Dog Paw Licking 7 కుక్క కాళ్లు పదే పదే నాకడం వెనుక కారణాలేంటి?
Dog Paw Licking 7 అలర్జీ నుంచి నొప్పి వరకు.. ఈ హెచ్చరిక సంకేతాలను గమనించండి
రాత్రి అందరూ నిద్రపోతున్నారు. కానీ హాల్లో మాత్రం లప్.. లప్.. అనే శబ్దం ఆగడం లేదు. లైట్ వేసి చూస్తే మీ పెంపుడు కుక్క తన కాళ్లను పదే పదే నాకుతోంది. “అలవాటే” అనుకుని చాలామంది పట్టించుకోరు. కానీ కొన్ని రోజుల తర్వాత అదే చోట ఎర్రబడటం, వాపు, వెంట్రుకల రంగు మారడం, కొరకడం మొదలైతే మాత్రం అది చిన్న విషయం కాదు.
నిపుణుల ప్రకారం, కుక్కలు అప్పుడప్పుడు కాళ్లు నాకడం సహజం. బయట తిరిగి వచ్చిన తర్వాత పాదాలకు అంటుకున్న మట్టి లేదా చిన్న అసౌకర్యాన్ని తొలగించేందుకు ఇలా చేస్తాయి. కానీ ఒకే కాలిని పదే పదే నాకడం, రాత్రిళ్లు కూడా ఆగకుండా నాకడం లేదా పళ్లతో కొరకడం కనిపిస్తే దాని వెనుక గాయం, దురద, నొప్పి, అలర్జీ, పరాన్నజీవులు లేదా మానసిక ఒత్తిడి వంటి కారణాలు ఉండొచ్చు.
ఒక్క కాలినే నాకుతుంటే ముందుగా ఆ కాలిని జాగ్రత్తగా పరిశీలించండి. ముల్లు గుచ్చుకుందా?, గోరు విరిగిందా?, వేళ్ల మధ్య ఏదైనా చిక్కుకుందా?, వాపు లేదా గాయం ఉందా? వంటి విషయాలు గమనించాలి. నొప్పి ఉన్న ప్రాంతాన్ని కుక్కలు పదే పదే నాకడం సాధారణ సంకేతంమని పశువైద్యులు చెబుతున్నారు. అయితే ఇంట్లోనే కత్తిరించడం లేదా మందులు రాయడం కాకుండా అవసరమైతే వెంటనే పశువైద్యుడిని సంప్రదించడం మంచిది.
అన్ని కాళ్లనూ నాకుతూ, చెవులు గోక్కుంటూ, ముఖాన్ని రుద్దుకుంటూ ఉంటే అది అలర్జీకి సంకేతం కావచ్చు. పుప్పొడి, గడ్డి, ఆహారం లేదా ఇతర పర్యావరణ కారణాల వల్ల అలర్జీలు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కాళ్ల వేళ్ల మధ్య ఎర్రబడటం, వెంట్రుకలు రాలిపోవడం, లాలాజలం వల్ల వెంట్రుకలు గోధుమ రంగులోకి మారడం కనిపించవచ్చు.
చాలామంది “నాకనివ్వండి… దురద తగ్గిపోతుంది” అనుకుంటారు. కానీ అదే పెద్ద తప్పు. ఎక్కువసేపు నాకడం వల్ల చర్మం మరింత దెబ్బతిని, బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్, వాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీంతో దురద మరింత పెరిగి కుక్క మళ్లీ మళ్లీ నాకే పరిస్థితి ఏర్పడుతుంది.
తెల్లటి వెంట్రుకలున్న కుక్కల్లో కాళ్ల వెంట్రుకలు గులాబీ లేదా తుప్పు రంగులోకి మారితే అది నిరంతర నాకడం వల్ల ఏర్పడే లాలాజలపు మరక కావచ్చు. అలాగే వేళ్ల మధ్య వాపు, పుళ్లు, రక్తస్రావం, దుర్వాసన లేదా కుంటుతూ నడవడం కనిపిస్తే ఆలస్యం చేయకుండా పశువైద్యుడి సలహా తీసుకోవాలి.

కొన్నిసార్లు అన్ని పరీక్షలు సాధారణంగానే వచ్చినా కుక్క కాళ్లు నాకుతూనే ఉంటుంది. అప్పుడు విసుగు, ఒంటరితనం, ఆందోళన, ప్రవర్తనా సమస్యలు కూడా కారణం కావచ్చు. అయితే ముందుగా వైద్యపరమైన కారణాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే దీనిని మానసిక సమస్యగా భావించాలి.
మీ కుక్క పదే పదే కాళ్లు నాకుతుంటే కొన్ని విషయాలు గమనించండి. ఒక్క కాలా? అన్ని కాళ్లా?, ఎప్పటి నుంచి?, వాకింగ్ తర్వాత ఎక్కువగా నాకుతోందా?, చర్మం ఎర్రగా ఉందా?, చెవులు గోక్కుంటోందా?, దుర్వాసన వస్తోందా?, కుంటుతోందా? వంటి వివరాలు పశువైద్యుడికి ఉపయోగపడతాయి. వీలైతే వీడియో తీసి చూపించడం కూడా మంచిదే.
మొత్తానికి, కుక్క అప్పుడప్పుడు కాళ్లు నాకడం సాధారణం. కానీ అదే పనిగా నాకడం, ఎర్రబడటం, వాపు, గాయం, కొరకడం, దుర్వాసన లేదా కుంటడం కనిపిస్తే దాన్ని “అలవాటే” అని నిర్లక్ష్యం చేయొద్దు. అది మీ పెంపుడు జంతువు తనకు ఉన్న ఇబ్బందిని మీకు చెప్పే ప్రయత్నం కావచ్చు. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తే మీ కుక్క ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది.



