ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం 2026: మన జీవితాలను మార్చేసిన సోషల్ మీడియా మాయాజాలం

Spread the love

ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం 2026: మన జీవితాలను మార్చేసిన సోషల్ మీడియా మాయాజాలం

సోషల్ మీడియా అంటే నిజమా? లేక మాయా ప్రపంచమా?
ఫేక్ న్యూస్ వేగం… నిజం కంటే ఎందుకు ఎక్కువ?
సోషల్ మీడియా ప్రొఫైల్స్ వెనుక దాగి ఉన్న వాస్తవాలు
లైక్స్, వ్యూస్… నిజంగా మన విలువను నిర్ణయిస్తాయా?
ఒక్క క్లిక్‌తో వైరల్ అయ్యే సోషల్ మీడియా ప్రపంచం
మంచి పనులకు సోషల్ మీడియా ఎలా వేదిక అవుతోంది?
ఫేక్ ప్రేమలు, సైబర్ మోసాలు… సోషల్ మీడియా ప్రమాదకర కోణం
సోషల్ మీడియా లేకుండా జీవితం ఇప్పుడు సాధ్యమేనా?
సోషల్ మీడియాను ఉపయోగించాలా? లేక దానికి బానిస కాకూడదా?
సోషల్ మీడియా — మంచీ ఉంది… చెడూ ఉంది!

అద్భుత ప్రపంచం…
అభూత కల్పన…
కాస్తంత వాస్తవం…

వీటన్నిటి కలబోతనే సోషల్ మీడియా!

ఇందులో అభూత కల్పన అన్నది మాత్రం వాస్తవం…
వాస్తవం అన్నది మాత్రం చాలాసార్లు అవాస్తవం!
వినడానికి కాస్త తికమకగా అనిపించినా… సోషల్ మీడియా ప్రపంచాన్ని దగ్గరగా గమనించిన వాళ్లకు ఇది అక్షరాలా నిజమే అనిపిస్తుంది.

ఎందుకు? ఏమిటి? ఎలా? అంటారా?
అంటారు… ఎందుకనరు!

ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టుల్లో చాలావరకు ఫాక్ట్ చెక్ లేనివే. ఎవరో సరదాగా చేసిన మీమ్‌ని… ఇంకెవరో నిజమని నమ్మేస్తారు. ఇంకొంతమంది ఆలోచించకుండా షేర్ చేసేస్తారు. గంటల్లో అది లక్షల మందికి చేరిపోతుంది. చివరకు ఎవరో ఒకరు “అది ఫేక్ న్యూస్” అని చెప్పేసరికి… అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది.

సోషల్ మీడియా వేగం అంతే!
నిజం నడుస్తూ వస్తుంటే… అబద్ధం అప్పటికే ప్రపంచం చుట్టొచ్చేస్తుంది.

ఇక సోషల్ మీడియా ప్రొఫైల్స్ సంగతి మరీ ఆసక్తికరం.
డీపీగా చిన్నప్పటి ఫోటో…
లేదంటే అభిమాన హీరో ఫోటో…
పేరు ఒకటి… ఐడీ ఇంకోటి!
పైగా ప్రొఫైల్ లాక్ చేసి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించడం మరో కామెడీ.

ఇక్కడ ఎవరి గోల వారిదే.
నచ్చితే ఒక లైక్…
లేదంటే స్క్రోల్ చేస్తూ ముందుకు… అంతే!

కొన్నిసార్లు పోస్టు ఏమిటో కూడా చూడకుండా లైక్ కొట్టేస్తారు. తర్వాత ఓపెన్ చేసి చూస్తే… “మాకు తీవ్ర విషాదం కలిగించింది” అన్న పోస్ట్ అయి ఉంటుంది! అప్పుడే నాలిక్కరుచుకుని లైక్ తీసేయాలా వద్దా అని ఆలోచిస్తారు.

ఇక సోషల్ మీడియాలో మరో పెద్ద మ్యాజిక్ “లైక్స్”.
పోస్ట్‌కి వేల లైకులు వస్తాయి.
వ్యూస్ లక్షల్లో ఉంటాయి.
కానీ అదే పోస్టులో “లింక్ క్లిక్ చేయండి” అంటే మాత్రం… అక్కడే జనాలు మాయం!

అందుకే చాలామంది సరదాగా చెబుతుంటారు —
“సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ సంఖ్య చూసుకుని విర్రవీగడం అంటే… వాపుని చూసి బలుపనుకోవడమే” అని.

అయితే సోషల్ మీడియాలో అంతా చెడే ఉందనుకోవడం కూడా తప్పే. కొంతమంది నిజంగా మంచి పనుల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడి గెట్ టు గెదర్స్ నిర్వహించడం… రక్తదానం, సేవా కార్యక్రమాలకు పిలుపునివ్వడం… అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం… ఇలాంటి మంచి ఉదాహరణలు కూడా చాలానే కనిపిస్తున్నాయి.

కానీ మరోవైపు… ఫేక్ ప్రేమలు, నకిలీ పరిచయాలు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలకు కూడా ఇదే ఈజీ వేదికగా మారింది. “హాయ్ ఫ్రెండ్”తో మొదలైన పరిచయాలు… చివరకు బ్యాంక్ అకౌంట్ల వరకూ వెళ్లిన ఘటనలు కూడా ఎన్నో వెలుగుచూశాయి.

అయినా ఒక విషయం మాత్రం నిజం —
ఇప్పుడు సోషల్ మీడియా లేకుండా జీవితాన్ని ఊహించడం చాలా కష్టం.

ఉదయం లేచిన దగ్గర నుంచి… రాత్రి నిద్రపోయే వరకూ… మన చేతిలో మొబైల్, అందులో సోషల్ మీడియా తప్పనిసరి భాగమైపోయాయి.

అందుకే సోషల్ మీడియాను పూర్తిగా తప్పు పట్టలేం… పూర్తిగా నమ్మలేం కూడా.

ప్రపంచంలో ప్రతి దాంట్లోనూ మంచీ ఉంది… చెడూ ఉంది.
సోషల్ మీడియా కూడా అంతే కదా!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *