google-site-verification: googlee1f767d3d556c059.html
mama1

మమతకేమైంది..?

Spread the love

మమతకేమైంది..?

తృణమూల్‌లో తిరుగుబాటు.. బెంగాల్ రాజకీయాల్లో కొత్త తుఫాన్

మమత బెనర్జీ….పశ్చిమ బెంగాల్ లో ఒక ఫైర్ బ్రాండ్…ఆమె మాట ఒక సిం హ గర్జన…ఆమె చూపు ఓ నిప్పు కణిక…కంటి చూపుతో ప్రత్యర్థులను వణికించిన మమత బెనర్జీ ఉద్యమంలోంచి ఉవ్వెత్తున ఎగసిన ఓ కెరటం… ప్రధాని మోడీని సైతం పదునైన విమర్శలతో ఎదుర్కొన్న ఓ ఆడపులి. కానీ, అదంతా గతం…చాపకింద నీరులా విస్తరించిన ప్రజా వ్యతిరేకత…దాని ఫలితంగా ఎన్నికల్లో ఘోర పరాజయం….

అక్కణ్ణుంచి మొదలైన వ్యతిరేక పవనాలు…పార్టీలో తీవ్ర ధిక్కార ధోరణులు..అంతర్గత విబేధాలు..చీలిక దిశగా తృణమూల్…అన్నీ కలిసి ఆమెను ఒంటరిని చేస్తున్నాయా? నిజంగానే మమత హవా ముగిసిందా? లేక దీని వెనుక ఎవరైనా ఉండి ఇదంతా చేస్తున్నారా? ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని తిరిగి మమత కోలుకోగలదా? అధికారం మాట అటుంచితే కనీసం ప్రతిపక్ష హోదాలోనైనా బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టగలదా?

కానీ… మమతను ఇప్పుడు వెంటాడుతున్నది ఎన్నికల ఓటమి మాత్రమే కాదు. అధికారం పోయింది… ముఖ్యమంత్రి కుర్చీ దూరమైంది… తనకు రాజకీయంగా అండగా నిలిచిన భవానీపూర్ కూడా చేజారిపోయింది. ఒకప్పుడు తన కనుసన్నల్లో నడిచిన బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు ఆమె చేతుల్లోంచి జారిపోతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే అసలు తుఫాన్ ఇప్పుడు మొదలైంది. బయట శత్రువులతో పోరాడటం ఒక ఎత్తయితే… సొంత పార్టీలోనే తిరుగుబాటు జెండా ఎగరడం మరో ఎత్తు. తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారింది. ఒకరిద్దరు కాదు… దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధికారిక నాయకత్వానికే సవాల్ విసిరిన పరిస్థితి. ఒకప్పుడు మమత మాటే శాసనం. కానీ ఇప్పుడు అదే పార్టీలో ఆమె నిర్ణయాలను ధిక్కరిస్తున్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఇక్కడే రాజకీయ కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఓటమి తర్వాత ప్రతిపక్షంగా బలపడాల్సిన తృణమూల్… ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితికి చేరుకుంది. తిరుగుబాటు వర్గం ఏకంగా తమకే అసలైన తృణమూల్ అనే వాదనతో ముందుకు రావడం, అసెంబ్లీలో కొత్త ప్రతిపక్ష నాయకుడికి గుర్తింపు లభించడం మమతకు ఊహించని దెబ్బగా మారింది.

అందుకే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న…

మమత బెనర్జీ ఓడిపోయిందా…?
లేక మమత చుట్టూ ఉన్న వ్యవస్థే కూలిపోతోందా…?

15 సంవత్సరాల పాటు బెంగాల్‌ను ఏలిన నాయకురాలు… లక్షలాది మంది కార్యకర్తలకు ప్రేరణగా నిలిచిన నేత… ఇప్పుడు తన సొంత పార్టీని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చింది?

ఇది కేవలం ఓ రాజకీయ పరాజయమా?
లేక ప్రజల తీర్పు తర్వాత మొదలైన అంతర్గత శుద్ధీకరణ ప్రక్రియనా?

మరోవైపు మమత అనుచరులు మాత్రం ఇదంతా సహజ పరిణామం కాదని అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పక్కా ప్రణాళికతో పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం అధికారం పోయిన తర్వాత బయటపడుతున్న అసలు అసంతృప్తి ఇదేనని వాదిస్తున్నారు.

ఏది నిజమో కాలమే తేల్చాలి.

కానీ ఒక విషయం మాత్రం స్పష్టం…

ఇప్పటి వరకు మమత పోరాడింది ప్రత్యర్థులతో.
ఇప్పుడు ఆమె పోరాడాల్సింది తన సొంత నీడలతో.

ఇప్పటి వరకు ప్రశ్న “బీజేపీని ఎలా ఓడించాలి?” అనేది.
ఇప్పుడు ప్రశ్న “తృణమూల్‌ను ఎలా కాపాడుకోవాలి?” అనేదిగా మారింది.

అందుకే బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న ఈ అధ్యాయం సాధారణ రాజకీయ సంక్షోభం కాదు… ఇది మమత బెనర్జీ రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్ష.

mama

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *