Emotional Tears 3 Types

Student Mental Health 14: చదువుల పేరుతో రోగులను తయారు చేస్తున్నామా? పిల్లల నిద్ర, ఒత్తిడిపై షాకింగ్ నిజాలు

Spread the love

Student Mental Health 14: మార్కుల కోసం నిద్రను తగ్గిస్తున్నారా? పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు తప్పక ఆలోచించాల్సిన విషయం

Student Mental Health 14: చదువు కంటే ముందుగా పిల్లల నిద్ర, మానసిక ప్రశాంతత ఎందుకు ముఖ్యం?

చదువుల పేరుతో రోగులను తయారు చేస్తున్నామా?
మార్కులు పెరగాలంటే నిద్ర తగ్గించాలా?
జ్ఞాపకశక్తి పెరగాలంటే పిల్లల బాల్యాన్ని తగ్గించాలా?
“ఇంకా చదువు… ఇంకొంచెం చదువు… ఉదయం త్వరగా లేచి చదువు…”
పిల్లల భవిష్యత్తు బాగుండాలనే తల్లిదండ్రుల ఆరాటం ఇది. విద్యా సంస్థల పోటీ వాతావరణం కూడా దీనికి తోడవుతోంది. కానీ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి.
చదువుల పేరుతో మనం విద్యార్థులను తయారు చేస్తున్నామా? లేక రోగులను తయారు చేస్తున్నామా?
రాత్రి 10, 11 గంటల వరకు చదివించి, తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేపి మళ్లీ పుస్తకం ముందు కూర్చోబెట్టడం ఇప్పుడు కొన్ని చోట్ల కనిపిస్తున్న విధానం. దీనిని క్రమశిక్షణగా, విజయానికి మార్గంగా భావిస్తున్నారు.
కానీ మెదడుకు విశ్రాంతి ఇవ్వకుండా చదివించినంత మాత్రాన జ్ఞానం పెరగదు.

నిద్ర తగ్గితే చదువు పెరగదు

Student-Mental-Health-14
Student-Mental-Health-14


విద్యార్థి మెదడు చదివిన సమాచారాన్ని కేవలం చదివే సమయంలోనే నేర్చుకోదు. నిద్ర సమయంలో మెదడు సమాచారాన్ని క్రమబద్ధీకరించి, జ్ఞాపకాలను స్థిరపరచడంలో కీలకమైన పని చేస్తుంది.
అందుకే నిద్ర అనేది చదువుకు ప్రత్యర్థి కాదు… చదువులో ఒక భాగం.
అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం 6–12 ఏళ్ల పిల్లలకు సాధారణంగా రోజుకు 9–12 గంటల నిద్ర, 13–18 ఏళ్ల కిశోరులకు 8–10 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర శ్రద్ధ, ప్రవర్తన, అభ్యాసం, జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణకు సహాయపడుతుంది.
అయితే ఒక విద్యార్థి రాత్రి 11 గంటలకు నిద్రపోయి ఉదయం 4 గంటలకు లేస్తే కేవలం ఐదు గంటల నిద్ర మాత్రమే లభిస్తుంది.
అది చదువుకు అదనపు సమయం కాదు.
అది మెదడుకు తగ్గించిన విశ్రాంతి సమయం.
“బ్రహ్మ ముహూర్తం” పేరుతో నిద్రను తగ్గించకూడదు
ఉదయం 4 గంటలకు లేవడం తప్పు అని చెప్పడం కాదు. ఆ సమయంలో ప్రశాంత వాతావరణం కొందరికి ఏకాగ్రతకు అనుకూలంగా ఉండవచ్చు.


కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి:
ఉదయం 4 గంటలకు లేవడం ఆరోగ్యకరమా కాదా అన్నది గడియారం నిర్ణయించదు… ముందురోజు ఎంతసేపు, ఎంత నాణ్యంగా నిద్రపోయామన్నదే నిర్ణయిస్తుంది.


రాత్రి 8 గంటలకు నిద్రపోయి ఉదయం 4 గంటలకు లేచే విద్యార్థి, రాత్రి 11 గంటలకు నిద్రపోయి ఉదయం 4 గంటలకు లేచే విద్యార్థి ఒకే పరిస్థితిలో ఉండరు.
కాబట్టి “బ్రహ్మ ముహూర్తం” అనే పేరుతో పిల్లల నిద్రను తగ్గించడం మాత్రం శాస్త్రీయంగా సమర్థించలేం.
ఏసీ కాదు… గాలి మార్పిడి ముఖ్యం
కానీ పూర్తిగా మూసివేసిన ఏ సీ గదిలో తాజా గాలి ప్రవేశం, పాత గాలి బయటకు వెళ్లే విధానం సరిగా లేకపోతే కార్బన్ డయాక్సైడ్ స్థాయులు పెరగవచ్చు. సరైన గాలి నాణ్యత లేకపోవడం వల్ల తలనొప్పి, అలసట, కళ్లలో లేదా ముక్కు-గొంతులో అసౌకర్యం వంటి లక్షణాలు రావచ్చని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ సూచిస్తోంది.


అందువల్ల విద్యార్థులు రోజంతా ఏసీ గదిలో ఉండటం కంటే సరైన వెంటిలేషన్, తాజా గాలి, సహజ వెలుతురు, బయట కొంత సమయం గడపడం ముఖ్యమైనవి.
“ఏసీ వల్ల ఆక్సిజన్ తగ్గుతుంది” అనలేము“వెంటిలేషన్ లేని మూసివేసిన గదులు విద్యార్థుల ఆరోగ్యానికి అనుకూలం కావు
ఒత్తిడి… మెదడుపై కనిపించని భారం
చదువు అంటే ఆసక్తి, అన్వేషణ, అవగాహన కావాలి.


కానీ చదువు అంటే భయం, శిక్ష, ర్యాంకు, మార్కులు, పోలికలు, తల్లిదండ్రుల ఒత్తిడి, ఉపాధ్యాయుల ఒత్తిడి అయిపోయినప్పుడు విద్యార్థి పుస్తకాన్ని జ్ఞానానికి మార్గంగా కాకుండా ఒత్తిడికి ప్రతీకగా చూడటం మొదలుపెడతాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అధిక ఒత్తిడి ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. తలనొప్పి, నిద్ర సమస్యలు, ఆందోళన వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. తగినంత నిద్ర శరీరానికీ, మనసుకీ పునరుత్తేజాన్ని అందించడంలో ముఖ్యమైనది.
మానసిక ఆరోగ్య సమస్యలకు ఒకే ఒక్క కారణం ఉండదు. కుటుంబ పరిస్థితులు, విద్యా ఒత్తిడి, సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత అనుభవాలు, జీవనశైలి వంటి అనేక అంశాలు కలిసి ప్రభావితం చేస్తాయి. అయితే నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి అంశాలను నిర్లక్ష్యం చేయడం మాత్రం ప్రమాదకరం.


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు కిశోరుల్లో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్య ఉంది. కాబట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని విద్యా వ్యవస్థలోనే భాగంగా చూడాల్సిన అవసరం ఉంది.
మార్కులు కాదు… మెదడు సామర్థ్యమే అసలు పెట్టుబడి
సన్నద్ధత ముఖ్యం
నేను స్వయంగా పీ హెచ్‌డీతో సహా ఆరు పీజీ డిగ్రీలు, ఆరు డిప్లొమాలు చదివాను. జర్నలిజం, కౌన్సెలింగ్, శిక్షణ–బోధన, యోగ, ధ్యానం, ఫార్మసీ, రాజకీయ, క్రీడా రంగాల్లో అనుభవం సంపాదించాను.
కానీ నా జీవితంలో ఏ రోజూ ఉదయం 7 గంటలకు ముందు లేచి చదవలేదు.
ఇది అందరికీ ఒకే నియమం అని చెప్పడం కాదు. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే—
చదవడానికి సమయం కంటే చదవాలనే సన్నద్ధత ముఖ్యం.
ఆసక్తి ఉంటే చదువు భారంగా అనిపించదు.


ఇష్టం ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది.
అవసరం అర్థమైతే జ్ఞాపకశక్తి చురుగ్గా పనిచేస్తుంది.
లక్ష్యం స్పష్టంగా ఉంటే సమయం తక్కువైనా ఫలితం ఎక్కువగా ఉంటుంది.
అందుకే విద్యార్థికి రోజుకు 14 గంటలు పుస్తకం ముందు కూర్చోబెట్టడం కంటే, కొన్ని గంటలు నాణ్యమైన ఏకాగ్రతతో చదివేలా చేయడం ముఖ్యం.
బట్టీ కాదు… మౌలిక సూత్రాలపై పట్టు
మన విద్యా విధానంలో మరో సమస్య బట్టీ చదువుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం.
పరీక్షలో సమాధానం రాయడానికి గుర్తుపెట్టుకున్న సమాచారం కొంతకాలం ఉపయోగపడవచ్చు. కానీ జీవితంలో సమస్యను పరిష్కరించడానికి అర్థం చేసుకున్న జ్ఞానం అవసరం.
“ఏమిటి?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పే విద్య కంటే,
“ఎందుకు?”
“ఎలా?”
“ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది?”
అనే ప్రశ్నలకు సమాధానం వెతికే విద్యే మేధో వికాసానికి దోహదపడుతుంది.


పిల్లలను పుస్తకాలకు బానిసలుగా కాకుండా ఆలోచించే వ్యక్తులుగా తయారు చేయాలి.
ఉదయం 6 తర్వాత లేవడం తప్పా?
ప్రతి విద్యార్థికి ఒకే నిద్ర–లేవు సమయాన్ని నిర్ణయించడం శాస్త్రీయంగా సరైన విధానం కాదు.
పిల్లల వయస్సు, పాఠశాల సమయం, ప్రయాణం, వ్యక్తిగత నిద్ర అవసరం, ఆరోగ్యం, జీవనశైలి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
కానీ ఒక సాధారణ సూత్రం మాత్రం స్పష్టంగా ఉండాలి:
ముందుగా తగినంత నిద్ర. ఆ తర్వాత చదువు.
ఉదయం 4 గంటలకు లేపాలనుకుంటే ముందురోజు తగినంత ముందుగానే నిద్రపోయేలా చూడాలి. లేకపోతే 6 గంటలకు లేచి, శరీరం–మెదడు సహజంగా మేల్కొన్న తర్వాత చదివించడం మరింత సమర్థవంతంగా ఉండవచ్చు.


తల్లిదండ్రులారా… ఒకసారి ఆలోచించండి
మన పిల్లలు మంచి ర్యాంకు సాధించాలని కోరుకోవడం తప్పు కాదు.
కానీ ర్యాంకు కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయడం మాత్రం సరైనది కాదు.
మంచి మార్కులు సాధించిన అనారోగ్య విద్యార్థి కంటే, ఆరోగ్యంగా ఆలోచించే విద్యార్థి సమాజానికి ఎక్కువ అవసరం.
పిల్లల గదిలో పుస్తకాలు ఎన్ని ఉన్నాయో చూసే ముందు…
వారు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో చూడాలి.
రోజులో ఎన్ని గంటలు చదువుతున్నారో అడిగే ముందు…


చదువుపై వారికి ఆసక్తి ఉందా? భయం ఉందా? ఒత్తిడి ఉందా? అని అడగాలి.
మార్కులు ఎంత వచ్చాయో తెలుసుకునే ముందు…
“నువ్వు సంతోషంగా ఉన్నావా?” అని అడగాలి.
విద్య అంటే జీవితాన్ని నిర్మించడం
విద్యార్థిని పరీక్షకు సిద్ధం చేయడం మాత్రమే విద్య కాదు.
అతన్ని జీవితానికి సిద్ధం చేయడం విద్య.


అందుకు నిద్ర కావాలి.
వ్యాయామం కావాలి.
ఆట కావాలి.
స్నేహాలు కావాలి.
కుటుంబంతో సమయం కావాలి.
ప్రకృతితో అనుబంధం కావాలి.
ముఖ్యంగా మానసిక ప్రశాంతత కావాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కిశోర దశలో నిద్ర, శారీరక ఆరోగ్యం, సామాజిక–మానసిక మద్దతు వంటి అంశాలను ఆరోగ్యకరమైన అభివృద్ధికి కీలకంగా గుర్తిస్తోంది.


చదువు కోసం నిద్రను త్యాగం చేయకండి.
మార్కుల కోసం బాల్యాన్ని త్యాగం చేయకండి.
ర్యాంకుల కోసం మానసిక ఆరోగ్యాన్ని త్యాగం చేయకండి.
పిల్లల మెదడును ఎక్కువ గంటలు పనిచేయించే యంత్రంగా చూడకండి.
అది ఎదుగుతున్న జీవ వ్యవస్థ.
దానికి నిద్ర, విశ్రాంతి, పోషణ, వ్యాయామం, ప్రేమ, ప్రోత్సాహం, ఆసక్తి, స్వేచ్ఛాయుత ఆలోచన అన్నీ అవసరం.
చదవడానికి సమయం కంటే… చదవడానికి సిద్ధమైన మెదడు ముఖ్యం.
అందుకే తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఒకసారి ఆలోచించాలి—
“మన పిల్లలను చదివిస్తున్నామా?
లేక చదువుల పేరుతో వారి ఆరోగ్యాన్ని కోల్పోయేలా చేస్తున్నామా?”
శాస్త్రీయంగా ఆలోచిద్దాం…
ఆరోగ్యంగా చదివిద్దాం…
ఆలోచించే తరాన్ని నిర్మిద్దాం.

Student Mental Health 14

Student Mental Health 14

Student Mental Health 14


– డా. ఎన్. బి. సుధాకర్ రెడ్డి

click here to read more

click here to read నవ్వినా, ఏడ్చినా మనసుకు మంచిదే! కన్నీళ్ల వెనుక అసలు సైన్స్ ఇదే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *