Harshavardhan Reddy 2026:బహుముఖ ప్రతిభావంతుడు హర్షవర్ధన్ రెడ్డి!
Harshavardhan Reddy 2026: ‘జీరో బడ్జెట్’ రాజకీయాలతో తిరుపతిలో కొత్త చర్చ!
మేయర్ రేసులో ‘అవార్డుల’ హర్షవర్ధన్ రెడ్డి !
క్రీడల నుంచి విద్యారంగం వరకు బహుముఖ ప్రతిభ.. యువతతో అనుసంధానం
ఐదు క్రీడల్లో జాతీయ స్థాయి ప్రతిభ.. 20కుపైగా దేశాల్లో విద్యా, సేవా అనుభవం
అధ్యాపకుడు.. సంపాదకుడు.. శిక్షణ నిపుణుడు..
స్వచ్ఛమైన ‘జీరో బడ్జెట్’ రాజకీయాలే లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి!

తిరుపతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి మరో ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు.. విద్యావేత్తగా అనుభవం.. అంతర్జాతీయ పరిచయాలు.. యువతతో విస్తృత అనుసంధానం.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర.. ఇలా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ ఎన్బీ హర్షవర్ధన్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మేయర్ ఎన్నిక ప్రత్యక్షంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ తరఫున తిరుపతి మేయర్ అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలని ఆయన ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
హర్షవర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ ఆయన తండ్రి, టీడీపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బీ సుధాకర్‌రెడ్డి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినట్టు సమాచారం. ఆధ్యాత్మిక, విద్యా, పర్యాటక నగరమైన తిరుపతికి యువతతో మమేకమయ్యే, ఆధునిక ఆలోచనలు కలిగిన నాయకత్వం అవసరమని ఆయన తన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
చిన్న వయసులోనే నాయకత్వ పునాది
చిన్ననాటి నుంచే క్రీడలు, నాయకత్వం, సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకున్న హర్షవర్ధన్‌రెడ్డి విద్య, శిక్షణ, యువత అభివృద్ధి, ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం వంటి రంగాల్లో పనిచేశారు. వివిధ సంస్థల ద్వారా సుమారు లక్ష మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులకు శిక్షణ, ప్రేరణ కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉందని ఆయన వర్గాలు చెబుతున్నాయి.

ఐఐటీ నుంచి అంతర్జాతీయ వేదికల వరకు..

ఐఐటీ తిరుపతిలో ఇంటర్నేషనల్ ఆఫీసర్‌గా పనిచేసిన హర్షవర్ధన్‌రెడ్డి ఉన్నత విద్య, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సంస్థాగత నిర్వహణ, ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల అభివృద్ధి రంగాల్లో పనిచేశారు. తిరుపతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో పాటు పలు విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యమయ్యారు.
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ)లో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన ఆయన ప్రస్తుతం జేసీఐ వరల్డ్ కాంగ్రెస్ డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం. యంగ్ ఇండియన్స్, రోటరీ, లయన్స్ క్లబ్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలతోనూ ఆయనకు అనుబంధం ఉంది.
విద్యారంగంలోనూ ప్రత్యేక గుర్తింపు

హర్షవర్ధన్‌రెడ్డి వీఐటీ వెల్లూరులో పీహెచ్డీ, జేఎన్టీయూ అనంతపురంలో ఎంబీఏ, ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎఫ్డీపీఎం పూర్తి చేసినట్టు ఆయన వర్గాలు తెలిపాయి. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. విద్య, పరిశోధన, శిక్షణ, వృత్తిపరమైన కార్యక్రమాల కోసం 20కుపైగా దేశాల్లో పర్యటించిన అనుభవం ఉందని చెబుతున్నారు.
క్రీడల్లో ‘అవార్డుల’ హర్షవర్ధన్‌రెడ్డి
హర్షవర్ధన్‌రెడ్డి పేరు వినగానే ఆయన సాధించిన అవార్డులు, క్రీడా ప్రస్థానం ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తాయి. టెన్నిస్, స్కేటింగ్, తైక్వాండో, రోలర్ హాకీ, బ్యాడ్మింటన్, స్కేట్బాల్ వంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో పోటీపడ్డారు. క్రీడా ప్రతిభకు గుర్తింపుగా అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఎన్సీసీలో సి-సర్టిఫికెట్ కూడా పొందారు.
క్రీడల ద్వారా తనలో క్రమశిక్షణ, టీమ్‌వర్క్, నాయకత్వం, పట్టుదల వంటి లక్షణాలు పెరిగాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కార్యాలయం, నివాసంలో ప్రదర్శిస్తున్న పెద్ద సంఖ్యలో అవార్డులు, ప్రశంసాపత్రాలు ఆయన బహుముఖ ప్రతిభకు గుర్తింపుగా నిలుస్తున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆయనకు ‘అవార్డుల హర్షవర్ధన్ రెడ్డి’ అనే గుర్తింపు ఏర్పడుతోంది.
మేనేజ్మెంట్ అధ్యాపకుడిగా..

2011లో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం శ్రీకాళహస్తి మార్గంలోని శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేనేజ్మెంట్ అధ్యాపకుడిగా చేరారు. అనంతరం మేనేజ్మెంట్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎనిమిదేళ్లు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు.
‘జీవన వికాసం’ సంపాదకుడిగా..
విద్యారంగంతో పాటు జర్నలిజంపైనా ఆసక్తి పెంచుకున్న ఆయన 2011లో ‘జీవన వికాసం’ మాసపత్రికను ప్రారంభించారు. సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ పత్రికకు అక్రెడిటేషన్ కూడా పొందారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ జి. సమరం, ప్రముఖ జర్నలిస్ట్ కలత్తూరు సుధాకర్‌రెడ్డి, ప్రజా సంబంధాల నిపుణుడు చివుకుల రమాకాంత్ శర్మ తదితరుల వ్యాసాలను ప్రచురిస్తూ యువతలో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి కృషి చేశారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ఐదేళ్ల అనంతరం పత్రికను నిలిపివేశారు.

గతంలోనూ రాజకీయ ప్రయత్నాలు
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి హర్షవర్ధన్‌రెడ్డికి కొత్తేమీ కాదు. 2023లో రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ, ఉపాధ్యాయ సంఘాలతో కుదిరిన అవగాహన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ను కలిసి ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అవకాశం దక్కలేదు. ఆయనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తో పలుసార్లు కలిసారు. మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు రెడ్డివారి చెంగా రెడ్డి, గల్లా అరుణకుమారి తదితరులతో గట్టి పరిచయాలు ఉన్నాయి. తిరుపతిలో అన్ని పార్టీల నాయకులతో పరిచయం ఉంది.
కుటుంబ రాజకీయ నేపథ్యం

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దాసారపల్లెకు చెందిన ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. చార్వాకానిపల్లె పంచాయతీ తొలి సర్పంచ్‌గా ఆయన తాత ఎన్. బాలి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తల్లి ఎన్ బీ రాధ కూడా 1995లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వారి బంధువులు ఎన్ చిన్న ఇరగమ రెడ్డి పదేళ్లు, ఎన్ మునిరత్నం రెడ్డి 15 ఏళ్లు సర్పంచ్ లుగా పనిచేశారు.
ఆయన తండ్రి డాక్టర్ ఎన్బీ సుధాకర్‌రెడ్డి 1983లో పుత్తూరు నుంచి జనతా అభ్యర్థిగా పోటీ చేశారు. 2011లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేశారు. 2020 నుంచి 2026 వరకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. అంతకుముందు యువ జనతా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. హర్షవర్ధన్ రెడ్డి భార్య నర్మద జెసిఐ గాజువాక శాఖ అధ్యక్షురాలిగా ఉన్నారు
‘జీరో బడ్జెట్’ రాజకీయాలే లక్ష్యం!

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే డబ్బు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాసేవకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది హర్షవర్ధన్ రెడ్డి ఆలోచనగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. స్వచ్ఛమైన, ‘జీరో బడ్జెట్’ రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇవ్వాలనే లక్ష్యంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు సమాచారం.
తిరుపతితో తన కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుబంధం, యువతతో ఉన్న అనుసంధానం, విద్యా–వృత్తి రంగాల్లో అనుభవం, అంతర్జాతీయ పరిచయాలు, క్రీడా నేపథ్యం, సామాజిక సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని మేయర్ అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును పరిశీలించాలని సుధాకర్‌రెడ్డి కోరినట్టు తెలుస్తోంది.
నేడు అర్హత, అనుభవం, బాధ్యతాయుతమైన నాయకత్వం కంటే ఇతర సమీకరణాలకే ప్రాధాన్యం పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అర్హత లేని వారి చేతిలో అధికారం ఉంటే అది ఎంత ప్రమాదకరమో, బాధ్యతాయుతమైన వ్యక్తి చేతిలో అధికారం ఉంటే అది ఎంత ప్రయోజనకరమో సమాజం ఎన్నో సందర్భాల్లో చూస్తూనే ఉంది.
ఇలాంటి సమయంలో విద్య, వినయం, విశాల దృక్పథం, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన హర్షవర్ధన్ రెడ్డి వంటి వ్యక్తుల చేతిలో అధికారం ఉంటే ఆ పదవికే వన్నె చేకూరుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
“పిచ్చివాడి చేతిలో రాయి.. అల్పుడి చేతిలో అధికారం” ఎంత ప్రమాదమో గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది.

అయితే మేయర్ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం టీడీపీ అధిష్ఠానానిదే. ప్రత్యక్ష మేయర్ ఎన్నికకు తెరలేస్తే.. బహుముఖ ప్రతిభతో రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న ‘అవార్డుల హర్షవర్ధన్‌రెడ్డి’ పేరు ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు తిరుపతి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
clik on below image to read





Pingback: Jobs2026: ఉద్యోగాల కోసం చూస్తున్నారా? ఈ 3 నోటిఫికేషన్లు, APలో 10,060 పోస్టులు మిస్ కాకండి! - Trendy Duniyaa