Elder Abuse Awareness | వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కోరుకునేది ఆస్తి కాదు.. ప్రేమగా పలికే నాలుగు మాటలే!
Elder Abuse Awareness | మాటలతో చేసే నిర్లక్ష్యమూ ఒకరకమైన హింసే
Elder Abuse Awareness | చిన్నప్పుడు నడవలేక తప్పటడుగులతో తడబడితే చేతి వేళ్లు పట్టుకుని నడిపించింది అమ్మ… జీవితంలో ఓడిపోతానేమోనని భయపడితే భుజం తట్టి ధైర్యం చెప్పింది నాన్న. మన తొలి గురువులు, తొలి దేవుళ్లు, తొలి రక్షకులు వాళ్లే. అలాంటి తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారు కోరుకునేది కొత్త కోరికకో, సుఖాలో, తిండి వస్తువులో, అంతులేని ఆస్తులో కాదు… కేవలం నాలుగు ప్రేమపూరితమైన పలకరింపులు..మనసులోంచి వచ్చే మంచిమాటలు, కొద్దిసేపు వారితో కలిసుండే తోడు, ఒక చిన్ని భరోసా మాత్రమే.
Elder Abuse Awareness | కానీ, ఒకప్పుడు పిల్లల కోసం రాత్రింబవళ్లు కష్టపడిన వారు, ఇప్పుడు అదే పిల్లల ఇళ్లలో పరాయి వారిలా జీవిస్తున్నారు. మాట్లాడటానికి సమయం లేదు… పక్కన కూర్చోవడానికి ఓపిక లేదు… ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఇష్టం లేదు. కొందరికి అయితే అవమానం, నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడీ, మానసిక హింసే వృద్ధాప్యపు సహచరాలు అవుతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకే, ప్రతి సంవత్సరం జూన్ 15ను ‘వృద్ధులపై హింస నిరోధక దినం’గా ప్రపంచం గుర్తిస్తోంది.

Elder Abuse Awareness | వృద్ధులపై హింస అంటే కేవలం కొట్టడం, భౌతిక దాడి, హింసించడం కాదు. “మీ వల్ల ఇబ్బంది” అనే ఒక్క మాట కూడా వారి గుండెను గాయపరుస్తుంది. పెన్షన్ డబ్బు తీసుకుని వారిని ఒంటరిగా వదిలేయడం, మందులు కొనిపెట్టకపోవడం, మాట్లాడకుండా వారిని మూలన కూర్చోబెట్టడం, ఇవి కూడా పెద్దల పట్ల హింసే. వారిలో బయటికి కనిపించని ఈ గాయాలు, పెద్దవారి లోపల మాత్రం మనసును దహించి వేస్తూంటాయి. వారి జీవితాన్ని నెమ్మదిగా కరిగిస్తుంటాయి.
మన దేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పదని చెప్పుకుంటాం. కానీ వాస్తవం చూస్తే చాలా వృద్ధాశ్రమాలు తల్లిదండ్రుల మౌన వేదనతో కరిగిన కన్నీళ్లతో నిండిపోయాయి. “పిల్లలు అమెరికాలో ఉన్నారు”, “బిజీగా ఉంటారు”, “వాళ్లకు టైం ఉండదు” అని తమ బాధను తామే సమర్థించుకునే వృద్ధుల్ని చూస్తే మనసులో జాలి కలగక మానదు. నిజానికి వారికి కావాల్సింది డబ్బు కాదు… దగ్గరగా కూర్చునే మనిషి.
Elder Abuse Awareness | ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి. హెల్ప్‌లైన్లు పెట్టాయి. పెన్షన్లు ఇస్తున్నాయి. కానీ వృద్ధుల కళ్లలో కనిపించే ఖాళీని మాత్రం ఏ చట్టం నింపలేదు. దాన్ని నింపేది ఒక్కటే, మనిషి ప్రేమ.
ఒక్కసారి ఆలోచించాలి… మన చిన్ననాటి ప్రతి అవసరాన్ని అడగక ముందే గుర్తించిన వాళ్లను, మనం ఇప్పుడు ఎందుకు మరిచిపోతున్నాం? వాళ్లు మన కోసం తమ యవ్వనాన్ని ఖర్చు పెట్టారు… మనం వారికి కొంత సమయం ఇవ్వలేమా?
జూన్ 15 ఒక తేదీ మాత్రమే కాదు… మన మనసును పరీక్షించే రోజు. తల్లిదండ్రులను గౌరవించడం ఒక బాధ్యత కాదు, అది మనిషిగా మన విలువ. ఎందుకంటే ఈ రోజు వాళ్లు వృద్ధులు… రేపు మనం కూడా అదే దారిలో నడవాల్సిందే. ఆ స్థితికి చేరుకోవాల్సిందే.
Elder Abuse Awareness | వృద్ధులపై హింస ఆగాలి… వారి ముఖాల్లో మళ్లీ చిరునవ్వు రావాలి.
click here to read more : సముద్రాలకి జ్వరం.. మనమే కారణం: పెరుగుతున్న సముద్ర కాలుష్య ముప్పు



