bride ఒక్క చెంపదెబ్బతో పెళ్లికి ముగింపు
bride పెళ్లి మండపంలో వరుడికి చెంపదెబ్బ
bride అవును… మీరు చదివింది నిజమే. పెళ్లిపందిట్లో వరుడి రాకను సిగ్గుల మొగ్గై తిలకించాల్సిన వధువు… అగ్గిమీద గుగ్గిలమై, అపర కాళిక అవతారమై… అందరి ముందూ కాబోయే భర్త చెంపను ఛెళ్లుమనిపించింది. అసలు ఏం జరిగిందో తెలుసా?
కొన్ని జీవితాలు… ఒక్క నిర్ణయంతో మారిపోతాయి. మరికొన్ని… నిర్మొహమాటంగా వెలిబుచ్చే ఒక్క తిరస్కరణతో యూ టర్న్ తీసుకుంటాయి. చాలా మంది యువతులు పెళ్లి మండపం వరకు వచ్చాక… తమ మనసుకు నచ్చని నిజాలు తెలిసినా, కుటుంబ పరువు కోసం మౌనంగా తాళి కట్టించుకుంటారు. తర్వాత జీవితాంతం ఆ రాజీని మోస్తుంటారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతి మాత్రం… అలా రాజీపడలేదు.
వివరాల్లోకి వెళితే…
ఆ రాత్రి పెళ్లి ఇంట్లో సందడి మామూలుగా లేదు. బంధువుల నవ్వుల పువ్వులు వెల్లువలై వెల్లి విరుస్తున్నాయి… మంగళ వాయిద్యాల శబ్దం… బయట వరుడి ఊరేగింపు… అన్నీ ఒక వేడుకలా సాగుతున్నాయి. కానీ, ఆ సందడిలోనే ఒక వార్త మెరుపులా వధువు చెవిలో పడింది.
“వరుడు బాగా తాగి వచ్చాడు…”
ఆ ఒక్క మాట ఆమె గుండెల్లో గూడుకట్టుకున్న పాత గాయాన్ని మళ్లీ రేపింది.
మద్యం అంటే ఆమె దృష్టిలో ఒక అలవాటు కాదు… ఒక మహమ్మారి… ఒక విషాదం. చిన్నతనంలోనే తండ్రిని మద్యం వ్యసనం కారణంగా కోల్పోయిన ఆమెకు, మత్తులో తూలుతున్న వ్యక్తితో జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచనే భరించలేనిదిగా అనిపించింది.
అంతే…
గదిలో కూర్చుని బాధపడలేదు… తన తలరాత ఇంతేనని ఏడవలేదు.
కాబోయే భర్తను సరిదిద్దమని, మంచి చెప్పమని పెద్దలను వేడుకోలేదు.
“పెళ్లి అయిపోయాక చూసుకుందాం… అతన్ని నెమ్మదిగా మార్చుకుందాం” అనుకోలేదు.
నేరుగా బయటకు నడిచింది.
మత్తులో నిలబడలేకపోతున్న వరుడి ఎదుట నిలబడింది… తీక్షణంగా అతడిని చూసింది… అందరూ చూస్తుండగానే అతడి చెంపపై ఒక్క చెయ్యి వేసింది.
ఆ చెంపదెబ్బ కోపంతో కొట్టింది కాదు…
తన భవిష్యత్తును కాపాడుకోవడానికి, అతడి అలవాటుపై తన అయిష్టతను, నిరసనను వ్యక్తం చేసేందుకు కొట్టింది.
“ఇలాంటి వ్యక్తితో నేను జీవించలేను” అని ఒక్క మాటతో పెళ్లి తంతుకి ముగింపు పలికింది.
ఆమె నిర్ణయం విన్న తర్వాత అక్కడ గందరగోళం నెలకొంది. కాబోయే వియ్యంకుల మధ్య, రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వధువును తీసుకుని బాజా భజంత్రీలతో వరుడి ఇంటివైపు వెళ్లాల్సిన పెళ్లి ఊరేగింపు, ఒంటరి వరుడితోనే వెనుదిరిగింది.
కానీ… ఆ యువతి మాత్రం తన నిర్ణయం నుంచి ఒక్క అడుగు కూడా వెనుదిరగలేదు.
ఆమె ధైర్యాన్ని, తన నిర్ణయాన్ని, నిరసనను నిస్సంకోచంగా వెలిబుచ్చినందుకు అధికారులు కూడా అభినందించారు. జిల్లా పోలీసు అధికారి ప్రత్యేకంగా సత్కరించడమే కాకుండా, యువతకు అవగాహన కల్పించే బాధ్యతతో ఆ అమ్మాయికి కౌన్సెలర్‌గా అవకాశం కల్పించారు. జిల్లా యంత్రాంగం ఆమె చదువును తిరిగి కొనసాగించేందుకు ముందుకొచ్చింది. కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.
ఈ సంఘటనలో అసలు గెలిచింది ఎవరు?
పెళ్లి ఆగిపోయింది. ముహూర్తం దాటిపోయింది. కానీ… ఒక జీవితమే ఎదురు తిరిగి నిలబడింది.
ఎందుకంటే…
పెళ్లి అనేది ఒకరోజు జరిగే వేడుక మాత్రమే.
కానీ, జీవితం మాత్రం ప్రతిరోజూ అనుభవించాల్సిందే.
ఆ ఒక్క చెంపదెబ్బ… ఒక వ్యక్తిని అవమానించడానికి కాదు.
మద్యం ముందు తలవంచని ఒక మహిళ ఆత్మగౌరవానికి ప్రతిధ్వని.
కొన్నిసార్లు…
“తాళి” కంటే “తెగింపు” గొప్పది.
ఆ రోజు పెళ్లి మండపంలో మోగింది మంగళవాయిద్యం కాదు…
ఒక యువతి ధైర్యానికి సమాజం కొట్టిన చప్పట్లు.

click here to read అర్ధరాత్రి ఆకాశం వైపు చూసి కుక్కలు ఎందుకు మొరుగుతాయి?



