కల్తీ కాటు…ఆరోగ్యానికి చేటు…

Spread the love

కల్తీ కాటు…ఆరోగ్యానికి చేటు…

రుచికి ఫిదా.. ఆరోగ్యానికి దగా: మన ఆహారం ఎంత సురక్షితం?

అసలు ‘సురక్షితమైన ఆహారం’ అంటే ఏమిటో మనం ఆలోచిస్తున్నామా? ఇప్పుడు మనకు తెలిసిన భద్రతల్లా ఒక్కటే.. ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అయిందా లేదా? ప్యాకింగ్ మీద డిస్కౌంట్ కూపన్ ఉందా లేదా? అంతే! ఆహారం అనేది ఇప్పుడు ఒక అవసరం కాదు, అదొక విలాసం. ఆ విలాసం మాటున మనం నిత్యం విష పదార్థాలను ఎంత ఎంజాయ్‌గా ఆరగిస్తున్నామో ఒక్క నిమిషం ఆలోచిస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు.

ఆకర్షణే ఆహారమైతే?

హోటల్ బయట గ్లాస్ వెనుక రంగు రంగుల్లో అందంగా అమర్చి ఉన్న ఆహారాన్ని చూడగానే మన నోరూరుతుంది. ఆ ఆకర్షణ వెనుక ఎంతటి ‘కెమికల్ గారడీ’ ఉందో మనకు అనవసరం. పండు పచ్చగా కనిపించడానికి వేసే రంగులు, కూరల్లో రుచి కోసం కలిపే అజినోమోటోలు, నూనెలను మళ్ళీ మళ్ళీ మరగ బెట్టడం.. ఇవన్నీ మన పొట్టను ఒక డస్ట్ బిన్‌లా మార్చేస్తున్నాయి. ఆన్‌లైన్ యాప్స్‌లో ఫ్లాట్ 50% ఆఫర్ అనగానే, ఆ ఆహారం నాణ్యతను కాకుండా మన సేవింగ్స్‌ను లెక్కేసుకుంటున్నాం. విలాసమంటే విష పదార్థాలను ‘బై వన్ గెట్ వన్’ పద్ధతిలో ఇంటికి తెప్పించుకోవడం కాదనే కనీస జ్ఞానాన్ని కోల్పోతున్నాం.

20

కల్తీ.. కల్తీ.. ఎక్కడ చూసినా కల్తీనే!

ఒకప్పుడు ఇంట్లో వండిన అన్నం, పప్పు కమ్మగా ఉండేవి. కానీ ఇప్పుడు కూరగాయల దగ్గర నుంచి పాల వరకు అంతా కల్తీ మయం. పాలు తెల్లగా ఉండటానికి యూరియా, పండ్లు త్వరగా పండటానికి కార్బైడ్, కూరగాయలు మెరిసి పోవడానికి రంగులు.. ఇలా ప్రతిదీ ఒక విష ప్రయోగమే! మనం తింటున్న బిర్యానీలో వాడే చికెన్ ఏ కాలం నాటిదో తెలియదు, ఆ మసాలాల్లో ఏముందో అర్థం కాదు. అయినా సరే, ‘చాలా టేస్టీగా ఉంది’ అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నాం. ఆహార భద్రత అంటే కేవలం కడుపు నిండటం కాదు, ఆ తిన్నది మన ప్రాణాలను హరించకుండా ఉండటం.

భవిష్యత్తు తరాలకు మనం ఇస్తున్నది ఇదేనా?

చిన్న పిల్లలకు సైతం చిప్స్, ప్యాక్డ్ జ్యూస్ లు, నూడుల్స్ అలవాటు చేసేస్తున్నాం. వాళ్ళు ఆ వస్తువులను ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మనం మురిసి పోతున్నాం కానీ, వాళ్ళ ఎదుగుదలని ఆ విషపూరిత కెమికల్స్‌తో ఆపేస్తున్నామని గుర్తించడం లేదు. ఆహారం అనేది మనిషికి మందులా పని చేయాలి, కానీ ఇప్పుడు అది మందుల షాపులకి మనల్ని నడిపిస్తోంది.

తినడం కోసం బ్రతకడం కాదు, బ్రతకడం కోసం తినాలి. ఆ తినేది ఏదో కాస్త పరిశీలించి, నాణ్యమైనది ఎంచుకుందాం. బయట దొరికే రంగుల ఆహారం కంటే, ఇంట్లో అమ్మ వండిన గోరుముద్దే అతిపెద్ద ఆహార భద్రత. ఈ జూన్ 7న ఒక శపథం చేద్దాం.. రుచి కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు పెద్దలు!

19

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *