google-site-verification: googlee1f767d3d556c059.html

ఉపన్యాసాలు వేదికల మీద.. హాని మాత్రం లోకం మీద!

Spread the love

ఉపన్యాసాలు వేదికల మీద.. హాని మాత్రం లోకం మీద!

ప్రపంచ పర్యావరణ దినోత్సవం వచ్చిందంటే హడావిడి ఎందుకు?

జూన్ 5 వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఒకటే హడావిడి. కోటు వేసుకున్న పెద్ద మనుషులంతా అంతర్జాతీయ వేదికల మీద ఎక్కి పర్యావరణాన్ని ఎలా కాపాడాలో గంటల తరబడి ఉపన్యాసాలు దంచేస్తుంటారు. ప్లాస్టిక్ వాడొద్దు అంటారు, చెట్లు నాటాలి అంటారు, భూమి వేడెక్కుతోంది అంటూ గట్టిగా అరుస్తూ హెచ్చరిస్తారు. వినడానికి చాలా బాగుంటుంది ! కానీ, ఆ మీటింగ్ ముగిసిన తర్వాత బయట చూస్తే.. వారు వచ్చిన పెద్ద పెద్ద కాన్వాయ్ కార్లపొగతో వారు కాపాడాలనిపిలుపునిచ్చిన పర్యావరణం ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అసలు పర్యావరణం అనేది ఇప్పుడు ఒక ‘ఆచరణ’ కంటే ‘అలంకార ప్రాయమైన సబ్జెక్ట్’ గా మారి పోయిందేమో అనిపిస్తోంది.

18

ఎవరు ఎంత ధ్వంసం చేస్తున్నారు?

పర్యావరణాన్ని హాని చేయడంలో అభివృద్ధి చెందిన దేశాల పాత్రే ఈకువ అని సర్వేలు, గణాంకాలు చెబుతున్నాయి.. చైనా, అమెరికా లాంటి అగ్రదేశాల నుండి విడుదలయ్యే  పారిశ్రామిక వ్యర్థాలు, కార్బన్ ఉద్గారాలు భూమికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఒకవైపు గ్రీన్ ఎనర్జీ అంటూ కాకరకాయ కబుర్లు చెబుతూనే, మరోవైపు బొగ్గు వినియోగాన్ని, భారీ ఫ్యాక్టరీలను ఆపలేక పోతున్నాయి. ప్రకృతిని ‘అమ్మ’ అని పూజించే మన దేశంలో కూడా పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదనే చెప్పొచ్చు.. అభివృద్ధి, నగరీకరణ పేరుతో అడవులను నరికేయడం, నదుల్లోకి రకరకాల పారిశ్రామిక వ్యర్థాలను, మానవ విసర్జితాలను వదలడం మనకూ అలవాటైపోయింది.

ప్రయత్నాలు.. ఫలితాలు:

అయితే, ఇంత వినాశనాంలో కూడా ఆశాకిరణాలు లేకపోలేదు. కొన్ని దేశాలు నిజంగానే చిత్తశుద్ధితో ప్రకృతిని ప్రేమిస్తున్నాయి. ఉదాహరణకు భూటాన్.. ఇది ప్రపంచంలోనే ఏకైక ‘కార్బన్ నెగటివ్’ దేశం. అంటే ఆ దేశం విడుదల చేసే కాలుష్యం కంటే, అక్కడ ఉన్న అడవులు పీల్చుకునే కార్బన్ శాతం ఎక్కువ. నార్వే, స్వీడన్ లాంటి దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో, వ్యర్థాల నిర్వహణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మనం కూడా ‘సోలార్ ఎనర్జీ‘ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాం. సత్ఫలితాలు వస్తున్నాయి కానీ, అవి ప్రకృతిని ధ్వంసం చేస్తున్న వేగంతో పోలిస్తే చాలా తక్కువ.

17

మన తర్వాత తరాల భవిష్యత్తుకి మనం ఇస్తున్న గిఫ్ట్ ఏంటి?

మనం మన పిల్లల కోసం బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ప్లాట్లు, విల్లాలు ఇస్తున్నాం అని మురిసిపోతున్నాం. కానీ, అసలు వాళ్లు బ్రతకడానికి అవసరమైన స్వచ్ఛమైన గాలిని, నీటిని ఇస్తున్నామా? అనేది అసలు ప్రశ్న. మనం ఇప్పుడు ప్రకృతికి చేస్తున్న గాయాలు రేపు సునామీలుగానో, భూకంపాలుగానో మన వారసుల మీదకు దాడి చేస్తాయి. వేదికల మీద ఇచ్చే ఉపన్యాసాల కంటే, మన పెరట్లో నాటే ఒక మొక్క, మనం తగ్గించే ఒక్క ప్లాస్టిక్ కవర్ ఎక్కువ మేలు చేస్తుంది.

పర్యావరణం అంటే ఎక్కడో అడవుల్లో ఉండే పులులు, ఏనుగులు కాదు.. అది మన ఇంట్లోని గాలి, మనం తాగే నీరు. ఈ జూన్ 5న ఫోటోల కోసం మొక్కలు నాటడం మానేసి, ఉన్న చెట్లను కాపాడదాం. గ్లోబల్ వార్మింగ్ గురించి గ్లోబల్ వేదికల మీద కాకుండా, మన ఇంటి ముంగిట గురించి, మన పరిసరాల గురించి ఆలోచిద్దాం. లేదంటే, భవిష్యత్తులో మన పిల్లలకు ‘చెట్టు’ అంటే కేవలం పుస్తకాల్లో కనిపించే ఒక డ్రాయింగ్‌గా మిగిలిపోతుంది!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *