free26medicines డబ్బు లేకుండానే ఆరోగ్యంగా జీవించే రహస్యాలు
free26medicines శారీరక, మానసిక ఆరోగ్యానికి సహజ మార్గాలు
ఒక మనిషి జీవితంలో అత్యంత ఖరీదైనది ఏమిటి? ఇల్లు కాదు… కారు కాదు… బ్యాంకులోని డబ్బూ కాదు. ఆరోగ్యం. దాన్ని కోల్పోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే… ప్రకృతి మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్నో వరాలను, ఉచితంగా ఇచ్చింది. వాటికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. మెడికల్ షాపుకూ వెళ్లాల్సిన పనిలేదు. కాస్త సమయం, కొద్దిగా క్రమశిక్షణ, కొంత మనసు ఉంటే చాలు. ఆరోగ్యాన్ని కాపాడే ఇలాంటి 26 ఉచిత మందులు ఇవే…
1. త్వరగా నిద్రపోయి, త్వరగా లేవడం
రాత్రి నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. మన దేహానికి ప్రకృతి ఇచ్చిన మరమ్మత్తుల సమయం. తెల్లవారుజామున లేవడం రోజంతా ఉత్సాహాన్ని నింపుతుంది. మెదడుకి కొత్త శక్తి వచ్చినట్టవుతుంది.
2. ఉదయాన్నే దేవుడిని స్మరించుకోవడం
గంటలకొద్దీ కూర్చుని పూజలు చెయ్యలేకపోయినా పర్వాలేదు. కనీసం పదినిముషాల దైవ ప్రార్థన… మనసును ప్రశాంతంగా మారుస్తుంది. ప్రశాంతమైన మనసే ఆరోగ్యానికి మొదటి మెట్టు.
3. యోగా, ప్రాణాయామం, వ్యాయామం
శరీరాన్ని సక్రమంగా, సకాలంలో కదిలిస్తే సకల రోగాలు దూరమవుతాయి. శరీరం ఉత్తేజితమవుతుంది. ఊపిరిని సరిగా పీల్చుకుంటే మనసూ తేలికపడుతుంది. శ్వాసపై ధ్యాస..దీర్ఘాయువుకు దోహదం చేస్తుంది.
4. ఉదయం, సాయంత్రం నడక
నడకకు ఖర్చు లేదు… కానీ నడక వల్ల చేకూరే లాభం మాత్రం అపారం. మనం వేసే ప్రతి అడుగు.. ఆరోగ్యం వైపు వేసే ముందడుగే అని తెలుసుకోవాలి. ప్రతిరోజూ నడవాలి. వీలైతే, గడ్డి ఇసుక నేలల్లో పాదరక్షలు లేకుండా నడవాలి. రక్తప్రసరణకు ఎంతో మంచిది.
5. ఉపవాసం
ఉపవాసం వెనుక ఎంతో గొప్ప ఆరోగ్య సూత్రం ఉంది. అప్పుడప్పుడు శరీరానికీ జీర్ణవ్యవస్థకూ విశ్రాంతి అవసరమే. ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చేసే ఉపవాసం మానసిక-శారీరక నియంత్రణను నేర్పుతుంది.
6. సూర్యరశ్మి
ఉదయపు సూర్యకాంతి అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు… అనంత జీవశక్తి. ప్రాణకోటికి ప్రకృతి ప్రతిరోజూ ఉచితంగా ఇచ్చే గొప్ప వరం.
7. మట్టి కుండలోని నీరు
ఫ్రిజ్ నీళ్ళను అప్పుడప్పుడు అవాయిడ్ చేయండి. మట్టికి సహజ చల్లదనం ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ఉండే అలవాట్లు శరీరానికీ హాయినిస్తాయి.
8. చప్పట్లు కొట్టడం
ఆనందంతో, ప్రశంసగా, ప్రోత్సాహంగా నవ్వుతూ చప్పట్లు కొట్టడం మనలోని ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. సంతోషం కూడా ఆరోగ్యానికి ఒక ఔషధమే.
9. ఆహారాన్ని బాగా నమిలి తినడం
తొందరగా తినడం కడుపు నింపుతుంది. కానీ, దాన్ని జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థకి చాలా క్లిష్టమవుతుంది. అదే నెమ్మదిగా నమిలి తినడం ఆరోగ్యాన్ని శరీరంలో నింపుతుంది.
10. నీరు తాగడం, శ్రద్ధగా తినడం
శరీరానికి నీరు జీవం. ఆహారం ఇంధనం. రెండూ సమయానికి అందితేనే ఆరోగ్యం నిలుస్తుంది.
11. వజ్రాసనంలో కూర్చోవడం
భోజనం తర్వాత కొన్ని నిమిషాల వజ్రాసనం జీర్ణక్రియకు తోడ్పడుతుందని యోగా శాస్త్రం చెబుతుంది.
12. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం
సంతోషం బయట దొరికేది కాదు. అది మనసు తీసుకునే నిర్ణయం.
13. మౌనం
ప్రతి మాటకు సమాధానం అవసరం లేదు. కొన్నిసార్లు మౌనమే మనసుకు గొప్ప విశ్రాంతి.
14. నవ్వు, హాస్యం
నవ్వు పెదవులపై పుడుతుంది… కానీ దాని ప్రభావం గుండె వరకూ చేరుతుంది.
15. సంతృప్తి
ఉన్నదానితో సంతోషపడగలిగినవాడే నిజమైన ధనవంతుడు. సంతృప్తి మనసుకు శాశ్వత ఔషధం.
16. విశ్రాంతి, శాంతి
పని ఎంత అవసరమో… విశ్రాంతి కూడా అంతే అవసరం. అలసిన శరీరానికీ, మనసుకీ కాసింత నిశ్శబ్దం ఇవ్వండి.
17. నిజాయితీ, సానుకూల దృక్పథం
నిజాయితీ మనసును తేలిక చేస్తుంది. సానుకూల ఆలోచనలు జీవితాన్ని వెలుగుతో నింపుతాయి.
18. నిస్వార్థ ప్రేమ
ప్రేమకు ధర లేదు. కానీ అది ఇచ్చే బలం అమూల్యం.
19. ఇతరులకు మంచి చేయడం
సహాయం చేసిన చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ముందుగా నిండేది మనసే.
20. పుణ్యం కలిగించే పని
ఒక మంచి పని… రెండు హృదయాలను సంతోషపెడుతుంది.
21. సామరస్యంగా జీవించడం
మనుషులతో మంచిగా ఉండడం కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమే.
22. కుటుంబంతో సమయం గడపడం
కుటుంబంతో కలిసి తిన్న భోజనం… కలిసి నవ్విన క్షణాలు… మనసుకు టానిక్లాంటివి.
23. మంచి స్నేహితుడు
కొన్ని మందులు బాధను తగ్గిస్తాయి. మంచి స్నేహితుడు బాధను పంచుకుంటాడు. అందుకే నిజమైన స్నేహం ఒక పూర్తి వైద్యశాల.
24. ప్రశాంతంగా, చురుకుగా, ఉత్సాహంగా ఉండడం
ప్రశాంతత మనసుకు, చురుకుదనం శరీరానికి, ఉత్సాహం జీవితానికి బలం.
25. ప్రతి కొత్త రోజును ఆస్వాదించడం
ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. దాన్ని భయంతో కాదు… ఆశతో ఆహ్వానించండి.
26. ప్రకృతిని అర్థం చేసుకోవడం… మంచి పంచుకోవడం
ప్రకృతి ఇచ్చిన ఈ వరాలను మనం ఆచరిస్తే మనకే కాదు, ఇతరులతో పంచుకుంటే వారికి కూడా మేలు జరుగుతుంది. మంచి మాట కూడా కొన్నిసార్లు ఒక మందులా పనిచేస్తుంది.

click here to read రాత్రి మెగ్నీషియం.. ఉదయం విటమిన్ డి..!డాక్టర్లు ఎందుకు ఇలా చెబుతారు?



