google-site-verification: googlee1f767d3d556c059.html
pet4thfloor

pet4thfloor అపార్ట్‌మెంట్‌లో కుక్కని పెంచుకుంటే అరిష్టమా? అసలు నిజం ఇదే!

Spread the love

pet4thfloor అపార్ట్‌మెంట్‌లో కుక్కని పెంచుకుంటే అరిష్టమా? అసలు నిజం ఇదే!

pet4thfloor పైన ఫ్లాట్‌లో కుక్క ఉంటే కింద వాళ్లకు ఇబ్బందా?

ఆదివారం ఉదయం…
అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో ఉన్న రమ్య ఇంటి తలుపు దగ్గర చిన్న గోల వినిపించింది.

“మేడమ్… మీ కుక్క రాత్రంతా నడిచింది… మాకు నిద్రపట్టలేదు…” అంటూ కింద ఫ్లాట్‌లో ఉండే సరళ అసహనంగా మాట్లాడింది.

ఈ మాట విని రమ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వాళ్లు పెంచుకుంటున్న లాబ్రడార్ ‘బ్రూనో’కి ఎవరినీ ఇబ్బంది పెట్టే స్వభావం లేదు.. తమ ఇంట్లో చిన్నపిల్లల్లా పెరిగిన ఆ కుక్క… ఇంట్లో వాళ్లు దేనికైనా బాధ పడుతూంటే దగ్గరికి వచ్చి మౌనంగా కూర్చుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైమైందంటే చాలు, తోక ఊపుతూ గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది.

అలాంటి చిన్న ప్రాణి తమ ఇంట్లో నడిస్తే, కింద వాళ్ళ పైకప్పు అదిరిందా? ఇది వినడానికే వింతగా లేదూ? కానీ అసలు సమస్య అది కానే కాదు.
వాళ్ళ సెంటిమెంట్ వేరే ఉంది. “మా తల మీద, అంటే మా ఇంటిపైన కుక్క ఉండటం మంచిది కాదు… మా పెద్దవాళ్ళు చెప్పేవారు.” ఆ మాటలే రమ్య, సరళ మధ్య అసలు వివాదానికి కారణమయ్యాయి.

నగరాల్లో మాత్రమే కాక దాదాపు పెద్దపెద్ద ఊళ్ళల్లో కూడా అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగిన తర్వాత ఇలాంటి అభ్యంతరాలు కొన్ని చోట్ల ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పైన ఫ్లాట్‌లో పెంపుడు కుక్క ఉంటే… కింద వాళ్లకు అరిష్టమని, మంచిది కాదని కొందరు భావిస్తున్నారు. అయితే పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే వారు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే “ఒకప్పుడు పెంకుటిళ్లు… ఇప్పుడు అపార్ట్‌మెంట్లు… అవీ ఇవీ రెండూ ఎలా ఒకటవుతాయి?” అని వారు అడుగుతున్నారు.

ఇది పూర్తిగా నిజమే. ఎందుకంటే, పాతకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తిగా వేరుగా ఉండేది. మట్టి గోడలు, పెంకు పైకప్పులు, ఓపెన్ మేడలు ఉండేవి. ఆ కాలంలో కుక్కలు ఇంటి పైకప్పుల పైకి ఎక్కడం అసాధారణంగా భావించేవారు. కొన్నిసార్లు దాన్ని సెంటిమెంట్లతో, శకునాలతో అనుసంధానించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక ఇంటి మీద ఇంకో ఇల్లు ఉండటం సహజం. లిఫ్ట్‌లు, కారిడార్లు, ఫ్లాట్ కల్చర్… ఇవన్నీ ఆధునిక జీవన విధానంలో భాగమయ్యాయి.

ఈ నేపథ్యంలో “పైన కుక్క ఉంటే కింద వాళ్లకు అరిష్టం” అనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని సామాజిక పరిశీలకులు, వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే,
ఇప్పుడు చాలామందికి పెంపుడు కుక్కలు కేవలం జంతువులు కాదు… కుటుంబ సభ్యులు.

ఉద్యోగ ఒత్తిడులు, ఒంటరితనం, మానసిక ఆందోళనలు పెరిగిన ఈ కాలంలో పెంపుడు జంతువులు చాలా మందికి భావోద్వేగ అండగా మారుతున్నాయి. పిల్లల్లో ప్రేమ, బాధ్యత భావన పెంచడంలో కూడా అవి సహాయ పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ వంటి జాతులు కుటుంబాలతో త్వరగా కలిసిపోతాయి.

అయితే దీనర్థం ఇతరులకు ఇబ్బంది కలిగించాలనే కాదు. అపార్ట్‌మెంట్‌లలో కుక్కలు పెంచుకునే వారు పరిశుభ్రత, శబ్ద నియంత్రణ, సామూహిక ప్రదేశాల వినియోగంలో బాధ్యతగా ఉండాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో కేవలం పాత సెంటిమెంట్ల ఆధారంగా పెంపుడు జంతువులను వ్యతిరేకించడం కూడా సరైంది కాదని చెబుతున్నారు.

ఒకప్పుడు “ఇంటి కాపలాదారు”గా చూసిన కుక్క…
ఇప్పుడు చాలా మందికి “ఇంటి సభ్యుడు” గా మారింది.

కాలం మారింది… ఇళ్లు మారాయి… జీవన విధానం మారింది…
అయితే ఆలోచనలు కూడా కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉందని పెట్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

pet4thfloor
pet4thfloor

click here to read more

also read ఇంట్లో లాబ్రడార్ ఉంటే… కుటుంబానికి ప్రేమ, ఆనందం, రక్షణ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *