gated community life | మొక్కలు మనవి..పూలు అందరివీ…
gated community life | కమ్యూనిటీలో చిన్న అలవాట్లు – పెద్ద ఇబ్బందులు
పూలు, పెంపుడు జంతువులు, పబ్లిక్ స్పేస్ సమస్యలు
హలో అండి! అందరికీ నమస్తే! బాగున్నారా ? చాలా రోజుల తర్వాత మళ్లీ మీ ముందుకు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. మాధవ్ గారు పట్టుబట్టి నా చేత రాయిస్తున్న శీర్షిక ఇది “ఆదివారం నాది”..
మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ శీర్షికలో నా గడచిన జీవిత కాల అనుభవాలు.. మరపురాని సంఘటనలు, విచారాలు, సంతోషాలు, ఇలా అన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా ఈ అనుభవాలు కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు. బట్ ఇంకా ఈ వ్యాసాల ద్వారా కొందరికి గుణపాఠం కావచ్చు. కొందరికి ఆలంబన కావచ్చు, మరి కొందరికి చక్కని ఉదాహరణ కావచ్చు.
మీ ముందుకు వచ్చి ఇలా నా అభిప్రాయాలను పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన “ట్రెండీదునియా.కాం” వెబ్ సైట్ యాజమాన్యానికి, ముఖ్యంగా మాధవ్ గారికి నా కృతజ్ఞతలు. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయి, చదువుల కోసం అమెరికా వెళ్ళిపోయారు.
నేను, మా వారే హైదరాబాద్లో ఉండేది. ఇద్దరం సీనియర్ సిటిజన్స్ అయిపోయాము కాబట్టి ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకుంటే సెక్యూర్డ్ గా ఉంటుందని, ఒకరికొకరు తోడు ఉంటారని మా పిల్లలు, మా వారు ఆలోచించి బోయినపల్లిలో ఒక విల్లా తీసుకున్నాము.
నిజానికి అంత పెద్ద విల్లా ఈ వయసులో మెయింటైన్ చేయడం కష్టమని నేను చెప్తున్నా, మా వారు పట్టుబట్టి 5 బెడ్ రూమ్ లు ఉన్న విల్లా కొన్నారు. నాకున్న మోకాళ్ళ నొప్పులకి ఇంత ఇల్లు నేను మెయింటెన్ చేయలేనన్నా వినలేదు. కాళ్ల నొప్పులు అన్నానని లిఫ్ట్ పెట్టించారు. తను షాపుకు వెళ్ళిపోతే తోచదు అన్నానని, హోం థియేటర్ పెట్టించారు. అలా ఏడేళ్ల క్రితం విల్లాలో దిగాం. ఈ కమ్యూనిటీ అంతా బానే ఉంటుంది కానీ, కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయండి. అవి మీకు తెలియాలి.
ఇంటి ముందు చిన్న గార్డెన్ ఉండాలని చిన్న చిన్న పూల మొక్కలు వేసుకుని ఉదయాన్నే దేవునికి నా చేతులతో పూలు కోసి పూజ చేసుకోవాలని నా కోరిక. దానికి తగ్గట్టుగానే ఉన్న చిన్న ప్లేస్ లో కనకాంబరం, మందారం, నందివర్ధనం, గులాబి, బ్రహ్మ కమలం, గన్నేరు, ఇలా పూజకు పనికొచ్చేవన్నీ వేసుకున్నాము. కొద్ది రోజులు బానే ఉంది. తర్వాత మొదలైంది-ఉదయాన్నే నాలుగున్నరకే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు పట్టుకొని వాకింగ్ కి వచ్చే ఆడ-మగ వాళ్ళు ప్రేమగా “హాయ్” అని పలకరిస్తారు. అంతవరకు బానే ఉంది.
కానీ, ప్రేమగా పెంచుకున్న పూల మొక్కల మీద పడ్డాయి వారి కళ్ళు. పూలు కోసేయడం, మొగ్గలు తుంచేయడం, ఎన్నిసార్లు కమ్యూనిటీ గ్రూపులో మెసేజ్ లు పెట్టినా నో యూస్ అండి.. పూలు తెంపేస్తూనే ఉన్నారు. మనం ముచ్చట పడి, కష్టపడి, నర్సరీ నుండి తెచ్చుకొని, ఎరువులు వేసి, ప్రతిరోజు నీళ్లు పోసి నెలకోసారి మాలిని పిలిచి క్లీన్ చేయించి అందంగా తీర్చిదిద్దుతుంటే మన కమ్యూనిటీ వాళ్లే ఇలా ఉదయాన్నే కోసుకు పోతుంటే ప్రాణం గిలగిలలాడదూ మరి? ఒళ్ళు మండదూ మరి? ఈ పూల గోలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. క్లుప్తంగా చెబుతాను..కొందరు కుక్కల్ని పెంచుకుంటున్నారు.. ఓకే, అది వారి సరదా. వారి ఇష్టం. అంతవరకు ఓకే. కానీ, దాన్ని వదిలేస్తే అది చేసే హంగామా అంతా ఇంతా కాదు. మన గార్డెన్ లోకి వచ్చి గలీజు చేస్తుంది. పిల్లలు ఆడుకునే గార్డెన్ లోకి వెళ్లి గలీజ్ చేస్తుంది. వాటిని ఫోటోలు తీసి గ్రూపులో పెట్టినా ఫైటింగ్ తప్ప నో యూస్.
ఇకపోతే జిమ్ వాడతారు. ఎక్కడివక్కడ పెట్టేస్తారు. ఏసి వేసి వదిలేసి వస్తారు. అదొక పెద్ద కంప్లైంట్. ఇక స్విమ్మింగ్ పూల్ సంగతి చెప్పనక్కర్లేదు. పాపం కాలనీ ప్రెసిడెంట్ ఎన్ని సార్లు క్లీన్ చేయించినా మళ్లీ వెళ్లి డర్టీ చేస్తారు. అక్కడే స్నాక్స్ తినడం, కూల్ డ్రింక్స్ బాటిల్స్ వదిలేయడం. ఇలాంటివి ఒక కమ్యూనిటీ గ్రూపులో ఉదయాన్నే మైండ్ దొబ్బే మెసేజ్ లు.. అవి చదివితే పొద్దున్నే బీపీ వస్తుంది. ‘ నో వాటర్ వాట్ హప్పెండ్? ‘ ‘ నో కరెంట్ వై ‘ ఇలా వాళ్ల ప్రాబ్లమ్స్ అన్ని కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ లా ఫీల్ అయ్యి మెసేజ్ లు పెట్టేస్తారు. బీపీ షుగర్ లేని వాళ్ళకి తప్పనిసరిగా ఈ మెసేజ్ చదివితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి.
అలా అని గేటెడ్ కమ్యూనిటీలో లాభాలు లేవా అంటే అవి కూడా ఉన్నాయి. ఏవైనా పూజలు, ఫంక్షన్స్ జరిగితే అందరం సరదాగా గడపడం, లలిత పారాయణాలు చేసుకోవడం లాంటివి చక్కగా జరుగుతాయి. నాకు మొన్న కంటి ఆపరేషన్ జరిగినప్పుడు పది రోజులు నేను వంట చేసుకోక పోయినా, ఏదో ఒక విల్లా వారు పంపించేవారు. సో, లాభాలు కూడా ఉన్నా, నష్టాలు మాత్రం కొన్ని తప్పవు. నలుగురితో నారాయణ అంటూ ఉండడమే.



