Housemaid Problems

Housemaid పనిమనిషా మజాకా…

Spread the love

Housemaid పనిమనిషా మజాకా…

-ముచ్చర్ల రజనీశకుంతల

Housemaid పనిమనిషి కావాలా? అయ్యబాబోయ్!
“లక్ష రూపాయలు అప్పు ఇమ్మన్నా ఇస్తా కానీ, పనిమనిషిని వెతికి పెట్టడం మాత్రం నా వల్ల కాదు శిరీషా!” – ఫోన్‌కి ఇలా రెస్పాండ్ కాక తప్పలేదు. అవును మరి, కట్టుకోవడానికి చీర అరువు అడిగితే ఇస్తాను.. పెళ్లికి వెళ్తుంటే నగలు అడిగినా ఇస్తాను. కానీ, “మా పనిమనిషి రాలేదు, కాస్త మీ పనిమనిషిని పంపిస్తావా?” అని కమ్యూనిటీలో ఎవరైనా అడిగితే మాత్రం పంపను గాక పంపను!

ఎందుకంటారా? పనివాళ్ల డిమాండ్ అలా ఉంది మరి. పోనీలే పాపం అని ఒకటి రెండు రోజులకు పంపిస్తామా.. మనకే ఎసరు పెట్టేసే తెలివితేటలు ఉన్నాయి మనవాళ్ల దగ్గర. ఏం చెబుతారో తెలియదు కానీ, వాళ్లింటికి వెళ్లిన ఆమె మళ్ళీ తిరిగి మా ఇంటికి రాదు. నెల ఫస్ట్‌కి వచ్చి జీతం తీసుకోవడం తప్ప.. అట్లున్నారు మన దోస్తులు!

అసలే కష్టకాలం. సొంతంగా ఇల్లు కట్టుకోగలం, పిల్లల పెళ్లిళ్లు చేసేయగలం.. కానీ ఈ రోజుల్లో పనిమనుషులని మాత్రం సంపాదించుకోలేం. అది బహు కష్టం! చదవండి మరి..

పిల్లల దగ్గర ఓ మూడు నెలలు ఉందామని ముచ్చట పడి యూఎస్ వెళ్తామా? అన్ని టెన్షన్ల కంటే పనిమనిషి టెన్షన్ పెద్దది. ఎందుకంటే..

“అమ్మగారు! మీరు పిల్లల దగ్గరికి వెళ్తే వెళ్లండి కానీ, నా జీతం మాత్రం నాకు ఫుల్ పే చేయాల్సిందే. కరాఖండిగా చెబుతున్నా!” – లక్ష్మి వైపు విస్తుపోయి చూడడం నా వంతు అయింది. “మేము ఉండము కదా, మొత్తం జీతం ఎలా ఇస్తాను?” అని దబాయించబోయాను.

“మీరు వెళ్లడం నా తప్పు కాదుగా అమ్మగారు? నేను ఊరు వెళ్తే ఇట్స్ ఓకే, కానీ మీరు మీ ఇష్టంతో వెళ్తున్నారు కాబట్టి, జీతం మొత్తం ఇవ్వాల్సిందే లేదంటే నాకు కట్టం అవుతాది. ఇంకో వేరే ఇల్లు పట్టేసుకుంటాను మరి మీరు జీతం ఇవ్వనంటే” బెదిరింపు లోకి దిగింది..

ఆ లాస్ట్ వాక్యానికి నా గుండె బెదిరిపోయింది. యూఎస్ కాదు కానీ, పనిమనిషి వేరే ఇల్లు పట్టేసుకుంటే వచ్చాక నా పరిస్థితి ఏమిటి? అమ్మో! ఆ ఊహే భయంగా ఉంది.

“అది కాదే లక్ష్మీ..” అన్నాను. “నో అమ్మగారు.. నో! ఖచ్చితంగా మొత్తం జీతం ఇవ్వాల్సిందే” అంది. “ఏ పని చేయకుండా ఎలా?” అని నసిగాను. “ఆ.. మీరు లేకుంటే నేనేం చేస్తా? చేపించుకోండి, వద్దన్నానా? అయినా సారుగారు ఇస్తారంటే మీకేంటి అమ్మగారు?” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది.

“సార్‌ని ఎప్పుడు అడిగావు?” అంటే, “నిన్ననే అడిగేసా! ఓకే అనేశారు” అని గర్వంగా చెప్పింది. ఈయన ఒకరు! ఏదీ సరిగ్గా నాతో చెప్పరు. లోపలే విసుక్కున్నాను కానీ, ఒప్పుకోక తప్పలేదు మరి.

“పోనీ మొక్కలకి నీళ్లు పోయ్” అన్నాను. “ఆ.. పోసేస్తాను” అంది. “ఇంటి ముందు ముగ్గు వెయ్యి” అంటే, “ఓకే వేసేస్తా” అంది. వేసిందా లేదా ఆ దేవుడికే తెలియాలి! సీసీ కెమెరాలో చూస్తే వారానికి ఏదో ఒకటి రెండు రోజులు మాత్రమే కనిపించేది మాకు.

మొత్తానికి యూఎస్ నుండి మూడు నెలల తర్వాత నేను వచ్చేసరికి మొక్కలు సగం సచ్చాయి. అది వేరే సంగతి! ఆ మూడు నెలల్లో ఫస్ట్ తారీకు కల్లా గూగుల్ పే చేయించుకునేది లక్ష్మి. ఇంచక్కా బాధ అనిపించినా ఇవ్వక తప్పలేదు మరి. తీరా వచ్చాక మాత్రం ఓ వారం పనికి వచ్చింది లక్ష్మి. “ఇల్లు మారుతున్నాం” అంటూ వెళ్లిపోయింది!

Housemaid నాకు మళ్ళీ పనిమనుషుల వేట మొదలైంది. చదువయ్యాక ఉద్యోగం సంపాదించడానికి కూడా నేను ఇంత కష్టపడలేదు. ఏం చేస్తాం? తప్పదు మరి. పనివాళ్లకి నెల నెల పింఛన్లు, ఫీజులు, రేషన్ కార్డులు.. ఇవన్నీ ప్రభుత్వం సమకూరుస్తున్నాక, పనికి రావడానికి మనుషులే కరువయ్యారు.

Housemaid Problems

నానా తిప్పలు పడగా ఒక ఆమె వచ్చింది. “ఎంత ఇస్తారు అమ్మగారు? నేను గంట సేపు కంటే ఎక్కువ ఉండను” అంది. రూల్స్ నేను పెట్టడం కాదు, వాళ్లు చెబుతుంటే నేను వినాల్సి వచ్చింది. కర్మ!

“అంట్లు తోమి, బట్టలుతికి, బాత్‌రూమ్‌లు కడిగి..” నా మాట పూర్తి కాకుండానే, “బట్టలా? అమ్మో! నాకు సర్ఫ్ అలర్జీ. డాక్టర్ వద్దన్నారు” అంది. నిశ్శబ్దంగా వినడం తప్ప ఏం చేయలేకపోయాను.

Housemaid Problems: ఇంకొక ఆమె, “బాత్‌రూమ్స్ మేము కడగం అమ్మ.. గలీజ్” అంది. ఇంకొక ఆమె ఏకంగా, “ఒక 50,000 అడ్వాన్స్ ఇస్తే నెల నెల తీరుస్తానండి” అంది. వామ్మో! పనివాళ్లందరికీ ఓ దండం పెట్టి, నేనే ఉదయం లేచి మెల్లగా పని చేసుకోసాగాను.

ఏంటో! నాకు ఎప్పుడు పనిమనిషి దొరుకుతుందో? నేనెప్పుడు సుఖపడతానో అని అనుకోసాగాను. “దేవుడా! ఓ మంచి దేవుడా! నాకు మంచి పనిమనిషి దొరికేలా ఆశీర్వదించు స్వామి.. నీ కొండకు వస్తాను” అని ఆఖరికి దేవుడికి కూడా మొక్కేశాను. చూద్దాం నా ప్రాప్తం ఎలా ఉందో! ఈలోగా మీకు ఎవరైనా తెలిస్తే పంపిస్తారా ప్లీజ్ ప్లీజ్!

click here to read more: pet4thfloor అపార్ట్‌మెంట్‌లో కుక్కని పెంచుకుంటే అరిష్టమా? అసలు నిజం ఇదే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

google-site-verification: googlee1f767d3d556c059.html