ మారలేదు… కానీ దాన్ని వ్యక్తపరిచే విధానం మారింది.
చివరికి ఒక్కరే అయినా సరే…

ఒక్కరే ఇప్పుడు ఒక కుటుంబానికి ప్రపంచం.
ఒక్కరే వారి భవిష్యత్తు.
ఒక్కరే వారి కలల ప్రతిరూపం.
click here to read ఒక్క నిమిషం… అంత విలువైనదా? లేక ఒక విద్యార్థి భవిష్యత్తు కంటే గొప్పదా?



