28june2026mysunday మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారా?
-ముచ్చర్ల రజనీశకుంతల
బయట ఫుడ్ తింటున్నారా?
మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఎలా అంటారా? బయట ఫుడ్ తినడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. తెల్లారి లేవడంతోనే కాఫీ, టీలతో సహా స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తున్నాం. అసలు ఆడవాళ్లు వంటలు ఎక్కడ చేస్తున్నారు?
ఎంతసేపూ, “ఏ హోటల్‌కు వెళ్లి తిందాం?”, “ఏం ఆర్డర్ పెడదాం?” అన్నదే ఆలోచన.
మనం రోజూ ఎన్నో వీడియోలు చూస్తున్నాం. అన్నీ కల్తీ నూనె, కల్తీ కూరగాయలు, కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కల్తీ చికెన్… ఆఖరికి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన మసాలాలు, సాంబారు పౌడర్లు కూడా వాడేస్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా వీడియోలు చేసి పెట్టినా మారేది ఎవరు? ఎవరి గోల వారిదే అన్నట్టు ఉంది పరిస్థితి.
హాస్టళ్లలో వండే పదార్థాలు ఎంత నీట్‌గా ఉంటున్నాయి? ఫైవ్ స్టార్ హోటళ్లు సైతం కుళ్లిన మాంసంతో వంటలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, షవర్మా… ఆఖరికి చిన్న పిల్లలు ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్‌లు కూడా కల్తీ చేస్తున్నారు. తెల్లారి లేవగానే వచ్చే పాలు కూడా కల్తీయే.
దయచేసి బయట ఫుడ్‌ను అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వండుకోండి. ఒక్క కూర, అన్నం, చారు అయినా చాలు. ఇంట్లో తింటే ఆ తృప్తి వేరు. వేడి అన్నంలో కొంచెం పొడి గానీ, పచ్చడి గానీ వేసుకుని తిన్నా చాలు. మనం ఇంట్లో ప్రతిదీ కడిగి, శుభ్రంగా చేసుకుని తింటాం. ఒక గంట కష్టపడితే చాలు కదా!
పూర్వకాలంలో ఇన్ని హోటళ్లు ఉన్నాయా? స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయా? మన నానమ్మలు, అమ్మమ్మలు, అమ్మలు వండుకుని 100 సంవత్సరాలు ఏ రోగమూ లేకుండా హాయిగా జీవించలేదా? మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ?
అలవాటు… బద్ధకం! వంట చేయాలంటే బద్ధకం, బట్టలు ఉతకాలంటే బద్ధకం, ఇల్లు శుభ్రం చేయాలంటే బద్ధకం. ప్రతిదానికి ఆల్టర్నేట్లు వచ్చేశాయి. ఇల్లు శుభ్రం చేయడానికి అర్బన్ కంపెనీలు, బట్టల క్లీనింగ్‌కు సేవలు, వంటకు స్విగ్గీ, జొమాటోలు… అన్నీ రెడీమేడ్‌గా వచ్చేస్తున్నాయి.
డబ్బు పారేస్తే దొరకనిది అంటూ ఏమీ లేదు. ప్రతిదీ ఫోన్ చేతిలోనే ఉంది. ఆర్డర్ పెట్టడం అలవాటైపోయింది. ఆఖరికి వేసుకునే బట్టలు, చెప్పులు, పువ్వులు, నగలు… సమస్తం మన ఇంటికే వచ్చి చేరుతున్నాయి.
ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం చుట్టి వచ్చినట్టే. కానీ పని చేయాలంటే మాత్రం బద్ధకం. గంటల తరబడి ఫేస్‌బుక్ రీల్స్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్… వీటితోనే కాలక్షేపం అయిపోతోంది.
అసలు భార్యాభర్తలు మాట్లాడుకునే సమయం ఎక్కడ? పిల్లలతో హాయిగా గడిపే క్షణాలు ఎక్కడ? ఎవరి రూమ్‌లో వాళ్లు ఫోన్ పట్టుకుని కూర్చోవడం, గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడపడం, నచ్చినవి ఆర్డర్ పెట్టుకోవడం… ఇదే జీవితం అయిపోయింది.
పూర్వం రోజులు ఎంత బాగుండేవి! ఇంటిల్లిపాది కలిసి వంట పనులు చేసేవారు. ఇప్పుడు పిల్లలను, “సహాయానికి రండి” అంటేనే కోపం వస్తోంది.
పూర్వం ఊరగాయలు పెట్టే సమయంలో మా ఇంట్లో అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చకచకా చేసేవాళ్లం. నాన్నగారు నాలుగు జాడీల ఆవకాయ కలిపేవారు. అందరం కలిసి ఆనందంగా చేసుకునేవాళ్లం. ఇప్పుడు ఆ రోజులు ఎక్కడ?
కాస్త వాన పడితే, “పకోడీలు తిందాం” అని ఇంట్లోనే చేసేవారు. వడియాలు అంటే ఎంత ఇష్టమో… ఇంట్లోనే వేయించేవారు. ఏదైనా ఫంక్షన్ వస్తే అందరం కలిసి పని చేసేవాళ్లం. ఆ రోజులే వేరు కదా!
అపరిశుభ్రంగా ఉండే బయట ఫుడ్ కంటే, ఇంట్లో అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వండుకునే వంటల్లో ప్రేమ, మమకారం, అనురాగం ఉంటాయి.
అంతేకాదు… ఆ అపరిశుభ్రమైన ఫుడ్ తిని హాస్పిటల్ పాలవుతున్న వారు ఎందరో. తెల్లారి లేస్తే, “ఫుడ్ పాయిజన్ అయింది” అనే వార్తలు వింటూనే ఉంటాం. ఇవన్నీ అవసరమా?
ఆడవాళ్లు దయచేసి బద్ధకాన్ని పక్కన పెట్టి కాస్త వంటలు చేయండి. “మేము బిజీ” అని సాకులు చెప్పొద్దు. ఒక్క ఇంటిలోని సభ్యులందరూ క్షేమంగా ఉండాలంటే, ఈ రోజు నుంచే బయట ఫుడ్లు ఆర్డర్ పెట్టడం మానేసి ఇంట్లో వంటలు మొదలు పెట్టండి.
ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం.
మీ భర్తకు, పిల్లలకు వాళ్లకు ఇష్టమైనవి చేసి పెట్టడం కంటే తృప్తి ఏముంటుంది? కాదంటారా?
మీ ఇంట్లోని వారి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కాదనకండి.
ఏ నెలకో, రెండు నెలలకో ఒకసారి బయట తింటే అర్థం ఉంది. కానీ ప్రతిరోజూ ఆర్డర్లు పెట్టడం మానేసి, హాయిగా ఒక్క కూర అయినా చాలు… ఇంట్లో వండండి. మనస్ఫూర్తిగా వడ్డించండి.
అంతకంటే ఇంకేం కావాలండి!




