ఫేక్ యాప్‌లతో భారీ మోసాలు… డౌన్‌లోడ్ చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అసలు యాప్‌లా కనిపించే నకిలీ యాప్‌లు
డబ్బులు పంపాలన్నా… బిల్లులు చెల్లించాలన్నా… ఆన్‌లైన్ షాపింగ్ చేయాలన్నా… బ్యాంక్ ఖాతా చూడాలన్నా… ఈరోజుల్లో అన్నీ యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు “ఫేక్ యాప్‌లు” పేరుతో కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. కానీ కంగారు కలిగించే విషయమేమిటంటే, బయటికి చూస్తే అవి అసలు యాప్‌లాగే కనిపిస్తాయి. కానీ ఒకసారి ఫోన్‌లో వాటిని ఇన్‌స్టాల్ చేస్తే… మన వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఫోటోలు, సందేశాలు అన్నీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని ఫేక్ యాప్‌లు ప్రముఖ బ్యాంకులు, చెల్లింపుల యాప్‌లు, సోషల్ మీడియా యాప్‌ల మాదిరిగానే రూపుదిద్దుకుంటాయి. పేరులో చిన్న మార్పులు చేసి వినియోగదారులను అయోమయానికి గురిచేసి, మభ్యపెడతాయి. ఉదాహరణకు అసలు యాప్ పేరు ఎలా ఉంటుందో దానికి దగ్గరగా మరో పేరు పెట్టి మోసం చేస్తుంటారు. తొందరలో చూసే చాలా మంది అసలు-నకిలీ తేడా గుర్తించ లేక పోతున్నారు.
సైబర్ భద్రత నిపుణుల ప్రకారం యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి. యాప్‌ను రూపొందించిన సంస్థ పేరు, యాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్య, వినియోగదారుల సమీక్షలు జాగ్రత్తగా చూడాలి. అసలు యాప్‌లకు సాధారణంగా లక్షల నుంచి కోట్లలో డౌన్‌లోడ్‌లు ఉంటాయి. కానీ ఫేక్ యాప్‌లకు చాలా తక్కువ డౌన్‌లోడ్‌లు, అనుమానాస్పద సమీక్షలు కనిపిస్తాయి.
మరో ముఖ్యమైన విషయం… యాప్ అడిగే అనుమతులు. ఒక సాధారణ యాప్ అవసరం లేకపోయినా ఫోన్‌లోని సందేశాలు, పరిచయాలు, కెమెరా, మైక్రోఫోన్, ఫోటో గ్యాలరీకి అనుమతులు అడిగితే మాత్రం మనం వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మన నుంచి తీసుకునే ఇలాంటి అనుమతుల ద్వారానే మన వ్యక్తిగత సమాచారం ఆ యాప్ లవాళ్ళు దొంగిలించే ప్రమాదం ఉంటుంది.
ప్రత్యేకంగా సందేశాలు, వాట్సాప్, టెలిగ్రామ్ లింకుల ద్వారా వచ్చే యాప్‌ల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. “కేవైసీ అప్‌డేట్ చేయండి”, “బహుమతి గెలుచుకున్నారు”, “మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది” వంటి సందేశాలతో వచ్చే లింకులు ప్రమాదకరమని నిపుణులు పదేపదే చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా అడ్వర్టైజ్ మెంట్ల రూపంలో ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. అధికారిక యాప్ స్టోర్లైన గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచే యాప్‌లు మాత్రమే డౌన్‌లోడ్ చేయడం సురక్షితమని సూచిస్తున్నారు.
మనం ముందు అనుకున్నట్టుగా ఫేక్ యాప్‌లు ఫోన్‌లోకి చేరితే బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు మాయమవడం, వ్యక్తిగత సమాచారం లీక్ కావడం, ఓటీపీలు దొంగిలించబడటం, సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడం వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో మనం ఫోన్ పై పూర్తిగా నియంత్రణ కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించడం చాలా అవసరం. ఒక్కొక్కసారి ఒకేఒక్క చిన్న నిర్లక్ష్యం… అతి పెద్ద నష్టానికి దారితీయొచ్చు. డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తతే అసలైన రక్షణ అని నిపుణులు చెబుతున్నారు.




