College Annual Day రచయిత: ఇలపావులూరి శేషతల్పశాయి

సార్ మన కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న రాజు, అనూరాధ ప్రేమించుకున్నారట. ఇద్దరూ కలిసి చెప్పకుండా వెళ్లిపోదామని అనుకుంటుంటే, ఎవరో విని వైస్ ప్రిన్సిపాల్ గారికి చెప్పగా వారిని వాళ్ల ఇళ్లకు పంపించారు.’ చెప్పారు పిల్లలు కాలేజీకి రాగానే ప్రిన్సిపాల్ ఆనంద్కి. ఆనంద్ ఆలోచనలో పడిపోయాడు. ప్రేమలో పడితే పిల్లలు పాడైపోతారేమో. వెంటనే చింటూ గుర్తొచ్చాడు. వాడు ఎలా వున్నాడో. వాడిని వెంటనే చూడాలనిపించింది. సాయంత్రమే వెళ్లి రావాలి అనుకున్నాడు. కానీ ఈ వార్షికోత్సవ ఏర్పాట్లు చెయ్యాలి కదా. ఈ కార్యక్రమం వెంటనే వాణ్ని చూసిరావాలి అనుకున్నాడు.
భగవంతుడా వాడు సంతోషంగా వుండేలా చూడు స్వామి. వాడికి ఏమీ కాకుండా చూడు. వాడి భవిష్యత్తు బాగుండాలి స్వామీ అని మనసులో అనుకుంటుండగా తెలియకుండానే కన్నీళ్లు కారసాగాయి. తనకు తనే తమాయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం తప్పకుండా చింటూ దగ్గరకు తప్పక వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. స్టాఫ్ అందరినీ పిలిచి ‘వచ్చే ఆదివారం మన కాలేజీ వార్షికోత్సవానికి విద్యార్థులంతా వాళ్ల తల్లిదండ్రులను తీసుకుని రమ్మని చెప్పండి. ఆ రాజు, అనూరాధ ఇద్దరిని తప్పక రమ్మని కబురు పెట్టండి’ చెప్పాడు ఆనంద్. ఆ రోజు అతిధిగా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న, తన బాబాయ్ సురేంద్రనాధ్ గారిని పిలిచాడు. మరెవరినైనా లెక్చరర్‌ను కూడా తీసుకువచ్చి విద్యార్థుల్లో ప్రేమ వ్యవహారాలు, వాళ్ల జీవితాల్ని పాడు చేయకుండా వాళ్లను సరైన విధానంలో పెట్టేలా మంచి ప్రసంగం చేయమని కోరాడు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు కానీ విద్యార్థులు ప్రేమలో పడ్డారనే విషయం మనసును మెలిపెడుతోంది. ఎవరైనా ప్రేమ అంటే వెంటనే చింటూ గుర్తు వస్తున్నాడు. చింటూకు ఫోను చేసి మాట్లాడితే బాగుండు అనిపిస్తోంది. కానీ ఫోను చేస్తే వాడు రమ్మని ఏడుస్తాడు. తాను తట్టుకోలేడు. వెళ్లే పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకే ఊరుకున్నాడు. వార్షికోత్సవం అనుకున్న రోజు రానే వచ్చింది. సురేంద్ర వాళ్ల కాలేజీలో పనిచేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ కుమారి మేడంను తీసుకొని వచ్చాడు. कुమారి మేడంను చూసి ఆనంద్ షాక్ తిన్నాడు. ఆమె వస్తుందని అతను ఊహించలేదు. ఆమె ఉత్తమ అధ్యాపకురాలుగా ఎంపికైందని విన్నాడు. ఆమె ఆనంద్‌ను నవ్వుతూ పలకరించింది. ఇద్దరూ ఆప్తమిత్రుల్లా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు. ఆనంద్‌కు చాలా సంతోషమేసింది. ఆశ్చర్యంగా అడిగాడు సురేంద్ర ‘ఏమిటి మీకు ఇంతకుముందే పరిచయం ఉందా’.నవ్వుతూ ‘మేమిద్దరం కాలేజీమేట్స్మి సార్’ చెప్పింది కుమారి.
నవ్వడానికి ప్రయత్నిస్తూ ‘అవును బాబాయ్’ అన్నాడు ఆనంద్. వార్షికోత్సవం మొదలయింది. సురేంద్రనాధ్ను మాట్లాడమని పిలిచారు. “పిల్లలూ మీరంతా చాలా ఆనందంగా జరుపుకుంటున్న మీ వార్షికోత్సవం మీకు శుభాలు కలుగచేయాలని కోరుకుంటున్నాను. మీకు ముఖ్యంగా నేను ఒక కథ చెప్తాను వినండి. ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానో మీరే అర్ధం చేసుకోండి” అని చెప్పటం ప్రారంభించాడు. సూర్య ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఇంటికి వెళ్లగానే అతని భార్య ‘ఏమండీ మీ అన్న కొడుకు ఉత్సాహ్కు యాక్సిడెంట్ అయిందట. మీ అన్నయ్యకు మీ ఫోను కలవటంలేదని నాకు ఫోను చేసి వెంటనే రమ్మని చెప్పాడు. త్వరగా వెళ్లిరండి ఎలా వున్నాడో ఏమిటో పాపం ఉత్సాహ్’ అంది. వెంటనే బయలుదేరి హాస్పిటల్‌కు వెళ్లేసరికి ఉత్సాహ్ మంచంపై పడుకోని ఉన్నాడు.
వాళ్ల నాన్న, అమ్మ వచ్చారు. డాక్టరు దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడారు. ఏమీ పర్వాలేదని కాకపోతే కొన్నచోట్ల గాయాలు తీవ్రంగా వుండటం వలన రెండు రోజులు ఇక్కడ ఉంటే సరిపోతుందని డాక్టరు చెప్పాడు. మధ్యాహ్నం అయ్యాక సూర్య అక్కడే ఉండి ‘అన్నయ్యా నేను వాడికి తోడుగా సాయంత్రందాకా ఉంటాను ఏమీ పర్వాలేదని డాక్టరు గారు చెప్పారు. వదిన బాగా నీరసంగా వుంది. మీరు ఇంటికి వెళ్లండి’ అని అన్నయ్య, వదినకు ధైర్యం చెప్పి పంపించేశాడు. అన్నయ్య వెళ్లాక సూర్య ఉత్సాహ్ దగ్గరకు వెళ్లి అడిగాడు. ‘ఏరా ఉత్సాహ్ నిజం చెప్పు ఏంజరిగింది. నువ్వు బండి నడపడం ఈరోజు కొత్తకాదు. అయినా వెళుతూ వెళుతూ కింద పడ్డావంటే ఏదో కారణం ఉండి ఉండాలి. ఏంటది నిజం చెప్పు’ అన్నాడు. బాబాయ్ ఎవ్వరికి చెప్పనంటే నీకు ఓ విషయం చెప్తాను అన్నాడు చిన్నగా.
‘నా సంగతి నీకు తెలియదటరా చెప్పు. నేను నీ మంచి కోరేవాడిగా అడుగుతున్నాను.’ బాబాయ్ నువ్వంటే నాకు చిన్నప్పటినుండి ఎంతో చనువుంది అంతేకాదు నువ్వంటే ఎంతో ఇష్టం కూడా అందుకే చెప్పాలని వుంది బాబాయ్. ‘నేను కాలేజీ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ ఆమెతో చెప్పడానికి ధైర్యం చెయ్యలేకపోయాను అంతే కాదు ఇంట్లో వాళ్లను ఒప్పించగలనన్న నమ్మకం నాకు లేదు. కానీ ఆమెను మర్చిపోలేకపోయాను. ఈ మధ్యనే ఎలాగో ఆ అమ్మాయి అడ్రసు తెలుసుకున్నాను. ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న గ్రామంలో వుంటుందని తెలుసుకున్నాను. ఈ రోజు కలుద్దామని వెళ్లాను. వెళ్లేసరికి నిన్ననే ఆమెకు వివాహం జరిగిందని తెలిసింది. వెళ్లి ఆమెను కలుసుకుని మాట్లాడి శుభాకాంక్షలు చెప్పి వచ్చాను.’ ‘మంచి పనిచేశావుగదా ఉత్సాహ్’ అన్నాడు సూర్య. ఒక్కసారిగా భోరుమని ఏడుస్తూ ‘వచ్చేటప్పుడు నేను ఆ అమ్మాయిని కోల్పోయానన్న బాధ తట్టుకోలేకపోయాను. వేగంగా నడుపుతూ బాధను తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకుని ఎలా చనిపోవాలా అని ఆలోచిస్తున్నాను. ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న స్పీడ్ బ్రేకర్ దగ్గర సడన్‌గా ఆపడంతో బండి అడ్డంగా తిరిగి పడిపోయాను.
అక్కడ వున్న గులకరాళ్లలో పడటం వల్ల పెద్ద ప్రమాదం జరగలేదు. వెనుకనుండి ఎటువంటి వెహికల్ రాకపోవడం నా దురదృష్టం బాబాయ్ లేకుంటే ఈ బాధ లేకుండా హాయిగా వెళ్లిపోయేవాడిని’ అంటూ విలపించాడు ఉత్సాహ్. “ఉత్సాహ్ ఊరుకోరా. అంత బాధపడకు. నీకు నీ మంచి కోరేవాళ్లం నేను, మీ నాన్న ఉన్నాం. ఇక మీ అమ్మ సంగతి చెప్పక్కరలేదు. నీకేదైనా అయితే మీ అమ్మ అసలు తట్టుకోలేదు. ఆమెను ఓదార్చటం ఆ దేముని తరం కూడా కాదు తెలుసుగా. వాళ్ళు పెద్దవారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్లను దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. నీవే వాళ్లను చూస్తావని, నీకు త్వరగా ఉద్యోగం వచ్చి స్థిరపడాలని, నువ్వు బాగా వుంటే చూడాలని, మీ అమ్మ ఎన్ని పూజలు చేస్తుందో తెలుసుగదా. అటువంటి దేవతల్లాంటి అమ్మ నాన్నలను వదిలి వెళ్లాలనుకోవడం తొందరపాటు నిర్ణయం కదూ” అన్నాడు సూర్య. ‘నిజమే బాబాయ్ ఆ అమ్మాయిని మరిచిపోలేకపోతున్నాను. నేనేమి చెయ్యను చెప్పు’ అన్నాడు ఉత్సాహ్.
‘ఉత్సాహ్ ఒక్క మాట చెప్పు మీ అమ్మా నాన్నలు నిన్ను ప్రేమించినదానికన్నా ఎక్కువగా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా నిజంగా ఆలోచించు’ అడిగాడు సూర్య. తల వంచుకున్నాడు ఉత్సాహ్. “చూశావా ఉత్సాహ్ నువ్వు వెంటనే అవునని చెప్పలేక పోయావు. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం వుందో లేదో కూడా నీకు తెలియదు. అటువంటప్పుడు నువ్వు కోల్పోయావని ఎలా భావిస్తావు?” కళ్లవెంట నీరు కారుస్తూ ‘నిజమే బాబాయ్ కానీ నేను ఎందుకో అలా ఆలోచించలేకపోతున్నాను’. ‘సరే నువ్వు ధైర్యంగా వుండు ఉత్సాహ్ మనం ఇంటికి వెళ్లాక ఆలోచిద్దాం. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు’ అని ధైర్యం చెప్పాడు. ఇంటికి వెళ్లాక మరునాడు ఉత్సాహ్కు కౌన్సిలింగ్ ఇప్పించాలని తన స్నేహితుడైన మరో డాక్టరు వేదవ్యాస్ దగ్గరకు తీసుకువెళ్లాడు. వాళ్లు వెళ్లేసరికి డాక్టర్ మరొక యువకునితో మాట్లాడుతున్నాడు. బయట బల్లపై కూర్చుని వారి సంభాషణ వింటున్నారు ఇద్దరు. ఆ అబ్బాయి పేరు శివ కాబోలు. ‘బాబూ శివ అసలు నువ్వు ఏం చేద్దామనుకున్నావు’ అడిగాడు డాక్టర్.
‘నేను ఆ అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నన్ను కాదంటే చనిపోదామనుకున్నాను. లేక ఆ అమ్మాయి వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చంపేసి నేను చనిపోవాలనుకున్నాను’ చెప్పాడు అమాయకంగా. ‘నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది అసలు అలా ఎందుకు ఆలోచించావు’ అడిగాడు డాక్టరు గారు.’ఈ మధ్య సినిమాల్లో చెప్పిన డైలాగ్ “నాకు దక్కనిది మరెవరికీ దక్కడానికి వీలులేదు” అనేది నాకు బాగా నచ్చింది సార్ అందుకే నాకు అదే గుర్తొస్తోంది’ అన్నాడు శివ. “మరి సినిమాల్లో కష్టపడి చదివి కలెక్టరవడం కూడా కొన్ని సినిమాల్లో చూపుతున్నారు గదా. అది నీకు నచ్చలేదా. కలెక్టరు ఉద్యోగం జిల్లాకు ఒక్కటే వుంటుంది కదా మరి అటువంటి ఉద్యోగం నాకు దక్కకపోతే మరెవ్వరికీ దక్కడానికి వీలులేదు అని బీభత్సంగా చదివేసి దానిని సంపాదించితే మీవారంతా ఎంతో సంతోషిస్తారు గదా. వారేమిటి ఆ అమ్మాయే నీ దగ్గరకు వచ్చి పెళ్లాడతానంటుంది గదా, అలా ఎందుకు ఆలోచించడం లేదు” అడిగాడు డాక్టరు. తల దించుకున్నాడు శివ. ఇంతలో బయటనుండి లోపలికి వెళ్లిన కాంపౌండర్ చెప్పాడు ‘సూర్య గారు వచ్చారు సార్’ అని.
లోపలికి రమ్మని కబురు చేశాడు వేదవ్యాస్ గారు. ఇద్దరూ లోపలికెళ్లారు. ‘ఏంటి సూర్య ఇలా వచ్చారు’ అడిగాడు డాక్టర్ వేదవ్యాస్.’వీడు మా అన్నకొడుకు ఉత్సాహ్. వాడికి సలహా కావలసి వచ్చాం’ చెప్పాడు సూర్య. ‘ఉత్సాహ్ ఏం చేస్తున్నావు’ అడిగాడు డాక్టరు.’నేను డిగ్రీ చేశాను సార్. పీజీ రాస్తున్నాను. పోయిన సంవత్సరం సీటు రాలేదు. మరలా ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను’ చెప్పాడు. వెంటనే తను కల్పించుకుని చెప్పాడు సూర్య ‘వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి పెళ్లయి పోయింది. దానితో వాడు తట్టుకోలేక బాధపడిపోయాడు. బండి నడుపుతూ కిందపడిపోయి దెబ్బలు తగిలాయి మీరు కొంచెం ధైర్యం చెప్తారని తీసుకొచ్చాను’ అని అన్నాడు. “మంచి పని చేశారు సూర్య. ఉత్సాహ్ నీవు ప్రేమించడం మంచిది కాదని, వద్దని నేను చెప్పను. కానీ నువ్వు ప్రేమించడమేకాదు, అది విఫలమైనప్పుడు తట్టుకోగల శక్తిని కూడా పెంచుకోవాలి. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. మన పెద్దలు కీడెంచి మేలెంచమన్నారు గదా” అన్నాడు నవ్వుతూ డాక్టరు.
శివ, ఉత్సాహ్ ఇద్దరూ వినసాగారు ప్రశాంతంగా. “మిమ్మల్ని కని పెంచి, మీరేదో ఉద్ధరిస్తారని, అప్పులు చేసి, ఇల్లు తాకట్టు పెట్టి, కష్టపడి సంపాదించి, వాళ్లు తినకుండా మీకు పెట్టి, మీ గురించి అహర్నిశలు ఆలోచించే వాళ్ల గురించి ఒక్క క్షణం ఆలోచించారా. మీరు ప్రేమించిన వాళ్లను కత్తులతో చంపడం, లేక యాసిడ్ దాడితో చంపడం, తర్వాత మీరు చావడం లేక జైలుకు పోవడం, తర్వాత మీ తల్లి దండ్రులు అవమానం భరించలేక, మిమ్మల్ని చూడకుండా ఉండలేక, అన్నం తినలేక, వారిని చూసే వారు లేక అనేక కష్టాలు పడుతూ రోడ్డెక్కడం, లేక దిక్కులేని వారిలాగా ఆశ్రమాల్లో చేరడం ఇదంతా ఎవరి వల్ల. అదేనా మీ తల్లిదండ్రులకు మీరిచ్చే బహుమానం” అడిగాడు డాక్టరు. చండ్రకోలతో గట్టిగా తన్నినట్లు అనిపించింది ఇద్దరికీ. “మీరు ప్రేమించిన వారు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ప్రేమంటే పగ తీర్చుకోవడం కాదు. త్యాగం చెయ్యడం. మరొకరి కొరకు ఏదైనా త్యాగం చెయ్యడం ప్రేమవుతుంది కానీ, వారిని హత్యచేయడం లేక మీరు ఆత్మహత్య చేసుకోవడం ప్రేమ ఎలా అవుతుంది.
చేతయితే వారికి సాయంచేసి వారిచేత శభాష్ అనిపించుకుంటే అందరూ సంతోషిస్తారు. మీకు తృప్తిగా వుంటుంది అంతే కానీ చంపడం చావడం ఏ సమస్యకు పరిష్కారం కాదు. మీరు సాధించవలసిన లక్ష్యాలను వారికి అంకితం చేసి గట్టిగా ప్రయత్నం చేయండి. వారికన్నా గొప్పగా ఉద్యోగాలను తెచ్చుకుని ఇంకా మంచి జీవితం సాగిస్తున్నామని తెలియచేయండి. అప్పుడు నేను ఇతనినే వివాహం చేసుకుంటే బాగుండేదని వారు బాధ పడాలి, మీ జీవితం ఎలా వుండాలో మీరే నిర్ణయించుకోండి. ప్రాణాలు పణంగా పెట్టడం కాదు మీ లక్ష్యమే ప్రాణంగా భావిం చి గట్టి కృషి చేయండి. తప్పక విజయం సాధిస్తారు” అని ధైర్యం చెప్పి పంపించారు డాక్టరు. ఇంటికి వచ్చాక సూర్య ‘ఉత్సాహ్ నీకు నిజంగా ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటే ఈ సంవత్సరంలో నీవు పీజీ సీటు సాధిస్తావు. నీ ప్రేమను నిరూపించు’ అన్నాడు. ‘అలాగే బాబాయ్ నా శాయశక్తులా ప్రయత్నిస్తాను చూడు’ అంటూ మొదలుపెట్టాడు ఉత్సాహ్. రాత్రింబగళ్లు కష్టపడి చదివాడు. ఇతర విషయాలు అన్నీ మర్చిపోయాడు. తినడం, చదవడం, నిద్రపోవడం అంతే. దీక్షగా చదివాడు. తనకు చేతనైనంత కృషి చేశాడు చివరకు సాధించాడు. పీజీ సీటు మంచి కాలేజీలో వచ్చింది. ‘బాబాయ్ ఇప్పుడు నమ్ముతావా నా ప్రేమ నిజమైందని. ఇప్పుడు నేను పీజీ సీటు సాధించానుగా’ చెప్పాడు ఆనందంగా ఉత్సాహ్.
‘శభాష్ ఉత్సాహ్ శుభాకాంక్షలు’ అన్నాడు సూర్య. అనుకున్నట్లుగానే ఉత్సాహ్ పీజీ పూర్తి చేశాడు. చదువుతున్నన్ని రోజులు బాబాయితో తరచూ మాట్లాడుతూ సలహాలు తీసుకుంటూనే వున్నాడు. “చదువు అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెండు సంవత్సరాలు ప్రైవేటు స్కూలులో పనిచేస్తూ అనుభవం సంపాదించు. అప్పుడు ఒక కాలేజీ నువ్వే ప్రారంభించు. తప్పక విజయం సాధిస్తావు” అన్నాడు. బాబాయి చెప్పినట్లుగానే పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఓ అమ్మాయి పుట్టింది. ఆ పిల్ల పేరు సుగుణ అని పెట్టాడు. తర్వాత బాబాయి చెప్పినట్లు డిగ్రీ కళాశాల ప్రారంభించాడు. దానిలో మొదటి సంవత్సరం యాభై మంది చేరారు. చాలా జాగ్రత్తగా నడిపాడు. పిల్లలు అందరూ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏళ్లలో మంచి ఫలితాలు వస్తున్నాయని చుట్టూపక్కల గ్రామ ప్రాంతాలవారంతా దాదాపు అయిదువందల మంది చేరారు. ‘పేద విద్యార్థులకు, దివ్యాంగులకు ఉచితంగా చదువునందించు. వారికి చేయూత నిచ్చినవాడివవుతావు. నీకు తృప్తిగా వుంటుంది’ బాబాయ్ సలహా ఇచ్చాడు. అలాగే చేశాడు.
‘పిల్లలకు ఆ అమ్మాయి పుట్టినరోజున పుస్తకాలు, బట్టలు బహుమతులుగా ఇవ్వు. అలాగే నీ సంపాదనలో లేని వారికి సహాయం చెయ్యి. పేదవారికి దుప్పట్లు పంపిణీ చెయ్యి. తినుబండారాలు పంచు. నీకు మంచి జరుగుతుంది’ అని బాబాయి చెప్పినదల్లా కాదనకుండా చేశాడు ఉత్సాహ్. ఇప్పుడు సమాజంలో మంచి పేరు వచ్చింది. ఆ కళాశాల దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఆ ఉత్సాహ్ ఎవరో కాదు. మీ ప్రిన్సిపాల్ ఆనంద్. అతని పూర్తిపేరు ఆనందోత్సావ్. అతని కూతురిపేరు సుగుణ. ఆమె పేరుతో మీ సుగుణ కాలేజీ స్థాపించి ఇంత గొప్పవాడయ్యాడు. ఆ సూర్య ఎవరో కాదు నేనే నా పేరు సురేంద్రనాధ్. సూర్య అని పిలుస్తారు చెప్పాడు సురేంద్ర. కథ విన్న పిల్లలు కరతాళధ్వనులతో మార్మోగించారు. “ఇప్పుడు చెప్పండి పిల్లలూ. మీ ఆనంద్ సార్‌ను ఆదర్శంగా తీసుకుని, బాగా చదివి మీ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలో లేక ప్రేమ వ్యవహారాలలో పడి చదువును పాడు చేసుకొని, తల్లిదండ్రులను బాధపెట్టి హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడం మంచిదా మీరే ఆలోచించుకోండి, మీ అందరి భవిష్యత్తును ఉజ్వలమానంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని చెప్పి ముగించాడు సురేంద్ర.
బాబాయి మాటలు విన్న ఆనంద్ ఆనందం పట్టలేక ఉత్తేజితుడై మైకు అందుకున్నాడు. ‘బాబాయి చెప్పిన విషయాలు విన్నారుగా. బాబాయి మాటలతో స్ఫూర్తిని పొందబట్టే నేను ఈ స్థాయికి వచ్చాను. బాబాయ్తోపాటు మరెవ్వరికీ తెలియని ఒక విషయం చెప్తాను. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయిన రోజు నాకు దెబ్బ తగలటం స్పీడ్ బ్రేకర్ వల్ల కాదు. ఆ ఆవేశంలో తెలియకుండా స్పీడ్‌గా నడపడం వల్ల ఎదురుగా వస్తున్న చింటూ అనే ఒక బాలుడిని ఢీ కొట్టాను. వాడికి కాలు విరిగింది. ఎవరూ రాక ముందే అక్కడకు వచ్చిన వాళ్ల తల్లిదండ్రులకు నేను క్షమాపణ చెప్పి వాడి హాస్పిటల్ ఖర్చు మాత్రమే కాదు, వాడి చదువుకు అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను అని ప్రాధేయపడి కేసు లేకుండా చేసుకుని అందరికీ స్పీడ్ బ్రేకర్ దగ్గర పడ్డానని చెప్పాను. వారు చాలా పేదవారు కావడం వల్ల తప్పక ఒప్పుకున్నారు’. ‘ఇప్పటికీ ఆ బాలుడిని చదివిస్తున్నాను. వాడు ఇప్పుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఆరోజు ఆ బాబుకు దెబ్బలు తగిలాయి అని తెలిసి వాళ్ల అమ్మ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయి స్పృహ కోల్పోయింది.
చిన్న పిల్లవాడికి కాలు విరిగిందన్న విషయం తట్టుకోలేక విలవిలలాడిపోయిన ఆ తల్లిని చూసి నాకు కళ్లు తెరుచుకున్నాయి. నేను చనిపోవాలని ఎలా ఆలోచించాను అదే జరిగితే నా అమ్మ నాన్నలు అసలు బతికి వుంటారా. ఎంత తప్పుగా ఆలోచించాను అని నాలో నేనే కుమిలిపోయాను. అంతేగాదు నెలకొక్కసారి చింటూ ఇంటికి వెళ్లి వాడిని పరామర్శించి వాడికి కావలసినవి అన్నీ కొనిపెట్టి వాడి బాగోగులు చూస్తున్నాను. మనం ఆవేశంలో చేసే పనులతో మన తల్లిదండ్రులతో పాటు ఇతరులను కూడా ఎంత ఇబ్బంది గురి చేస్తున్నామో గదా. ఇకపై మీరంతా బుద్ధిగా చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలని కోరుకుంటూ కుమారి మేడం గారిని కూడా మాట్లాడమని కోరుతున్నాను’ అన్నాడు ఆనంద్. కుమారీ మేడం మైకు అందుకుని, ‘పిల్లలూ మీ స్కూలుకు రాకపోయి వుంటే నేను చాలా కోల్పోయేదానిని. మీకు సురేంద్ర సార్ ఎంతో మంచి విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన కథ విని మీరు తప్పకుండా మీ లక్ష్యం కొరకు పోరాటం చేస్తూ ప్రేమలు పగలు ప్రతీకారాల జోలికీ పోకుండా మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారని ఆశిస్తూ చివరిగా ఒక్క మాట చెప్తాను’. ‘బహుశా ఈ విషయం సురేంద్రగారికి కూడా తెలియకపోవచ్చు. నన్ను తన కాలేజీలో సహచరిగా మాత్రమే రమ్మని ఆహ్వానించారు. ఆయన మాట కాదనలేక తప్పక రావలసి వచ్చింది. ఇప్పుడు నేను వచ్చి చాలా మంచి పని చేశాననిపిస్తోంది.
ఎందుకంటే ఆయన చెప్పిన కథ విని నేను కూడా ఎంతో ఆలోచనలోకి వెళ్లి నా గతం గుర్తుతెచ్చుకున్నాను. అప్పుడర్థమైంది. మీ ఆనంద్ సార్ ప్రేమించినది నన్నేనని. నా పేరు సుగుణ కుమారి. మీ కాలేజీకి పెట్టింది కూడా నా పేరే’. మరోసారి చప్పట్లు మార్మోగాయి.. ‘వివాహం తర్వాత నేను ఎమ్మెస్సీ చదివి లెక్చరర్‌గా ఉద్యోగం తెచ్చుకున్నాను. అప్పటినుండి నన్ను కుమారి మేడం అని పిలుస్తున్నారు. నిజంగా ఆనంద్ గారు నా వివాహం అయిన మరునాడు వచ్చి నన్ను కలిసి నాకు శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు. తరువాత ఆయనకు యాక్సిడెంట్ అయిందని పేపర్లో చూసి నేను కూడా చాలా బాధపడ్డాను. కానీ నా వల్ల జరిగిందనే విషయం నాకు ఈరోజే తెలిసింది’. ‘నేను మీ అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మీ లక్ష్యం సాధించేవరకు మీరు పక్కదారి పట్టమని మీకు మీరే ప్రమాణం చేసుకోండి. మీరెవరినైనా ఇష్టపడితే మీ సార్లా లాగే చేసే మంచి పనులలో ఆ ఇష్టాన్ని చూపించండి. అంతేకాదు నేను ఇకపై మీ కాలేజీకి నా పూర్తి సహకారం అందిస్తాను. ఆనంద్ ఇకనుండి మనం మంచి మిత్రుల్లాగే జీవితాంతం కలిసి పయనిద్దాం. మీరు చేసే సమాజ హిత కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయండి’ అంటూ నమస్కరించి ముగించింది సుగుణ కుమారి. కరతాళ ధ్వనులతో తమ లక్ష్యం ఛేదించే వరకు పక్కదారి పట్టమని తమ ఆమోదాన్ని తెలిపారు భావి భారత పౌరులు.


