Youth Unemployment 9.9%

Youth Unemployment 9.9%: ఉద్యోగం రాకపోతే… ఓటు ఎటు?

Spread the love

Youth Unemployment 9.9%: యువత భవిష్యత్తుపై ప్రభుత్వాలకు అసలు పరీక్ష ఇదే!

Youth Unemployment 9.9%: నిరుద్యోగం ఓటుగా మారితే రాజకీయ భవిష్యత్తు ఎలా మారుతుంది?

ఒక యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. మరో పరీక్ష రాశాడు. ఇంకో ఉద్యోగ ప్రకటన కోసం ఎదురుచూశాడు. కోచింగ్‌కు డబ్బులు ఖర్చు చేశాడు. పరీక్ష తేదీ కోసం వేచి చూశాడు. ఫలితం కోసం ఎదురుచూశాడు. చివరికి ఉద్యోగం రాలేదు.
అతని చేతిలో మాత్రం ఒక డిగ్రీ ఉంది. ఇంట్లో అతడి/ఆమెపై ఒత్తిడి పెరుగుతోంది..“ఇంకెంతకాలం?”
ఇదే ప్రశ్న ఇప్పుడు కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు… ప్రభుత్వాలను కూడా వెంటాడాల్సిన పరిస్థితి వస్తోంది.
ఎందుకంటే నిరుద్యోగం ఇక కేవలం ఆర్థిక సమస్య కాదు. అది విద్యా విధానానికి పరీక్ష. ప్రభుత్వ ఉద్యోగ విధానానికి పరీక్ష. పరిశ్రమల విధానానికి పరీక్ష. చివరికి అధికారంలో ఉన్న ప్రభుత్వాల పనితీరుకే పరీక్ష.
అధికారిక లెక్కల 2025 ప్రకారం 15–29 ఏళ్ల యువతలో నిరుద్యోగ రేటు 9.9 శాతం. పట్టణ యువతలో అది 13.6 శాతానికి చేరింది. మొత్తం 15 ఏళ్లు పైబడిన జనాభాలో నిరుద్యోగ రేటు 3.1 శాతంగా ఉన్న నేపథ్యంలో యువత పరిస్థితి ఎందుకు ఇంత భిన్నంగా ఉంది? ఇదే అసలు రాజకీయ ప్రశ్న.


డిగ్రీ ఉంది… ఉద్యోగం ఎక్కడ?

Youth Unemployment 9.9%
Youth Unemployment 9.9%


ఏళ్ల తరబడి విద్యార్థులకు ఒక మాట చెబుతాం. “బాగా చదువుకో… మంచి ఉద్యోగం వస్తుంది.” కానీ చదువు పూర్తయ్యాక ఉద్యోగం రాకపోతే? అప్పుడు యువకుడు తనను తాను ప్రశ్నించుకోవడం మొదలుపెడతాడు. “నేను సరిగ్గా చదవలేదా?”
“నా నైపుణ్యాలు సరిపోవా?” “నా కాలేజీ సరిగ్గా నేర్పలేదా?” “ఉద్యోగాలు లేవా?” “లేక ప్రభుత్వ విధానాల్లోనే సమస్య ఉందా?” ఇక్కడే సమస్య సామాజిక స్థాయి నుంచి రాజకీయ స్థాయికి మారుతుంది. ఒక యువకుడికి ఉద్యోగం రాకపోవడం వ్యక్తిగత వైఫల్యంగా కనిపించవచ్చు. కానీ లక్షలాది యువతకు ఒకే సమస్య ఎదురైతే…అది వ్యవస్థ వైఫల్యమా? అనే ప్రశ్న తప్పదు.


ప్రభుత్వ ఉద్యోగం… ఒకే ఆశగా మారితే?


ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉన్నా, ఉద్యోగ భద్రత, జీతం, సామాజిక గౌరవం కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలపై యువతలో ప్రత్యేక ఆకర్షణ ఉంది. 2023 ఛ్శ్డ్శ్ సర్వేలో 60 శాతానికి పైగా యువత ప్రభుత్వ ఉద్యోగాలనే ప్రాధాన్యంగా కోరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే సమస్య అక్కడే మొదలవుతోంది. పోటీ పెరుగుతోంది. ఖాళీలు పరిమితంగా ఉన్నాయి. అభ్యర్థులు లక్షల్లో ఉంటున్నారు. పరీక్షలు ఆలస్యమైతే వయసు పెరుగుతోంది. ఏదైనా పేపర్ లీక్ అయితే మరో సంవత్సరం పోతోంది. నియామక ప్రక్రియ ఆలస్యమైతే యువకుడి జీవితంలో మరో అవకాశం జారిపోతోంది.
అప్పుడు ఒక సందేహం సహజంగానే వస్తుంది.. “ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేకపోతే… కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించే ఆర్థిక వాతావరణాన్ని ప్రభుత్వం ఎంతవరకు కల్పించింది?” ఇదే ప్రశ్న రాబోయే ఎన్నికల్లో మరింత పదునెక్కే అవకాశం ఉంది.


నిరుద్యోగం… ఓటు బ్యాంకుగా మారుతుందా?


ఇదే అత్యంత ఆసక్తికరమైన అంశం.
ఒక రైతు తన పంట ధర గురించి ఆలోచిస్తాడు. ఒక ఉద్యోగి తన జీతం గురించి ఆలోచిస్తాడు. ఒక మధ్యతరగతి కుటుంబం ధరల గురించి ఆలోచిస్తుంది. కానీ ఒక నిరుద్యోగ యువకుడు తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు.
అతనికి ఈరోజు ఉద్యోగం కావాలి. రేపు పెళ్లి కావాలి. తర్వాత ఇల్లు కావాలి. కుటుంబాన్ని నిలబెట్టాలి.
అంటే ఉద్యోగం అనేది కేవలం నెల జీతం కాదు. అది ఒక యువత జీవితానికి దిశ. అందుకే నిరుద్యోగ సమస్య తీవ్రత పెరిగితే అది క్రమంగా రాజకీయ అసంతృప్తిగా మారే అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికల ముందు ఛ్శ్డ్శ్-ళొక్నితి సర్వేలో 62% మంది ఉద్యోగం సంపాదించడం కష్టమైందని చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఉద్యోగాలు, ధరల పెరుగుదల అప్పట్లో ప్రధాన ఎన్నికల అంశాలుగా నిలిచాయి. అంటే ఓటరు ఇప్పటికే ఉద్యోగ సమస్యను రాజకీయ చర్చలోకి తీసుకొచ్చాడు.


మరి ప్రభుత్వాల భవిష్యత్తు?


ఇక్కడే అసలు పరీక్ష. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా…
“ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం?” అనే ప్రశ్నతో పాటు, “ఎన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించాం?” “ఎన్ని యువతకు పరిశ్రమలలో అవకాశాలు కల్పించాం?” “డిగ్రీ తర్వాత ఉద్యోగానికి వెళ్లే నైపుణ్యాలు విద్యార్థులకు వచ్చాయా?”
“పరీక్షలు, నియామకాలు సమయానికి జరిగాయా?” అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఒక ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వగలదు. రోడ్లు వేయగలదు. పెట్టుబడులు తీసుకురాగలదు.
పరిశ్రమలు ఏర్పాటు చేయగలదు. కానీ యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కనిపించకపోతే అభివృద్ధి కథనంపై ప్రశ్నలు మొదలవుతాయి.


విద్యా వ్యవస్థ నుంచే సమస్య మొదలైతే?


ఇది మరింత లోతైన విషయం.
2026లో నితి అయోగ్ విడుదల చేసిన పాఠశాల విద్యా నివేదికలో దేశంలోని 1.19 లక్షల పాఠశాలలకు పనిచేసే విద్యుత్ సదుపాయం లేదని పేర్కొంది. 1.04 లక్షలకు పైగా పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని కూడా నివేదికలో ఉంది.
అంటే ఉద్యోగం కోసం పోటీ పడుతున్న యువకుడి కథను అతని డిగ్రీ దగ్గర నుంచి మాత్రమే ప్రారంభిస్తే సరిపోదు.
అతని కథ పాఠశాల నుంచే మొదలవుతుంది. పాఠశాల నాణ్యత… కాలేజీ నాణ్యత…నైపుణ్య శిక్షణ…
పరిశ్రమలతో అనుసంధానం…చివరికి ఉద్యోగం. ఈ గొలుసులో ఎక్కడైనా బలహీనత ఉంటే దాని ప్రభావం చివరికి యువ నిరుద్యోగం రూపంలో కనిపిస్తుంది.


మరి ఓటరు ఏం చేస్తాడు?


ఇది ఎవ్వరూ ముందుగానే చెప్పలేరు.
నిరుద్యోగం ఒక్కటే ఒక పార్టీని ఓడిస్తుందని చెప్పడం రాజకీయంగా అతిసరళీకరణ అవుతుంది. ఎన్నికల్లో ప్రాంతీయ సమస్యలు, కుల సమీకరణాలు, సంక్షేమ పథకాలు, నాయకత్వం, ధరలు, స్థానిక అభ్యర్థులు, జాతీయ అంశాలు… ఎన్నో ప్రభావితం చేస్తాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతను ఎప్పటికీ పట్టించుకోకుండా ఉండటం ఏ ప్రభుత్వానికైనా ప్రమాదకరమే.
ఎందుకంటే నిరుద్యోగ యువకుడి చేతిలో ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటు వేయడానికి ముందు అతను ఒక్కసారి వెనక్కి చూసుకోవచ్చు. “నా చదువుకు విలువ పెరిగిందా?”
“నాకు ఉద్యోగ అవకాశం వచ్చిందా?” “నా భవిష్యత్తుకు మార్గం కనిపిస్తుందా?” అని.
అక్కడే ప్రభుత్వాల అసలు పరీక్ష మొదలవుతుంది.
చివరికి…నిరుద్యోగం పెరిగితే మొదట కుటుంబం ఇబ్బంది పడుతుంది. తర్వాత యువతలో నిరాశ పెరుగుతుంది. ఆ తర్వాత అసంతృప్తి పెరుగుతుంది. అది ఉద్యమంగా మారవచ్చు. రాజకీయ డిమాండ్‌గా మారవచ్చు. చివరికి…ఓటుగా మారవచ్చు.
అందుకే నిరుద్యోగాన్ని కేవలం “యువత సమస్య”గా చూసే రోజులు ముగిసిపోతున్నాయి. ఇది ప్రభుత్వాల పనితీరుకు కొలమానం.
ఇది విద్యా వ్యవస్థకు అద్దం.ఇది ఆర్థిక విధానాలకు పరీక్ష. ముఖ్యంగా… ఇది రాజకీయ భవిష్యత్తుకు హెచ్చరిక.
ఎన్నికల సమయంలో ఉచిత హామీల కంటే… “మీ పిల్లలకు ఉద్యోగం ఎక్కడ?” అనే ప్రశ్న మరింత బలంగా మారితే?
అప్పుడు అసలు చర్చ ఎవరు అధికారంలోకి వస్తారు? అన్నదానిపై కాదు…“ఎవరు యువత భవిష్యత్తుకు ఉద్యోగం చూపించగలరు?” అన్నదానిపై జరుగుతుంది. అదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరో విషయం—భారత యువతకు ఉద్యోగాల సంఖ్య మాత్రమే కాదు, నాణ్యమైన ఉద్యోగాలు, నైపుణ్యాలు, ఉత్పాదకత, మెరుగైన వేతనాలు కూడా అవసరం.


యువతకు భవిష్యత్తు కనిపిస్తే… ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుంది.
యువతకు భవిష్యత్తు కనిపించకపోతే… ఎన్నికల ఫలితాల్లో ఆ అసంతృప్తి ఏ రూపంలో కనిపిస్తుందో చెప్పడం కష్టం.

click here to read more

click here to read more  ప్రకృతి విపత్తుల్లో ప్రాణనష్టం పూర్తిగా నివారించడం నిజంగా సాధ్యమేనా?

Youth Unemployment 9.9% Youth Unemployment 9.9% Youth Unemployment 9.9% Youth Unemployment 9.9% Youth Unemployment 9.9%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *