World Blood Donor Day | ఒక యూనిట్ రక్తం… ఎన్నో ప్రాణాలకు ఆశాకిరణం
World Blood Donor Day | రక్తదానం… ప్రాణాలను కాపాడే మహాదానం
World Blood Donor Day | రక్తం… మనిషి శరీరంలో ప్రవహించే జీవనాధారం. కానీ అదే రక్తం ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడు, అది కేవలం వైద్య అవసరం మాత్రమే కాదు, ఒక ప్రాణాన్ని తిరిగి నిలబెట్టే మహోన్నత సహాయం. అందుకే ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది కేవలం క్యాలెండర్లో మారే తేదీ కాదు… “మనిషి మనిషికి అండగా నిలబడాలి” అనే సందేశాన్ని గుర్తు చేసే ప్రత్యేకమైన రోజు.
World Blood Donor Day | ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు, ప్రసవ సమయంలో రక్తస్రావంతో ప్రాణాపాయంలో ఉన్న మహిళ, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న చిన్నారి, ప్రతి నెలా రక్తం అవసరమయ్యే థలసీమియా రోగి…ఇలా చూస్తే ఎంతో మంది…ఎన్నో ఆసుపత్రుల గదుల్లో ప్రతి రోజు రక్తం కోసం ఒక నిశ్శబ్ద నిరీక్షణే. అక్కడ డబ్బు కంటే విలువైంది ఒక యూనిట్ రక్తం. అదే ప్రాణాలను నిలబెడుతుంది.
World Blood Donor Day | జూన్ 14ను రక్తదాతల దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి కూడా ఒక కారణం ఉంది. మానవ రక్తంలోని ఏబీవో రక్త గ్రూప్ వ్యవస్థను కనుగొన్న నోబెల్ గ్రహీత కార్ల్ ల్యాండ్స్టైనర్ జన్మదినం జూన్ 14. ఆయన పరిశోధన వల్లే నేడు సురక్షిత రక్త మార్పిడి సాధ్యమైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజును రక్త దాతలకు అంకితం చేసింది.

World Blood Donor Day | మన దేశంలో రక్తం అవసరం రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య మాత్రం ఆశించినంతగా పెరగడం లేదు. “రక్తం ఇస్తే బలహీనమవుతాం”, అని, రక్తం ఇస్తే ఆరోగ్యం దెబ్బ తింటుంది” అనీ అపోహలు ఇప్పటికీ చాలా మందిని రక్తదానం చెయ్యకుండా వెనక్కి లాగుతున్నాయి. వైద్యులు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కొన్ని రోజుల్లోనే శరీరం తిరిగి రక్తాన్ని పునరుద్ధరిస్తుంది.
అప్పుడప్పుడు రక్తదానం చెయ్యడం కూడా ఒకరకంగా ఆరోగ్యానికి మంచిదనే చెప్పవచ్చు.
World Blood Donor Day | పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాలు ఎలా గుర్తుంచుకుంటామో, అదే విధంగా రక్తదానాన్ని కూడా ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలి. సెల్ఫీ పోస్ట్ చేయడం కంటే, ఎవరికో ప్రాణం పోకుండా కాపాడడం గొప్ప సామాజిక బాధ్యత అని తెలుసుకోవాలి.
రక్తదానం అనేది ధనవంతుల పని కాదు… మనసున్నవారి పని. డబ్బు లేక పోయినా చేయ గలిగే అతి పెద్ద దానం ఇదే. మనం ఇచ్చేది కేవలం కొద్దిపాటి రక్తం మాత్రమే… కానీ అందుకునే వ్యక్తికి మాత్రం అది విలువైన జీవితాన్ని కాపాడే సంజీవని.
World Blood Donor Day | ప్రపంచ రక్తదాతల దినోత్సవం మనకు ఒక్కటే చెబుతోంది.. “రక్తం పంచండి, ప్రాణాన్ని కాపాడండి.” సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగా ఉందని నిరూపించేది ఇలాంటి దానాలే. ఒక రోజు, ఒక దానం… కానీ దాని విలువ మాత్రం నిలిచి ఉండేది ఒక జీవితకాలం.

click here to read more: below15yrslabour బాలకార్మికత్వ నిర్మూలన: చిన్నారుల జీవితాలు మారుతున్నాయా?



