Mobile Sleep Stress 3

Mobile Sleep Stress 3: మొబైల్‌ కంటే పిల్లల మనసులోని ఒత్తిడే అసలు ప్రమాదమా?

Spread the love

Mobile Sleep Stress 3: మొబైల్‌, నిద్రలేమి, ఒత్తిడి… పిల్లలపై అసలు ప్రభావం ఏది?

Mobile Sleep Stress 3: మార్కుల కంటే పిల్లల మానసిక ఆరోగ్యమే ముఖ్యం!

అసలు ప్రమాదం ఏది?
మొబైలా? నిద్రలేమా? ఒత్తిడా?
పిల్లలు మొబైల్‌ ముట్టుకుంటే ఏదో అపవిత్రమైన పని చేసినట్టుగా చూస్తున్నాం. “మొబైల్‌ వల్ల పిల్లలు చెడిపోతున్నారు” అని ఆందోళన చెందుతున్నాం. స్క్రీన్‌ టైమ్‌ తగ్గించాలి, మొబైల్‌ వ్యసనాన్ని నియంత్రించాలి అనడం అవసరమే. కానీ మొబైల్‌ను మాత్రమే నిందిస్తే అసలు సమస్యను సగమే చూస్తున్నట్టే!
మనం ఒకసారి మన గతాన్ని గుర్తు చేసుకోవాలి.
మా రోజుల్లో నవలలు, వారపత్రికలు చదివినా పెద్దలు మందలించేవారు. “చదువుకోకుండా పుస్తకాలు చదువుతావా?” అని ప్రశ్నించేవారు. కాలం మారింది. ఇప్పుడు అదే సమాజం పిల్లలకు “కష్టపడి చదివితేనే భవిష్యత్తు” అని చెబుతోంది.
ఫలితం?


పాఠశాల… ట్యూషన్‌… కోచింగ్‌… పరీక్షలు… ర్యాంకులు… పోటీ పరీక్షలు…
పిల్లల జీవితాన్ని పుస్తకాల మధ్య బంధిస్తున్నాం. 20–25 ఏళ్లు చదివిన తరువాత కూడా “ఇంకా నైపుణ్యాలు నేర్చుకోవాలి” అని చెబుతున్నాం.
అయితే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
ఇన్నేళ్లు చదివిన తర్వాత కూడా నైపుణ్యాలు ఎందుకు అబ్బలేదు?
ఈ ప్రశ్నను వ్యవస్థను ఉద్దేశించి అడగకుండా, పిల్లల చేతిలోని మొబైల్‌ను మాత్రమే నిందించడం ఎంతవరకు సమంజసం?

మొబైల్‌ అంటే వ్యసనమేనా?

Mobile Sleep Stress 3
Mobile Sleep Stress 3


మొబైల్‌ ఒక సాధనం. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం.
పూర్వం పత్రికలు, పుస్తకాలు మనకు సమాచారం, వినోదం, ప్రపంచ పరిజ్ఞానాన్ని అందించాయి. ఇప్పుడు అదే పని మొబైల్‌, ఇంటర్నెట్‌ చేస్తున్నాయి.
ఆన్‌లైన్‌ తరగతులు, విద్యా వీడియోలు, నిఘంటువులు, వార్తలు, పుస్తకాలు, నైపుణ్యాల అభ్యాసం, ప్రపంచ పరిజ్ఞానం—ఇవన్నీ మొబైల్‌ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి ప్రతి మొబైల్‌ వినియోగాన్ని వ్యసనం అనుకోవడం తప్పు.
వ్యక్తి నియంత్రణ కోల్పోయి, మొబైల్‌ వినియోగం అతని శారీరక, మానసిక, సామాజిక జీవితాన్ని దెబ్బతీస్తేనే దాన్ని సమస్యాత్మక వినియోగంగా లేదా వ్యసనంగా చూడాలి.


అసలు ప్రశ్న ఇదే…
మొబైల్‌ను లాక్కుని, అదే పిల్లవాడిని రాత్రి 11 గంటల వరకు పుస్తకం ముందు కూర్చోబెడితే ప్రయోజనం ఏమిటి?
రాత్రి పొద్దుపోయే వరకు చదివించడం… తెల్లవారకముందే లేపడం… పగలు పాఠశాల… సాయంత్రం ట్యూషన్‌… వారాంతంలో పరీక్షలు…
ఇది చదువు కోసం అవసరమైన క్రమశిక్షణా? లేక పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడా?
నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు. నేర్చుకున్న విషయాలను జ్ఞాపకాల్లో స్థిరపరచడానికి, ఏకాగ్రతను కాపాడుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి తగినంత నిద్ర ఎంతో అవసరం.
నిద్ర తగ్గితే అలసట పెరుగుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. నేర్చుకునే సామర్థ్యం దెబ్బతినవచ్చు. ఆందోళన, చిరాకు పెరగవచ్చు.


అప్పుడు ఒక ప్రమాదకరమైన చక్రం మొదలవుతుంది:
అర్థం కావడం లేదు → మరింత చదువు → నిద్ర తగ్గుతుంది → అలసట పెరుగుతుంది → ఏకాగ్రత తగ్గుతుంది → ఒత్తిడి పెరుగుతుంది → మళ్లీ మరింత చదువు.
ఇది విద్య కాదు.
విద్య పేరుతో పెరుగుతున్న మానసిక ఒత్తిడి.
మరి పిల్లలు ఫోన్‌ వైపు ఎందుకు వెళ్తున్నారు?
ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి.
చదువు ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికా?
వైఫల్యం భయంతోనా?
ఒంటరితనంతోనా?
తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే బాధతోనా?
లేదా కేవలం వినోదం కోసమేనా?
“ఎంతసేపు ఫోన్‌ చూశావు?” అని అడగడం సులభం.
ఎందుకు ఇంత ఒత్తిడిగా ఉన్నావు?” అని అడగడం ముఖ్యం.
“ఎన్ని మార్కులు వచ్చాయి?” అని అడగడం సులభం.
నువ్వు సంతోషంగా ఉన్నావా?” అని అడగడం అత్యవసరం.

మూడు సమస్యలు… ఒక విషవలయం!
మొబైల్‌ అధిక వినియోగం నిద్రను ప్రభావితం చేయవచ్చు.
నిద్రలేమి ఒత్తిడిని పెంచవచ్చు.
ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి పిల్లలు మళ్లీ మొబైల్‌ వైపు వెళ్లవచ్చు.
అందుకే ఈ మూడింటినీ విడివిడిగా చూడకూడదు.
మొబైల్‌ సమస్య కావచ్చు.
నిద్రలేమి ప్రమాదకరం.
నిరంతర ఒత్తిడి ఈ రెండింటినీ మరింత తీవ్రం చేయవచ్చు.
అందుకే పిల్లల చేతిలోని మొబైల్‌ను లాక్కోవడం ఒక్కటే పరిష్కారం కాదు.
వారి చదువు సమయం, నిద్ర సమయం, ఆట సమయం, విశ్రాంతి సమయం, కుటుంబంతో గడిపే సమయం—అన్నింటికీ సమతుల్యత అవసరం.

మార్కుల కంటే మనిషి ముఖ్యం!
మార్కులు ముఖ్యం.
ర్యాంకులు కూడా ముఖ్యం.
కానీ పిల్లల మానసిక ఆరోగ్యం కంటే అవి ముఖ్యం కావు.
ఒక మంచి ర్యాంక్‌ కోసం పిల్లవాడి నిద్రను, ప్రశాంతతను, బాల్యాన్ని, ఆనందాన్ని

త్యాగం చేయాల్సి వస్తే… మనం సాధిస్తున్నది విజయం కాదు.
పిల్లలను పరీక్షలకు సిద్ధం చేయాలి.
కానీ జీవితానికి దూరం చేయకూడదు.
పిల్లల చేతిలోని ఫోన్‌ను చూసి భయపడే సమాజం…
వారి కళ్లలోని నిద్రలేమిని కూడా చూడాలి.
వారి ముఖంలోని అలసటను కూడా గమనించాలి.
వారి మనసులోని ఒత్తిడిని కూడా అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే…
పిల్లల చేతిలోని మొబైల్‌ కంటే, వారి మనసులోని ఒత్తిడే ప్రమాదకరం!

డాక్టర్ ఎన్. బి. సుధాకర్ రెడ్డి
సైకాలజిస్ట్

click here to read more

click here to read చదువుల పేరుతో రోగులను తయారు చేస్తున్నామా? పిల్లల నిద్ర, ఒత్తిడిపై షాకింగ్ నిజాలు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *