Personality Development Tips | ఉన్నత వ్యక్తిత్వానికి పది పాఠాలు!
రచయిత కె.వి సుమలత
Personality Development Tips | అడుగడుగున గుడి ఉంది… అందరిలో గుడి ఉంది
ప్రతి మనిషీ నడిచే దైవం…ప్రతి పులుగూ ఎగిరే దైవం
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలో అర్థం, పరమార్థం రెండూ అమోఘమే! సమస్త చరాచరాలలో గుడి ఉంటుంది. అందులో దేవుడు కూడా ఉంటాడు. లయకారుడైన దేవుడు మనకెన్నో బోధిస్తాడు. నేర్చుకునే మనసుండాలే కానీ నడిచే ప్రతి మనిషీ, ఎగిరే ప్రతి గువ్వ కూడా మంచి చెడులు నేర్పే గురువులవుతారు. మనకు పరిచయమైన ప్రతీ ఒక్కరు ఏదో ఒకటి మనకు నేర్పుతారు. వారి వల్ల మనకు మంచి జరిగితే సహాయ గుణం అలవడుతుంది. అదే చెడు జరిగితే ఎవరినీ బాధపెట్టకూడదనే ధర్మం అవగతమవుతుంది.
మనకు ప్రథమ గురువు అమ్మ, ఎలా నడవాలో, ఎలా తినాలో, ఎలా మాట్లాడాలో అన్నీ ఆమె దగ్గర నుండే నేర్చుకుంటాం. రెండవ గురువు తండ్రి, సమాజంలో ఎలా మెలగాలో, బాధ్యతల బరువులు ఎలా మోయాలో ఆయన నుండే తెలుసుకుంటాం. శాస్త్రీయ ఙ్ఞానాన్ని బోధించే గురువు మూడవ స్థానంలో నిలుస్తాడు.
అశాస్త్రీయoగా మనకు పాఠాలు బోధించే ప్రకృతి అగ్రస్థానంలో ఉత్తమ గురువుగా నిశ్శబ్దంగా, శక్తివంతంగా ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతుంది.
Personality Development Tips | సూర్యుడు జగతికి ప్రకాశవంతమైన కాంతిని, చెట్లు నీడను, ఆహారాన్ని, జీవించేందుకు ప్రాణవాయువును ఇస్తాయి. నదులు తాగడానికి, అవసరాలకు కావలసిన నీరు ఇస్తాయి. ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయాలనేది మొదటి పాఠం!
ఒక విత్తనం మొలకెత్తి చెట్టుగా మారాలంటే నిర్దిష్టమైన సమయం పడుతుంది. మొగ్గ రావడం, పూలు వికసించడం, వాడిపోవడం అన్నీ ఒక క్రమంలో జరుగుతాయి. తొందరపడితే ఏదీ జరగదు. జీవితంలో విజయాలు, మార్పుల కోసం ఆదుర్దా పడకుండా ఓపిక పడితే వాటి సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయనేది రెండవ పాఠం!
Personality Development Tips | కాలక్రమంలో ఋతువులు మారతాయి. ఆకులు రాలిపోయి మోడుగా మారి మళ్ళీ చిగుర్లు తొడుగుతాయి. ఏవీ అలాగే ఉండిపోవు… ఏదీ అక్కడితో ఆగిపోదు. జీవితంలో సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు కూడా తాత్కాలికమే. శాశ్వతంగా ఉండిపోవు. దీన్ని అర్థం చేసుకుని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మూడవ పాఠం!
సూర్యోదయం – సూర్యాస్తమయo, శరీరం- మనసు, పని- విశ్రాంతి, ఇచ్ఛ-నిరాశల మధ్య ఉండే సమతుల్యత, అసమతుల్యతల తారతమ్యం అవగాహన చేసుకుంటే సమస్యల తీవ్రత తగ్గుతుందనేది నాలుగవ పాఠం!
Personality Development Tips | ప్రకృతి సహజంగా ఉంటుంది, అదనపు అలంకరణలు ఉండవు. మనం కూడా అనవసరమైన కోరికలు, సంపాదనలు, పోటీలు వదిలి సరళంగా జీవించాలి. తక్కువలోనే ఎక్కువ సంతోషాన్ని వెతుక్కోవడమే ఐదవ పాఠం!
తేనెటీగలు, చీమలు, అడవి ప్రాణులు వాక్కు లేకపోయినా ఒకదానికొకటి పరస్పర సహకరoతో పని చేసుకుంటాయి. మనం ఒంటరిగా కాకుండా సమాజంతో, కుటుంబంతో, ప్రకృతితో మమేకమై జీవించడం ఆరవ పాఠం!
అగ్ని ప్రళయం తర్వాత కూడా అడవి మళ్లీ పచ్చగా మారుతుంది. పెను తుఫానుతో వంగిన చెట్లు లేచి నిలబడతాయి. జీవితంలో వైఫల్యాలు, నష్టాలు ఎన్ని వచ్చినా పునఃప్రయత్నం చేయడమే ఏడవ పాఠం!
ప్రకృతి అందరినీ సమాన దృష్టితో చూస్తుంది. ఎవరినీ ద్వేషించదు, ఎవరికీ హాని తలపెట్టదు. మనం కూడా తోటి వారిని ప్రేమించాలి. శత్రుత్వం పెంచుకుని, ఎవరికీ హాని తలపెట్టకూడదు. మనం ఎదుటి వారిలో నాటిందే ఫలితంగా తిరిగి వస్తుందనేది ఎనిమిదవ పాఠం!
Personality Development Tips |ప్రకృతి గతం గుర్తుచేసుకోదు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందదు. వర్తమానంలోనే సాగిపోతుంది. మనం కూడా ఆందోళనలు, పశ్చాత్తాపాలు వదిలి ముందడుగు వేయడమే తొమ్మిదవ పాఠం!
గడ్డి పరక చిన్నదే కావచ్చు, ఆత్మన్యూనతాభావం లేకుండా ఆత్మవిశ్వాసంతో సగర్వంగా నిలబడుతుంది! ఎప్పుడూ మనల్ని మనం తక్కువ చేసుకోకుండా ఆత్మస్థైర్యం అలవరచుకోవడం పదవ పాఠం!
ఈ పది పాఠాలు అభ్యసిస్తే మన వ్యక్తిత్వం ఇనుమడిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు!!


