google-site-verification: googlee1f767d3d556c059.html
empty frame

సైకిల్ అంటే పేదరికం కాదు.. ఒకప్పుడు అది ‘లగ్జరీ’

Spread the love

సైకిల్ అంటే పేదరికం కాదు.. ఒకప్పుడు అది ‘లగ్జరీ’

ఒకప్పుడు సైకిల్ ఉండటం అంటేనే రాయల్టీ

మనలో ఎవరి జీవిత ప్రస్థానాన్ని చూసినా అది సైకిల్ చక్రాల మీద నుంచే మొదలవుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మనం ఎదిగే కొద్దీ మొదట వదిలేసేది కూడా అదే సైకిల్‌ నే! ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అని చెప్పడానికి మనం వాడే కొలమానం ఏంటో తెలుసా? “ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే వాడు, ఇప్పుడు లగ్జరీ కారులో తిరుగుతున్నాడు” అని. అంటే, సైకిల్ నుంచి కారుకి మారడం మన దృష్టిలో ఆర్థిక ఎదుగుదల కావొచ్చు.. కానీ ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం అది ఖచ్చితంగా వెనకడుగు వేయడమే!

chatgpt image may 11, 2026, 09 46 19 am

అదొక రాయల్టీ!

ఒకప్పుడు సైకిల్ ఉంటే ఆ వ్యక్తి సంపన్నుడి కింద లెక్క. నాన్న సైకిల్ తెచ్చిన రోజున ఇంటి దగ్గర సందడి మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు కార్లకి యాక్సెసరీస్ అమర్చుకున్నట్టు, అప్పట్లో సైకిల్ హ్యాండిల్ కి పువ్వుల కవర్లు, వెనుక చక్రానికి రంగు రంగుల వైర్లు, ముందుకు పెద్ద లైటు.. అబ్బో! ఆ అలంకరణలే వేరు. పాలిష్ కొడితే ఆ ఐరన్ గుర్రం మెరిసిపోయేది. ఆ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే వచ్చే రాజసం, ఇప్పుడు కోట్లు పెట్టి కొనే కార్లలో కూడా దొరకదు. అప్పట్లో సైకిల్ తొక్కడం అనేది కేవలం ప్రయాణం కాదు, ఒక భావోద్వేగం.

పేదరికానికి చిహ్నమా? ఎంతమాట??

మనం ఎప్పుడు తప్పులో కాలేసామంటే.. సైకిల్ అంటే పేదవాడి వాహనం అని ముద్ర వేసినప్పుడు. నిజానికి సైకిల్ పేదరికానికి చిహ్నం కాదు, అది సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతిరూపం. మనం ఎంతగా ఎదిగి పోయామంటే.. ఆఫీసుకి కారులో వెళ్లి, అక్కడ కదలకుండా ఏసీ గదుల్లో కూర్చుని, మళ్ళీ ఆ కొవ్వును కరిగించుకోవడానికి వేలకు వేలు తగలేసి జిమ్‌లకు వెళ్తున్నాం. అక్కడ మళ్ళీ ఏ ‘స్టేషనరీ సైకిల్’ మీదో కూర్చుని చెమటలు కక్కుతున్నాం. మన రోడ్ల మీద తొక్కాల్సిన సైకిల్‌ని, జిమ్ గదుల్లోకి పరిమితం చేసేశాం.

ఆరోగ్యాన్ని తొక్కేస్తున్నామా?

సైకిల్ తొక్కినప్పుడు వచ్చే ఆ గాలి, ఆ వ్యాయామం, ఆ చురుకుదనం మనిషిని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచేవి. ఇప్పుడు గమ్యాన్ని వేగంగా చేరుకుంటున్నాం కానీ, ఆ ప్రయాణంలో ఆరోగ్యాన్ని ఎక్కడో వదిలేస్తున్నాం. సైకిల్ వదిలేశాక మనకు బీపీలు, షుగర్లు తోడయ్యాయి. చక్రం తిరిగినంత సేపూ కాళ్లు కదిలేవి.. ఇప్పుడు కారు స్టీరింగ్ తిరుగుతోంది కానీ, మన కడుపు ముందుకు పెరుగుతోంది!

జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నామంటే.. అది కేవలం ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టడానికి కాదు. మన మూలాలను మరోసారి గుర్తు చేసుకోవడానికి. సైకిల్ తొక్కడం అనేది స్టేటస్ సింబల్ కాదు అని అనుకున్న రోజున, మన గుండెలు మళ్ళీ పదిలంగా ఉంటాయి. వీలైతే ఈ వారంలో ఒక్క రోజైనా మీ పాత సైకిల్ తీసి గాలి కొట్టించి చూడండి.. ఆ తొక్కేటప్పుడు వచ్చే కిక్కు, ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ మిమ్మల్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్తాయి.

chatgpt image may 11, 2026, 09 49 05 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *