Emotional Tears 3 Types: కన్నీళ్లు బలహీనత కాదు..
Emotional Tears 3 Types: ఏడుపు, నవ్వు మన మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
నవ్వినా, ఏడ్చినా మనసుకు మంచిదే!
చిన్న బాధలు చెప్పుకోవాలంటే రూ.500 ..
పెద్ద బాధలకు రూ.1000..
కలిసి ఏడవాలంటే రూ.3000 చెల్లించాలి.
అంటూ ఒక న్యూరోసైకియాట్రిస్ట్ విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది హాస్యం కాదు, ప్రలోభం అంతకంటే కాదు. భావాలు పంచుకుంటే బాధలు తగ్గుతాయి. ఏడ్చినా, నవ్వినా మనసుకు ఉపశమనం దొరుకుతుంది.
“నవ్వు నాలుగు విధాలుగా చేటు” అన్నది నానుడి.
“మగవాడు ఏడవకూడదు…”, “ఏడిస్తే బలహీనుడవుతావు…” వంటి మాటలు మన సమాజంలో తరచూ వినిపిస్తుంటాయి. చిన్నప్పటి నుంచే భావోద్వేగాలను అణచుకోవడమే గొప్పతనమని చాలామందికి నేర్పుతారు. కానీ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతున్నది ఇందుకు భిన్నం. సరైన సందర్భంలో కన్నీరు పెట్టుకోవడం బలహీనతకు సంకేతం కాదు. అది మనసు తన భావోద్వేగాలను వ్యక్తం చేసుకునే సహజ ప్రక్రియ.
మనిషి నవ్వినా కన్నీళ్లు వస్తాయి. బాధతో ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి. కానీ ఈ రెండు సందర్భాల్లో మెదడు, మనసు అనుభవించే మార్పులు వేర్వేరుగా ఉంటాయి. కన్నీళ్లు కేవలం కళ్లను తడిపే నీటి బిందువులు కావు; అవి శరీరం, మనసు, భావోద్వేగాల మధ్య జరిగే అద్భుత సమన్వయానికి ప్రతీక.
కన్నీళ్లకూ రకాలున్నాయి
శాస్త్రవేత్తలు కన్నీళ్లను ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు.
మొదటిది – బేసల్ టియర్స్: ఇవి నిరంతరం కళ్లను తడిగా ఉంచి, చూపును స్పష్టంగా ఉంచుతాయి.
రెండవది – రిఫ్లెక్స్ టియర్స్: ఉల్లిపాయ కోసినప్పుడు, పొగ లేదా దుమ్ము కంట్లో పడినప్పుడు వచ్చే కన్నీళ్లు. ఇవి కంటిని రక్షిస్తాయి.
మూడవది – ఎమోషనల్ టియర్స్: బాధ, ఆనందం, ప్రేమ, ఆవేదన, అనురాగం వంటి తీవ్రమైన భావోద్వేగాల సమయంలో వచ్చే కన్నీళ్లు. ఇవి భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

కన్నీళ్లు కళ్లకు కవచం
మన కంటిపై ఉండే కన్నీటి పొర మూడు భాగాలతో రూపొందుతుంది. బయట భాగంలోని నూనె పొర కన్నీళ్లు త్వరగా ఆవిరి కాకుండా కాపాడుతుంది. మధ్యలోని నీటి పొరలో లైసోజైమ్ వంటి ఎంజైమ్‌లు ఉండి బ్యాక్టీరియాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. లోపలి మ్యూసిన్ పొర కన్నీళ్లు కంటి ఉపరితలానికి బాగా అంటుకునేలా చేస్తుంది. అందుకే కన్నీళ్లు కేవలం భావోద్వేగాలకు మాత్రమే కాదు, కంటి ఆరోగ్యానికి కూడా అత్యంత అవసరం.
ఏడిస్తే ఒత్తిడి తగ్గుతుంది
ఈ ప్రశ్నకు సమాధానం “అవును… కానీ కన్నీళ్ల ద్వారా ఒత్తిడి హార్మోన్లు బయటికి వెళ్లిపోవడం వల్ల మాత్రమే కాదు” అని ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఒకప్పుడు భావోద్వేగ కన్నీళ్ల ద్వారా కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు బయటికి వెళ్లిపోతాయని భావించారు. అయితే దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు.
అయితే భావోద్వేగాలను అణచిపెట్టకుండా వ్యక్తం చేయడం, బాధను పంచుకోవడం, ఏడవడం, ఇతరుల ఆదరణ పొందడం వంటి అంశాలు మనసు తేలికపడటానికి సహాయపడవచ్చు. దీనినే మనోవిజ్ఞాన శాస్త్రంలో భావోద్వేగ నియంత్రణలో భాగంగా పరిగణిస్తారు.
నవ్వు కూడా ఒక ఔషధమే
మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు శరీరంలో ఎండోర్ఫిన్ల వంటి సహజ రసాయనాల ప్రభావం పెరుగుతుంది. ఇవి ఆనందాన్ని పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, మనుషుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
అందుకే నవ్వును కొన్ని సందర్భాల్లో మానసిక ఆరోగ్యానికి సహాయక చికిత్సా విధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.
కన్నీళ్లను అడ్డుకోవడం మంచిదేనా?
ప్రతి సందర్భంలో ఏడవడం అవసరం లేదు. అలాగే ప్రతి సందర్భంలో ఏడుపును బలవంతంగా అణచుకోవడమూ మంచిది కాదు. భావోద్వేగాలను పదేపదే అణచిపెట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే తరచూ కారణం లేకుండా ఏడవడం, వారాల తరబడి దిగులు, ఆసక్తి కోల్పోవడం, ఆత్మన్యూనత భావాలు ఉంటే అది డిప్రెషన్ లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. అలాంటి సందర్భాల్లో కౌన్సిలింగ్ సైకాలజిస్టు లేదా మానసిక వైద్యుడిని సంప్రదించడం అవసరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమి చెబుతోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మానసిక ఆరోగ్యం అంటే కేవలం మానసిక వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదు. భావోద్వేగాలను ఆరోగ్యకరంగా నిర్వహించడం, జీవితంలోని ఒత్తిడులను సమర్థంగా ఎదుర్కోవడం, సార్థకమైన సంబంధాలను కొనసాగించడం కూడా మానసిక ఆరోగ్యంలో భాగమే. భావోద్వేగాలను అంగీకరించడం, అవసరమైనప్పుడు వాటిని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయడం మంచి మానసిక ఆరోగ్యానికి కీలకమైన అంశాలు.
కన్నీళ్లు మనిషి బలహీనతకు చిహ్నాలు కావు. అవి మనసు మాట్లాడే భాష. కొన్ని కన్నీళ్లు బాధను బయటకు తీసుకొస్తాయి. మరికొన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. ఇంకొన్ని మనసుకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయి.
అందుకే…
కన్నీళ్లకు సిగ్గుపడకండి.
భావోద్వేగాలను బంధించకండి.
మనసు భారంగా అనిపించినప్పుడు నమ్మకమైన వారితో మాట్లాడండి. అవసరమైతే కన్నీళ్లకు అవకాశం ఇవ్వండి. కొన్నిసార్లు మనసును తేలికపరచడానికి మాటలు చేయలేని పనిని కన్నీళ్లు చేస్తాయి.
– డాక్టర్ ఎన్. బి. సుధాకర్ రెడ్డి
సైకాలజిస్ట్
click here to read more
click here to read అలలు వస్తాయి… వెళ్లిపోతాయి! జీవితం చెప్పే గొప్ప పాఠం…?




Pingback: WeddingPrivacy11: 11 కోట్ల వ్యూస్ కోసం ప్రైవసీని పణంగా పెట్టాలా? - Trendy Duniyaa